Suryaa.co.in

Andhra Pradesh

ఒక్క అమరావతి రాజధానికే రూ.62వేల కోట్ల అప్పులా..?

– ఏపీ అప్పులపాల్జేసిన చంద్రబాబు
– అప్పులపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలి.
– వక్ఫ్‌ బిల్లుపై వైసీసీ సరే…టీడీపీ వైఖరేంటి?
– పురంధేశ్వరి, పవన్‌ వ్యాఖ్యలు అర్హరహితం
– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విజయవాడ: అమరావతి రాజధాని ‘స్వయం సమృద్ధి రాజధాని, దానంతట అదే అభివృద్ధి చెందుతుందని అబద్దాలు ప్రచారం చేసి..ఇప్పుడు రూ.62వేల కోట్లు అప్పులు తెస్తున్నారంటే..దీనిపై ఖచ్చితంగా చర్చించాలని, ఈ అప్పులపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని, అఖిలపక్షంతో సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

నాడు చంద్రబాబు అధికారంలో లేనప్పుడేమో..రాష్ట్రాన్ని వైఎస్‌ జగన్‌ అప్పులపాల్జేశారని, రాష్ట్రం శ్రీలంకలా తయారవుతుందని ప్రచారం చేశారని రామకృష్ణ గుర్తుచేశారు. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన..పది నెలల్లో మీరు చేస్తున్నదేమిటి?, అసలు మీ ట్రాక్‌ రికార్డు ఏమిటని ప్రశ్నించారు. ఏప్రిల్‌ 1వ తేదీన ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగా, 3వ తేదీన కల్లా రూ.5,760 కోట్లు అప్పులు తెచ్చారన్నారు.

గత ఆర్థిక సంవత్సరమంతా రూ.90 వేల కోట్ల వరకు అప్పులు చేశారని, బడ్జెట్టు సైతం అప్పులమయమేనని వివరించారు. ఏపీఐఐసీ, మార్క్‌ఫెడ్‌, ఆంధ్రప్రదేశ్‌ మినరల్‌ డవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, సివిల్‌ సప్లయీస్‌ కార్పొరేషన్‌, మార్క్‌ఫెడ్‌, ఏపీ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌..అన్ని కార్పొరేషన్ల పేరుతో బడ్జెటేతర అప్పులు తెచ్చి..మొత్తం రాష్ట్రాన్ని అప్పులపాల్జేస్తున్నారని మండిపడ్డారు. నాడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కంటే..చంద్రబాబు వేగంగా అప్పులు చేస్తున్నారని తూర్పారబట్టారు.

అప్పులు చేయడమే సింగిల్‌ అజెండాగా పెట్టుకున్నారని, ప్రజలపై భారం మోపుతున్నారన్నారు. అమరావతి రాజధాని పేరుతో ఇప్పటివరకు హడ్కో 11వేల కోట్లు, ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు, ప్రపంచ బ్యాంకు నుంచి రూ.15వేల కోట్లు, తాజాగా జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థతో రూ.5వేల కోట్లు అప్పులు…ఇలా మొత్తంగా రూ.31వేల కోట్లు తెస్తున్నారన్నారు. ఇవి చాలవనే రీతిలో ఇటీవల సీఎం చంద్రబాబు నివాసంలో జరిగిన ఏపీ సీఆర్డీఏ సమావేశంలో..మొత్తం రూ.62 వేల కోట్లకుగాను రాజధాని పనులకు టెండర్లు పిలిచినందును మరో రూ.31వేల కోట్ల అప్పులు తేవాలని నిర్ణయించడాన్ని రామకృష్ణ తప్పుపట్టారు.

ఒక్క అమరావతి రాజధాని కోసమే రూ.62వేలకోట్ల అప్పలు తెస్తున్నారని, ఇలా అప్పులు తేవడం ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందేమో..నాకైతే తెలియదని, దీన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలని రామకృష్ణ ధ్వజమెత్తారు. నాడు అమరావతి రాజధానికి గ్రాంట్‌ ఇస్తామనే రీతిలో కేంద్ర ప్రభుత్వం చెప్పిందనీ, పురంధేశ్వరీ మాట్లాడారని గుర్తుచేశారు.

