Suryaa.co.in

Features

వంట నూనెలు కావవి… మంట నూనెలు

-సలసల కాగుతున్న వంట నూనె ధరలు
-సామాన్యుడి నడ్డి విరుస్తున్న వంట నూనె ధరలు
-వేరుశనగ దిగుబడి లేకపోవటంతో తెరుచుకోని నూనె మిల్లులు

వంట నూనెల ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల గతంలో భారీగా పెరిగిన నూనెల రేట్లు ఈ మధ్యే తగ్గాయి. అంతలోనే మళ్లీ పెరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో రైతులు శ్రమ తక్కువ ఫలితం ఎక్కువగా ఉండటానికి అలవాటు పడ్డారు. గత సంవత్సరం క్రాప్ ఇన్యూరెన్స్ మొత్తం ఎక్కువగా పత్తి, కందికి ఎక్కువగా ఉండటం అలాగే వేరుశెనగ కు కేవలం వందల్లో ఇవ్వటంతో జిల్లా రైతులు తమ పొలాల్లో వేరుశెనగ నుండి పత్తికి మారారు. ఈ సంవత్సరం పశుగ్రాసానికి అలాగే మంచి నూనెకు నామమాత్రంగా వేసిన వేరుశెనగ పూర్తి నిరాశకు గురిచేసింది.

తెగుళ్ల బారినుండి కలుపు నివారణకు భూములు నిస్సారంగా మారనున్న స్టాంప్, పెండ మిథేన్, గ్లైసిల్ లాంటి నివారణ మందులు వాడుతున్నారు. నాలుగు సంవత్సరాల క్రిందట వీటిని నిషేధించిన అవి మార్కెట్లో ఎక్కువ ధరకు దొరుకుతాయి. దేశంలోనే అత్యధికంగా వేరుశెనగ విత్తే ప్రాంతం అనంతపురం జిల్లా , తీవ్ర వర్షాభావ పరిస్థితులున్న, అధిక వర్షాలున్న, క్షామం ఉన్నా గత అరవై సంవత్సరాలుగా వేరుశెనగ పండిస్తూనే ఉన్నారు. ఇక్కడ రైతుకు పంట మార్పిడి తెలియదు, వ్యవసాయం ఎక్కువగా సాంప్రదాయ పద్దతిలో జరిగేది. గత ఇరవై సంవత్సరాల క్రిందట గుత్తి కాయ, తీగ కాయ అని రెండు రకాల వేరుశెనగ విత్తనం ఉండేవి. వేరుశెనగ విత్తనం బయట నుండి కొనే రైతులు తక్కువ. ఎక్కువుగా తాము పండించిన పంటలోనే కొంత భాగం విత్తనం తీసిపెట్టే వారు. ప్రతి సంవత్సరం మే నెల నుండి విత్తనం మనుషుల ద్వారా వలచడము జరిగేది. కానీ ఇప్పుడు విత్తనం నిల్వఉంచడం లేదు, ఒక వేళ నిల్వఉంచిన అది ఎందుకు పనికిరాకుండా పోతుంది. గత ఇరవై సంవత్సరాలుగా రైతులు విత్తనం కోసం వ్యవసాయ శాఖ మీద ఆధారపడి ఉన్నారు.

ఇప్పుడు ఇస్తున్న రకాలు కే 6, రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణి చేస్తున్నారు. కదిరి లేపాక్షి 1812 రకం కేవలం అగ్రికల్చర్ రీసర్చ్ సెంటర్ లో 22000 కు విక్రయిస్తున్నారు. సామాన్య రైతుకు అందుబాటులో లేవు. ట్యాగ్ 32, గుజరాత్ జునాఘఢ్ 32, ఐ సి జి వి 350 రకాలు కొద్ది ప్రాంతాలల్లో ప్రయివేటు వ్యక్తుల ద్వారా సరఫరా చేయబడ్డాయి. ఈ సంవత్సరం కే 6 రకం పూర్తిగా విఫలమైనది, జర్మినేషన్ లేక పోవడం, వాతావరణం అనుకూలించక పోవడం, గత రెండు సంవత్సరాలుగా అధిక వర్షం మొక్కల పెరుగుదలను దెబ్బతీస్తుంది. ఆకు వ్యాధి, తెగులు దాడులు, విపరీతమైన కలుపు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు సమృద్ధిగా వర్షాలు కురిసినప్పుడు రైతులు సంతోషించారు, కానీ జిల్లాలో దాదాపు 5 లక్షల హెక్టార్లలో వేసిన వేరుశనగ పంట నీరు నిలిచిపోవడం లేదా మట్టిలో అధిక మిశ్రమం కారణంగా తీవ్రంగా దెబ్బతింది.రేకులకుంట వ్యవసాయ పరిశోధనా కేంద్రంలోని శాస్త్రవేత్తలు జూన్, జూలై మరియు ఆగస్టులలో పండించిన పంటలను పరీక్షించి, దిగుబడిని అంచనా వేశారు, ఇది సగటు తుది దిగుబడి హెక్టారుకు 400 కిలోల కంటే తక్కువ ఉండే అవకాశం ఉందని తెలియచేస్తున్నారు.

