శ్రీరాముడు రావణుని కన్నా బలహీనుడా?

Spread the love

– ఇతరుల సాయం ఎందుకు తీసుకున్నాడు?

గత ఆదివారం తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కలిసి చీకటి జీవో నెం.1 గురించి చర్చించి ఓ కప్పు కాఫీ తాగితే… జగన్ రెడ్డి, ఆయన భజనగణం మూడు చెరువుల నీరు తాగారన్న తెలుగుదేశం వ్యాఖ్య ప్రజల్లో బాగా పేలింది. ఈ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో బహుశా కలిసి పోటీ చేయవచ్చు, ఆ విధంగా చేస్తే తమ పవర్ కట్ అవుతుందని జగన్ బృందం వణికిపోతోంది. అందుకనే ఆసంబద్ద వ్యాఖ్యలతో అట్టి పొత్తు కుదరకుండా చేయాలని నానా తంటాలు పడుతున్నారు అధికారపార్టీ గణం. దమ్ముంటే సింగిల్ గా తెలుగుదేశం పోటీ చేయాలని… జనసేనకు 175 సీట్లల్లో పోటీ చేసే సత్తా ఉందా అని సవాళ్లు చేస్తూ ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే తప్పని, అనైతికమని కూడా దిగజారి మాట్లాడుతున్నారు జగన్ బృందం.

ఈ నేపధ్యంలో ప్రతిపక్ష పార్టీల కూటములు తత్సంబంధిత విషయాల గురించి క్లుప్తంగా చర్చించుకోవడం ఉచితం. ప్రధాన ప్రశ్న ఏమంటే అధికారపార్టీని ఓడించడానికి ప్రతిపక్షాలు కలిస్తే అది తప్పా? గత డిసెంబర్ 27న విజయవాడలో తెదేపా ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ప్రముఖ దళిత నాయకుడు పోతుల బాలకోటయ్య ఈ ప్రశ్నకు చక్కటి సమాధానం చెప్పారు. ఆయనేమన్నారంటే… భగవత్ స్వరూపుడు, సర్వశక్తిమంతుడయిన శ్రీరామ చంద్రుడు ఒంటరిగా రావణాసురుడిని ఓడించలేక వాలి, సుగ్రీవుడు, విభీషణుడు, హనుమంతుడు, వానరసైన్యాల మద్ధతు తీసుకున్నాడా? కానేకాదు… ఒక దుర్మార్గుడిని ఓడించడానికి ప్రజలందరిని సమాయత్తం చేసి అది ప్రజా విజయంగా నిరూపించవల్సిన అవసరం ఉన్నందున శ్రీరాముడు ఇతరుల సహాయం తీసుకున్నారని… జగన్ రెడ్డికి ఈ అవగాహన లేక మాట్లాడుతున్నాడని బాల కోటయ్య గారు వివరించారు.

ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ గారి పయనాన్ని పరిశీలిద్దాం. 2014 లోక్ సభ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకొని కేంద్రంలో 30 ఏళ్ల సంకీర్ణ ప్రభుత్వాల పాలన అనంతరం బీజేపీ నాయకత్వంలో సింగిల్ పార్టీ మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీకి సింగిల్ గా మెజారిటీ వచ్చినా 2019 ఎన్నికల్లో తిరిగి ఎన్డీఏ అలయెన్స్ గా పోటీ చేసి గెలిచారు. మోదీ గారు భయపడి ఈ విధంగా చేశారా? విశాల భారతదేశంలో అన్ని వర్గాల ప్రజల ప్రాతిధ్యాన్ని ప్రతిబంభింపజేయడానికే ఆయన వివిధ పార్టీల సంకీర్ణంగా పోటీ చేసి ప్రభుత్వాన్ని తిరిగి ఏర్పాటు చేశారు. జగన్ బృందం ఆలోచన మేరకు మోదీ గారి ఈ విధంగా చేయడం తప్పు కాదా? తెదేపా, జనసేనల ఊహాత్మక పొత్తు గురించి బెంబేలెత్తి ఏదేదో మాట్లాడుతున్న జగన్ బృందం అదే ప్రశ్నలను బీజేపీకి ఎందుకు సంధించటం లేదు? వారిదగ్గర జవాబు ఉండదు.

దేశ స్వాతంత్రానంతరం దాదాపు 20 ఏళ్లు కేంద్రంలోను, రాష్ట్రాల్లోను కాంగ్రెస్ పాలించిన తరువాత 1967లోనే పొత్తులు, సంకీర్ణ ప్రభుత్వాల అధ్యాయం మొదలయ్యింది. దీంతో ప్రాంతీయ పార్టీల ఏర్పాటు, వాటి విస్తరణలతో ఫెడరల్ వ్యవస్థ దేశంలో మరింత బలిష్టమైంది. శతాబ్దాలుగా వంచనకు గురైన జాతులకు, కులాలకు రాజకీయ సాధికారిత ఏర్పడి వారి గళం రాజకీయ ఎవనికపై గర్జించడం మొదలయ్యింది. కరుడుగట్టిన పెత్తందారి అయిన జగన్ రెడ్డికి ఈ పరిణామం రుచించదు. వంచనకు గురవుతున్న అట్టి వర్గాలను ఇంకా అణగదొక్కాలని ఆయన లక్ష్యం. ఒక ఛాన్స్ అంటూ ప్రాదేయపడి 151 సీట్లతో అధికారం చేపట్టినప్పటి నుండి తనకు మద్ధతునిచ్చిన ప్రజలను నిలువునా నీట ముంచి వారి ఉజ్వత భవితను సమాధి చేయడమే లక్ష్యంగా పెట్టుకొని విద్వంస పాలన సాగిస్తున్న సైకో రెడ్డికి ప్రజా కూటమి గిట్టదు. ఈ మనసికత జగన్ రెడ్డి ఆయన భజన గణంలో స్పష్టంగా వెల్లడౌతుంది.

