నేటి సంస్కృతి నృత్యమా..పైత్యమా!?

భరతనాట్యానికి
భరతవాక్యం పలికి..
కూచిపూడిని పాడు చేసి
పాడి ఎక్కించేసి..
కథక్కును
ఎక్కువ తక్కువగా
మక్కువ పోయేలా
కెచ్చాలి తైతక్కుగా మార్చేసి…
మోహినీ అట్టం అంటే ఇంతేనా అనుచు
ప్రతి గొట్టం గాడు
డాన్సు కట్టేసి..
కథకళిని వ్యధకేళిగా
పరిమార్చేసి..
మణిపురిని పానీపూరి తిన్నంత సులువుగా ఆడేసి..
యక్షగానాన్ని శిక్షగానంగా
తక్షకుడి ఆటగా పనికిరాని
శిక్షకుడు నేర్పగా..
సత్తియ నృత్యం
ఉత్తి పైత్యం కాగా..
మొత్తంగా ఆదాయం కోసం సంప్రదాయాలను మంటగలుపుతూ..
డాన్సులో కూడా
వయలెన్సు మిక్స్ చేస్తూ..
వంతులు వేసుకుని కుప్పిగంతులు వేస్తుంటే
ప్రేక్షకులు..వీక్షకులు
వాంతులు చేసుకునే స్థాయికి
దిగజారె మన సినిమాల్లో స్టెప్పుల తిప్పలు..

అంతేనా..
ఢీ అంటూ ఛీ కొట్టుకుంటున్న కార్యక్రమాల్లో కపివారసులు
సర్కసులు చేస్తుండగా..
ఢీ..వన్…టు..త్రీ..
అంటూ ప్రతి కంత్రీ
నృత్యాలు చేస్తూ ఫేన్సులను
అదరగొట్టేస్తున్నారు..
వికృత భంగిమల హంగామా..
యాంకర్లనే యమకింకిణుల పేనొరమా..!
ఈ ఘీంకార పైత్యానికి
ఏ ముహూర్తాన
‘ఓంకారం’..శ్రీకారం
జరిగాయో గాని..
అందరికీ అసభ్య క్లబ్బులో
సభ్యత్వం..!!
హిందూత్వం..
భారతీయ తత్వం..
రియాల్టీ షోల్లో
కృయాల్టీ హాల్లో..
వెర్రితనం హలో..హలో..
సంస్కారం..సంప్రదాయం
అలో పొలో..!

ఉన్నతమైనవి
మన సంప్రదాయ
నృత్యాలు..
వాటిని పాటించే వారే కళాకారులు
వికృతంగా ‘పోటీంచే’
వారు కల్లకారులు

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

Leave a Reply