• సజ్జలే షాడో ముఖ్యమంత్రా? ఆయనతో మేం చర్చించేదేమిటి?
రాష్ట్రానికి ఏం సాధించాడని జగన్ రెడ్డి టీడీపీతో చర్చకు వస్తాడు?
• సంక్షేమం ముసుగులో చేసిన మోసాలు బయటపడతాయనే చంద్రబాబు సవాల్ కు స్పందించకుండా జగన్ పరారయ్యాడు
• తండ్రి ముఖ్యమంత్రి కాకముందు రూ.లక్షా60వేలున్న జగన్ రెడ్డి….నేడు లక్షలకోట్లు సంపాదించిన అంశంపై చర్చకు వస్తే స్వాగతిస్తాం
• నవరత్నాల పేరుతో ప్రజల్ని వంచించి నవమోసాలకు పాల్పడిన తీరుపై చర్చకు వచ్చినా పర్వాలేదు
• మద్యపాన నిషేధం, సీపీఎస్ రద్దు, సామాజిక పింఛన్ల పెంపు, జాబ్ క్యాలెండర్ విడుదల, ప్రత్యేకహోదా సాధనపై అయినా చర్చకు రావాలి
• రాష్ట్రానికి ఏం సాధించి..ఏ విషయంలో విజయవంతమయ్యాడని జగన్ రెడ్డి చర్చకు వస్తాడు?
• టీడీపీ ప్రభుత్వంలో ప్రజలకు అందించిన సంక్షేమంపై చర్చకు తాను సిద్ధం. మంత్రులు ఎవరు వస్తారో రావచ్చు
• తెలుగుదేశంపై విమర్శలు చేయడానికి…చంద్రబాబుపై నిందలు వేయడానికే సజ్జల సలహాదారుగా ఉన్నాడా?
• తన సలహాలతో సజ్జలే జగన్ ను చెడగొడుతున్నాడా? పార్టీలో ఎవరికి సీట్లు ఇవ్వాలో కూడా సజ్జలే చెబుతున్నాడా?
• సజ్జలే షాడో ముఖ్యమంత్రా.. ఆయనే రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడా?
– మాజీ మంత్రి కే.ఎస్.జవహర్
టీడీపీ విసిరే ఏ సవాల్ ను స్వీకరించే పరిస్థితిలో జగన్ రెడ్డి లేడని, అసత్యాలతో రాష్ట్రప్రజల్ని మరోసారి మోసగించే ప్రయత్నాల్లో తీరికలేకుండా ఉన్నాడని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కే.ఎస్.జవహర్ ఎద్దేవా చేశారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
బలహీనవర్గాలకు చెందిన 120 పథకాలు..27 దళితుల పథకాలు రద్దుచేసిన జగన్ రెడ్డి నిస్సిగ్గుగా పేదలకు పెత్తందార్లకు మధ్య యుద్ధం అంటున్నాడు
“ మద్యపాన నిషేధం.. సీపీఎస్ రద్దు సహా పలుహామీలతో అధికారంలోకి వచ్చిన జగన్, ముఖ్యమంత్రి అయ్యాక కుంటిసాకులు చెప్పి ప్రజల్ని ఏమార్చే పనిలో పడ్డాడు. చంద్రబాబు హాయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన పెళ్లికాని యువతులకు పెళ్లికానుక కింద ఆర్థికసాయం అందింది. జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఆ పథకం పూర్తిగా అటకెక్కింది.
టీడీపీ పలుమార్లు పెళ్లికానుక పథకంపై నిలదీయడంతో చివరకు మొక్కుబడిగా అమలు చేస్తున్నాడు. టీడీపీ ప్రభుత్వంలో వివిధవర్గాలకు అమలైన అనేక సంక్షేమ పథకాల్ని రద్దుచేసిన ఘనుడు ఈ ముఖ్యమంత్రి. బలహీనవర్గాలకు సంబంధించి 120 పథకాలు, దళితులకు సంబంధించిన 27 పథకాల్ని రద్దుచేసిన జగన్ రెడ్డి.. నిస్సిగ్గుగా పేదలకు.. పెత్తందార్లకు మధ్య యుద్ధం జరుగుతోంది అంటున్నాడు.