విజయవాడ దాసరిభవన్‌లో ఆదివారం రామకృష్ణ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. వక్ఫ్‌ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసినప్పటికీ.. పట్టు విడవకుండా, ఈ బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు నిర్ణయంచాయని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 26 ప్రకారం ఏ మత సంస్థలైనా సరే..తమ వ్యవహారాలను వారే స్వయంగా వ్యవహరించుకునేలా స్వేచ్ఛ కల్పించగా…దానికి విరుద్ధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం..పెత్తనం చేయడానికి, అన్యమతస్తులను అందులో భాగస్వామ్యం చేయడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. అది..అంతటితోనే ఆగబోదనీ, ఖచ్చితంగా క్రైస్తవ ఆలయాలపైన, ఆస్తులపైన, మత వ్యవహారాలపైన దాడులు చేస్తారని, ఇదే ధోరణితో ముందుకు పోతారని, దేవాలయ భూములపైనా ఇదే కార్యక్రమాలు చేపడతారని ఆ రోజే కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్‌ చెప్పాయని గుర్తుచేశారు.

మైనార్టీల మనోభావాలు దెబ్బతీసేలా పురంధేశ్వరి వ్యాఖ్యలు

వక్ఫ్‌ అమెండ్‌మెంట్‌ బిల్లును..ఎవరూ చేయలేకపోయారని, అది ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమే చేయగలిగారని, వాటితోపాటు త్రిబుల్‌ తలాక్‌, ఆర్టికల్‌ 370 రద్దు, అయోధ్య రామాలయమంటూ బీజేపీ అధ్యక్షురాలు పురంధీశ్వరి చేసిన వ్యాఖ్యలు..మైనార్టీ మతస్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని రామకృష్ణ తూర్పారబట్టారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 11 ఏళ్లల్లో దేశానికిగానీ, కనీసం ఒక్క హిందువులకుగానీ మేలు చేసిన అంశమేమిటో చెప్పాలంటూ ఆమెను సూటిగా రామకృష్ణ ప్రశ్నించారు.

2014 ఎన్నికల్లో ప్రస్తావించిన అంశాల్లో ఒక్కటైనా చేశారా?, రైతుల సంక్షేమం కోసం ఏం చేశారని నిలదీశారు. ఈ మోదీ పరిపాలనలో లక్షా 474మంది రైతులు, కూలీలు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, దానిపై మీ దగ్గర జవాబేదీనీ ప్రశ్నించారు. పెరిగిన ధరలు తగ్గించలేకపోయారని, ఏడాదికి 2కోట్ల ఉద్యోగాల హామీ అటకెక్కిందని, విదేశాల్లో ఉండే బ్లాక్‌మనీని వెనక్కి రప్పిస్తామని చెప్పి..తుదకు వారితో లాలూచీ పడుతున్నారని మండిపడ్డారు. వక్ఫ్‌ బిల్లుకు వైసీపీ ఎంపీలు లోక్‌సభలో వ్యతిరేకంగాను, రాజ్యసభలో అనుకూలంగాను చేశారంటూ పురంధేశ్వరి వ్యంగ్యంగా మాట్లాడటాన్ని తప్పుపట్టారు.

బీజేపీ నేతలు..వైసీపీ ఎంపీలతో మాట్లాడటంతోనే ఈ రకంగా వైసీపీతో లోపాయికారిక ఒప్పందాలు పెట్టుకుని..మళ్లీ దీనిపై పురంధేశ్వరి మీడియా ముఖంగా వ్యాఖ్యానించడం అర్థరహితమని ఖండిరచారు. పురంధేశ్వరి బీజేపీ స్టాండ్‌ చెప్పగా..అసలు టీడీపీ స్టాండ్‌ ఏమిటనేదీ అర్థం కావడంలేదన్నారు. వైసీపీ లోక్‌సభలో వ్యతిరేకంగాను, రాజ్యసభలో అనుకూలంగాను ఓటేసిందని, దీంతో ముస్లింలకు ద్రోహం చేసిందంటూ టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారన్నారు.

కనీసం లోక్‌సభలోనైనా వైసీపీ వ్యతిరేకించగా… టీడీపీ లోక్‌సభలోను, రాజ్యసభలోను వక్ఫ్‌ బిల్లుకు అనుకూలంగా ఓటేశారని, అది ముస్లింలకు ద్రోహం చేసినట్లు కాదా? అనేదీ వారు గుర్తెరగాలన్నారు. పవన్‌ కల్యాణ్‌..పేద ముస్లింల అభివృద్ధి కోసమే ఈ బిల్లు తెచ్చినట్లు వ్యాఖ్యానించారని, పవన్‌కు స్ట్రిప్టు రాసిన వారు..ఈ విషయాన్ని కనిపెట్టాడని, ఆయన్ని అభినందించాలంటూ ఎద్దేవా చేశారు.

LEAVE A RESPONSE