వాణిజ్యపరంగా రైతుకు బ్రేక్ ఈవెన్, హెక్టారుకు కనీసం 700 కిలోలు ఉండాలి. జూన్ 1 నుంచి ఆగస్టు 20 వరకు 530 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో వేరుశనగ పంట బాగా దెబ్బతింది. జూలైలో విత్తిన చాలా పంట ఆకు ఆకుపచ్చ నుండి పసుపు రంగులోకి మారి ఆకు మచ్చ వ్యాధి ఏర్పడింది. చీడపీడలు పీల్చుకోవడం వల్ల పెద్ద ప్రాంతంలో పంటపై దాడి చేసింది.పేలవమైన పుష్పికరణ జూన్ మరియు జూలైలో విత్తిన వేరుశెనగ పంట (వరుసగా 47,050 హెక్టార్లు మరియు 4,11,128 హెక్టార్లు) పుష్పించే మరియు పెగ్‌లు ఏర్పడటం, పెగ్‌లను పాడ్‌లుగా మార్చడంతో మందపాటి వృక్షసంపద వృద్ధిని సాధించింది.

ప్రభుత్వం ద్వారా సబ్సిడీపై సరఫరా చేయబడిన K-6 రకం విత్తనాలపై పెద్ద ఎత్తున ఆకు మచ్చలు మరియు చీడ తెగులు దాడులు సంభవించాయి, వేరుశెనగ వ్యాపారస్తులు గ్రామానికి వెళ్లడం లేదు. రైతే అతి కష్టం మీద దళారులను ఆశ్రయించో లేక ప్రెవేటు వర్తకులకు సరుకు అమ్ముతున్నాడు. వేరుశెనగ లేక చాల గ్రామాల్లో చిన్నస్థాయి మిషన్లు టిల్లర్లు మూతపడుతున్నాయి. వచ్చిన నూనె కూడా నాసిరకంగా ఉంటుంది. నూనె చేదు మరియు నురుగు ఎక్కువగా వస్తున్నది. భవిష్యత్తులో వేరుశెనగ నూనె మరిచిపోవాల్సిందే. పండగ సీజన్‌లో ముందు వంట నూనెలు షాకిస్తున్నాయి.

రోజు రోజు రేట్లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా గత పది రోజులుగా వంటనూనెల ధరలు భగ్గుమంటున్నాయి. ఉక్రెయిన్‌ పై రష్యా దాడులు మళ్లీ పెరగడంతో ఆ ప్రభావం వంట నూనెలపై పడుతోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం పండగల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే కొత్త సంవత్సరం ముగిసింది. సంక్రాంతి కూడా వస్తోంది. ఈ నెలాఖరు నుంచి మాఘమాసం కూడా మొదలవుతున్న నేపథ్యంలో వంట నూనెలు డిమాండ్ పెరుగుతోంది. పొద్దుతిరుగుడు నూనె ధర పెరగడం వల్ల దాని ప్రభావం ఇతర వంటనూనెలపైనా పడుతోంది.

పామాయిల్‌ ధర రెండు నెలలుగా పడిపోతుండగా, ఇప్పుడు ఒక్కసారిగా రూ.110 చేరుకుంది. ఐతే వంట నూనెలకు డిమాండ్‌కు క్యాష్ చేసుకునేందుకు కొందరు వ్యాపారులు రష్యా యుద్ధాన్ని సాకుగా చూపి ధరలు పెంచుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పొద్దుతిరుగుడు, వేరుశనగ నూనెల ధరలు 160 నుండి 180 వరకు ఉండటంతో పామాయిల్‌ విక్రయాలు బాగా పెరిగాయి. పామాయిల్ ధర లీటరుకు రూ.110లోపే ఉండటంతో హోటళ్లు, శుభకార్యాలయాల్లో దీనికి డిమాండ్ పెరుగుతోంది.

దీనికి తోడు కల్తీ నూనెలు భారీగా దిగుమతి అవుతున్నాయి. ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బియ్యం, పప్పులు, పాల ధరలతో పాటు ఇప్పుడు నూనె ధరలు కూడా పెరగడంతో సామాన్యులపై మరింత భారం పడుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం వల్ల రాష్ట్రంలో వంట నూనె ధరలు భారీగా పెరిగాయి . రాష్ట్ర ఎడిబిల్‌ ఆయిల్స్‌ అండ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ సంఘం ఆందోళన వ్యక్తం చేసినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించున్న పాపాన పోలేదు.

ప్యాకింగ్‌ లేకుండా విడిగా నూనెల విక్రయాన్ని నిలుపుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసింది. ఇలాంటి ఆదేశాల అమలు వల్ల రాష్ట్రంలో వంట నూనెల ధరలు మరింత భారీగా పెరుగుతాయని సంఘం ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా లక్షలాది మంది చిరు వ్యాపారులు రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు.

డాక్టర్ యం.సురేష్ బాబు, అధ్యక్షులు, ప్రజా సైన్స్ వేదిక

LEAVE A RESPONSE