తండ్రి ముఖ్యమంత్రి కాకముందు రూ.లక్షా60వేలున్న జగన్ ఆస్తి..నేడు లక్షలకోట్లకు ఎలా పెరిగింది? భార్య..ఇద్దరు పిల్లలతో ఉండటానికి భారీ ప్యాలెస్ లు నిర్మించుకున్న జగన్ రెడ్డి నిజంగా పేదవాడే
ఎవరు పెత్తందారు జగన్ రెడ్డి? నీ తండ్రి ముఖ్యమంత్రి కాకముందు నీ ఆస్తి ఎంత ? ఇప్పుడు నీకున్న ఆస్తులెన్ని? అప్పుడు రూ.1,60,000లు ఉన్న జగన్ ఆస్తి, నేడు లక్షలకోట్లు ఎలా అయ్యింది? తన ఇద్దరు పిల్లలు, భార్యతో నివాసం ఉండ టానికి బెంగుళూరులో 23 ఎకరాల్లో 60గదులతో రాజమహల్ నిర్మించుకున్న జగన్ రెడ్డి పేదవాడా? జూబ్లీహిల్స్ లోని లోటస్ పాండ్, తాడేపల్లి ప్యాలెస్, ఇడుపుల పాయలోని రాజభవనాలు నీవి కావా జగన్ రెడ్డి? జగన్ రెడ్డి పేదవాడు అనడానికి ఇవే ఉదాహరణలు. ఇవేకాక తనకు అడ్డం తిరిగేవారిని, తనను ఎదిరించేవారిని అంతం చేయడానికి పులివెందులలో జగన్ కు మరో నేరాల నిలయం ఉంది.
ఇడుపులపాయలో 650 ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉంది. వీటన్నింటితో పాటు కడపలో మరో విలాసవంతమైన భవనం ఉంది. ఇవన్నీ జగన్ రెడ్డి పేదరికానికి నిలువెత్తు నిదర్శనాలు. ఉన్న ఆస్తులు..భవనాలు చాలవ న్నట్టు విశాఖపట్నంలో రూ.500కోట్ల ప్రజలసొమ్ముతో ఏకంగా రుషికొండపైనే మరో భారీ ప్యాలెస్ నిర్మించుకుంటున్నాడు. ఇన్ని పెద్ద భవనాలున్నా…ఏదైనా తేడా వచ్చి దేశంవిడిచి పారిపోవాల్సి వస్తే లండన్లో తలదాచుకోవడానికి అక్కడ ముందే ఒక భారీభవనం కొని పెట్టుకున్నాడు.
భారతి సిమెంట్స్.. సండూర్ పవర్.. సాక్షి మీడియా సంగతేంటి జగన్ రెడ్డి?
జగన్ రెడ్డికి భారీ నివాస సముదాయాలతో పాటు… వాణిజ్య, వ్యాపార కేంద్రాలు కూడా ఉన్నాయి. వాటిలో ప్రధానమైంది భారతి సిమెంట్స్. దానికి తోడు సాక్షి దినపత్రిక.. సాక్షి ఛానల్.. బెంగుళూరులోని మంత్రి డెవలపర్స్ పేరుతో ఉన్న భారీ షాపింగ్ కాంప్లెక్స్, బంజారాహిల్స్ లోని రూ.100కోట్ల భవనం, సరస్వతి పవర్స్ , సండూర్ పవర్ పరిశ్రమలు. ఇవన్నీ చాలవన్నట్టు జింకా వెంకట నర్స య్య అనే బీసీని చంపి ఆక్రమించుకున్న గనులు, పెనగలూరులో ఉన్న 600 ఎకరాల టేకు తోట ఇలా పైకి తెలిసిన ఆస్తులుకొన్నే. తెలియకుండా జగన్ పేరుతో.. ఆయన కుటుంబసభ్యులు.. బినామీ పేర్లతో ఉన్నవి ఎన్నో.
ముఖ్యమంత్రి అయ్యాక చేసిన దోపిడీకి అంతే లేదు..
ఈ 5 ఏళ్లలో ప్రజలిచ్చిన అధికారంతో గతంలో తనకున్నఆస్తుల కంటే జగన్ ఇంకా ఎక్కువగా సంపాదించాడు. సెంటు పట్టాల పేరుతో నివాసానికి పనికిరాని స్థలాలను పేదలకు ఇచ్చి,ఆ ముసుగులో వేలకోట్లు దోచేశాడు. అసైన్డ్, దేవాదా య, వక్ఫ్ భూముల్ని కొల్లగొట్టాడు. రాష్ట్రంలోని ఖనిజ సంపదను లూఠీ చేశాడు. ఇసుక అమ్మకాలతో రూ.50వేలకోట్లు దోచేశాడు. కల్తీ మద్యం అమ్మి రూ.2లక్షల కోట్లు కొల్లగొట్టాడు. ఇలాంటి ఎన్నో దోపిడీ కథలు… జగన్ రెడ్డి నిజంగా పేదవాడు అనడానికి నిదర్శనాలు. లక్షా60వేల రూపాయల నుంచి లక్షలకోట్లు ఎలా సంపాదించాడనే అంశంపై జగన్ రెడ్డి చర్చకు రావాలి.