2004లో కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి కలిసి పోటీ చేసి గెలిస్తేనే కదా జగన్ రెడ్డి తండ్రి అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అయింది. అది అనైతికమా? తనకు, తన తండ్రికి ఒకనీతి ఇతరులకు వేరొకటా? తాను, తన కులానికి చెందిన మరో నలుగురు పెత్తనం చేస్తుంటేనే కదా జగన్ ప్రభుత్వం ఒక కుల ప్రభుత్వమని ముద్ర వేసుకుంది. ఏక కుల ప్రభుత్వమే సాగాలని జగన్ కాంక్ష కాబోలు. అందుకే తనను ఓడించటానికి ఎవరూ కలవకూడదని ఆరాటపడుతున్నారు. ఉప్పొంతున్న ప్రజా వ్యతిరేకత స్పష్టంగా వెల్లడి అవుతున్నప్పటికి 175 సీట్లు తామే గెలుస్తామని డంబాలు పలుకున్న జగన్ రెడ్డి వెన్నులో ఒణుకు మొదలయ్యింది.

నిజంగా ప్రజలు తమ వెంటే ఉన్నారనే నమ్మకం ఉంటే చంద్రబాబు సభలను నిషేదిస్తూ చీకటి జీవో నెం.1 జారీ చేయవల్సిన అవసరం ఏముంది? ప్రశ్నించిన ప్రతి సామాన్యుడి గొంతు నొక్కుతూ చిల్లర కేసులు పెట్టవల్సిన ఆగత్యమేముంది.? వేలాది పోలీసుల బందోబస్తు, బారికేడ్లు, పరదాల మాటున తిరగవల్సిన అవసరం జగన్ కు ఎందుకు దాపురించింది? తన పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడవల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? సమాధానం స్పష్టం… జగన్ పీఠాలు కదలిపోయాయి… ఓటమి తధ్యమని నిర్ధారణ అయ్యింది.

ప్రజా మద్ధతుతో 151 సీట్లతో అధికారం చేపట్టి హుందాగా వ్యవహరిస్తూ ప్రజానుకూల పాలన చేయవల్సిన జగన్ రెడ్డి సైకోగా వ్యవహరిస్తూ అబద్దాలు, అకృత్యాలు, అరాచకాలు, అప్పుల కుప్పలతో సామాన్యడి నడ్డి విరిచారు. నిజంగా నేడు ప్రజలు తన వెంటే ఉన్నారన్న నమ్మకం, ఆత్మస్థైర్యం ఉంటే ప్రతిపక్షాల కూటమిని ఊహించుకొని బెంబేలు పడవల్సిన అవసరం ఏమాత్రం లేదు. దీనికి విరుద్ధంగా నడుస్తున్న జగన్ ప్రవర్తన ఆయనలో గూడుకట్టుకున్న తీవ్రమైన అబధ్రతా భావానికి స్పష్టమైన సంకేతం.

ఈ ఒక్కసారి ఎట్లైన గెలవాలి… లేకపోతే సమాధి అవుతామంటున్న జగన్ వ్యాఖ్యలు, ఓడిపోతే అవమానకరమన్న బొత్స మాటలు, గెలిచే సీను లేదంటున్న ఆనం మాటలు, ప్రజల్లో సైకిల్ గాలే తోలుతుందన్న ధర్మాన నిజాయితీ వచ్చే ఎన్నికల అనంతరం రానున్న మార్పుకు స్పష్టమైన సంకేతాలు.

ఫించన్ కావాలని దీనంగా అడిగే మహిళల కళ్లల్లో కారం చల్లుతున్న వైసీపీ నేతలు, ఫ్రీగా మాంసం ఇవ్వలేదని ఫించన్లు కట్ చేస్తామన్న వాలెంటీర్లు, అప్పులు పుట్టడం లేదని ఫించన్ దారులకు దొంగ నోట్లు ఇస్తున్న ప్రభుత్వం… ఇట్టి పలు నిర్వాకాలతో ప్రజలు తమకు చరమగీతం పాడతారని జగన్ భజనగణం డిసైడైపోయారు. అందుకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంటే భయం. ఏ విధంగానైన వాళ్లిద్దరిని కలవకుండా చేయాలని కుట్రలు.

చల్లని వెన్నెలతో చంద్రుడు మనోల్లాసం కలిగిస్తాడు… అలసిన జనానికి పవనుడు సేదతీరుస్తాడు… పొత్తుల సంగతి ఎట్లున్నా చంద్రపవనమంటే జగన్ రెడ్డికి ఇప్పటి నుంచే చెమటలు పడుతున్నాయి. కనుక… రాబోయే మరో చీకటి జీవో బహుశా ఏమంటే… రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఎన్నికల పొత్తులు పెట్టుకోకూడదు… ముఖ్యంగా తెలుగుదేశం, జనసేనలు కలవకూడదు.

– అంచా అయ్యేశ్వరరావు
(మాజీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి)

Leave a Reply