చంద్రబాబు అందించిన సంక్షేమంతో పోలిస్తే జగన్ రెడ్డి అమలుచేసిన సంక్షేమం ఆవగింజంతే
చంద్రబాబు గతంలో ప్రజలకు అందించిన సంక్షేమం ఆకాశమంత అయితే, ఈ 5ఏళ్లలో జగన్ రెడ్డి అందించింది ఆవగింజంతే. ఆవగింజంత సంక్షేమానికి అనకొండంత ప్రచారం చేసుకొని, తానే పేదల్ని ఉద్ధరించినట్టు జగన్ గొప్పలు చెప్పుకుంటున్నాడు. చేసింది చెప్పుకోనందువల్ల చంద్రబాబు ప్రజలకు అందించిన సంక్షేమం ప్రాచుర్యం లోకి రాలేదు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు మలుపు, ముందడుగు అనే పథకాలు తీసుకొచ్చారు.
వాటి ద్వారా భూమి కొనుగోలు చేయడం, గేదెలు కొని ఇవ్వడం, కోబ్లర్ కిట్స్ , చర్మకారులకు లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించడం వంటి సంక్షేమాన్ని మాదిగలకు అందించారు. నేడు జగన్ రెడ్డి ఆ విధంగా మాదిగ యువతకు ప్రత్యేకంగా ఒక్క పథకమైనా అమలుచేశారా?
వాహనమిత్ర పేరుతో వాహనదారుల్ని…అమ్మఒడి పేరుతో తల్లుల్ని వంచించాడు. ఎందరు విద్యార్థులకు ఎంతమంది ఉపాధ్యాయులు ఉండాలో తెలియని జగన్, నూతన విద్యా విధానం పేరుతో విద్యారంగాన్ని ప్రయోగశాలగా మార్చాడు
వాహనమిత్ర పేరుతో రాష్ట్రంలో ఉన్న వాహనదారుల్లో కేవలం 10, 15శాతం మందికి రూ10వేలు అందించి, పెట్రోల్.. డీజిల్ ధరల పెంపు, ఇతర ట్యాక్సుల రూపంలో సంవత్సరానికి రూ.లక్ష రాబడుతున్నారు. అమ్మఒడిని నాన్నబుడ్డి గా మార్చి, రూ.15వేలు ఇస్తానని చివరకు రూ.13వేలకు పరిమితం చేశాడు. రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల్లో సగం మందికే అమ్మఒడి సాయం అందిస్తున్నాడు. ఇలా నవరత్నాల పేరుతో అన్ని వర్గాల ప్రజల్ని అన్నిరకాలుగా వంచించాడు.
నాడు-నేడు పేరుతో దేశంలో ఏ రాష్ట్రం అమలుచేయని నూతన విద్యావిధానం తీసుకొచ్చిన జగన్ రెడ్డి, పాఠశాలల విలీనం పేరుతో పేదపిల్లల్ని విద్యకు దూరం చేశాడు. 3వ తరగతి నుంచి ఆపై తరగతుల్ని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసిన జగన్ రెడ్డి..ఆ స్థాయిలోవారికి ఉపాధ్యాయుల్ని నియమించలేకపోయాడు. ఎందరు విద్యార్థులకు ఎంతమంది ఉపాధ్యాయులుండాలో కూడా తెలియని స్థితిలో జగన్ ఉన్నాడు. బై లింగ్వల్.. డిజిటల్ క్లాస్ రూమ్స్.. వర్చువల్ క్లాస్ రూమ్స్..ఉత్తీర్ణతాశాతం లాంటివి కూడా తెలియని జగన్ రెడ్డి.. రాష్ట్ర విద్యారంగా న్ని ప్రయోగశాలగా మార్చాడు. పేద, మధ్యతరగతి వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంలో విఫలమయ్యాడు.
జగన్ రెడ్డికి తెలిసిన సంక్షేమం.. హత్యలు, దాడులుచేయించడమే చంద్రబాబు అమలు చేసింది అసలైన సంక్షేమం.. ఆత్మగౌరవంతో బతికేలా చేసిన సంక్షేమం
జగన్ రెడ్డికి తెలిసిన సంక్షేమం ఏమిటంటే .. బాబాయ్ ను చంపి బాత్రూమ్ లో పడుకోబెట్టడం.. తమ్ముడు అవినాశ్ రెడ్డి జైలుకెళ్లకుండా కాపాడటం.. దళితుల్ని చంపినవారికి పదవులు కట్టబెట్టడం.. వారికి ఊరేగింపులు, సన్మానాలు చేయడం.. కోర్టుకు వెళ్లకుండా 5 ఏళ్లపాటు కోడికత్తి కేసులో దళితయువకుడు శ్రీనివాస్ జైల్లో మగ్గేలా చేయడం…బలహీనవర్గాల వారిపై వైసీపీనేతలతో దాడులు చేయించడం…వారి రిజర్వేషన్లలో కోతపెట్టి, స్థానికసంస్థల్లో వారికి దక్కా ల్సిన పదవులు దక్కకుండా చేయడం. ఇవీ జగన్ రెడ్డికి తెలిసిన సంక్షేమ పథకాలు.
దళితుల ఆత్మగౌరవం నిలబెట్టడం కోసం చంద్రబాబు అమలుచేసిన భూమి కొనుగోలు పథకం నిజమైన సంక్షేమం. దళిత బిడ్డలు ఎవరి దయాదాక్షి ణ్యాలపై ఆధారపడకుండా వారి బతుకు వారు బతికేలా చేయడానికి స్వయం ఉపాధి రుణాలు అందించడం నిజమైన సంక్షేమం. దళిత విద్యార్థులకు బెస్ట్ అవై లబుల్ స్కూళ్లు, దళిత యువత విదేశాల్లో చదువుకోవడానికి విదేశీ విద్య పథకం కింద ఆర్థిక సాయం అందించడం అసలైన సంక్షేమం. డప్పు కళాకారులు.. చర్మ కారులు..చెప్పులు కుట్టేవారికి ఆర్థికసాయంతో పాటు పింఛన్లు అందించడం నిఖార్సైన సంక్షేమం.
డయేరియాతో పేదలు చనిపోతుంటే.. ఆరోగ్య శ్రీతో ప్రజల్ని రక్షిస్తున్నట్టు జగన్ అబద్ధాలుచెబుతున్నారు
జగన్ రెడ్డి చెబుతున్న ఆరోగ్య శ్రీ రాష్ట్రంలో ఎక్కడైనా అమలవుతోందా? ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, రాజకీయాలు చేయడమేనా జగన్ రెడ్డి హాయాంలో అమలవుతున్న ఆరోగ్యశ్రీ? డయేరియాతో ప్రజలు చనిపోతున్నా స్పందించని ముఖ్యమంత్రి, నిస్సిగ్గుగా ఆరోగ్యశ్రీతో పేదల ఆరోగ్యాన్ని రక్షిస్తున్నట్టు అబద్ధాలు చెప్పుకుంటున్నాడు. ఆరోగ్య శ్రీ సహా .. తాను గొప్పలు చెబుతున్న పథకాలపై జగన్ రెడ్డి ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకొని బహిరంగచర్చకు వస్తే స్వాగతి స్తాం.
ఆయనతో చర్చకు చంద్రబాబు అవసరంలేదు.. నేను సరిపోతాను. సంక్షేమ పథకాలకు బీజం వేసింది తెలుగుదేశం పార్టీయే అని, సంక్షేమం అనే మాటకు కొత్త నిర్వచనం అందించి పేదల్ని అన్నివిధాల ఆదుకుంది చంద్రబాబునాయుడేనని ఆధారాలతో సహా నిరూపిస్తాం.
తన సలహాలతో సజ్జలే.. జగన్ ను చెడగొడుతున్నాడా? సజ్జలే షాడో ముఖ్యమంత్రా? ఆయనతో మేం చర్చించేదేమిటి?
సంక్షేమం ముసుగులో ఐదేళ్లుగా తానుచేసిన మోసాలు బయటపడతాయని, ఎన్నికల్లో వైసీపీ గెలవదని తెలిసే చంద్రబాబు విసిరిన సవాల్ కు స్పందించకుం డా జగన్ పారిపోయాడు. టీడీపీ సవాల్ పై మాట్లాడటానికి సజ్జల ఎవరు? తెలుగుదేశంపై విమర్శలు చేయడానికి…చంద్రబాబుపై నిందలు వేయడానికే సజ్జల సలహాదారుగా ఉన్నాడా? ఆవభూములు సహా నివాసానికి పనికిరాని భూముల్ని పేదలకు ఇళ్లస్థలాలుగా ఇవ్వమనే మంచి సలహా సజ్జలే ఇచ్చాడా?
తన సలహాలతో సజ్జలే జగన్ ను చెడగొడుతున్నాడా? పార్టీలో ఎవరికి సీట్లు ఇవ్వాలో కూడా సజ్జలే చెబుతున్నాడా? సజ్జలే షాడో ముఖ్యమంత్రా.. ఆయనే రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడా? ఆయనతో చర్చలేమిటి” అని జవహర్ ప్రశ్నించారు