Suryaa.co.in

Telangana

వైద్య ఆరోగ్యశాఖ నిద్రమత్తులో ఉందా? కోమాలో ఉందా?

-గిరిజన బాలిక సుక్కి మృతి పై సమగ్ర విచారణ జరిపించాలి
-శవాన్ని తీసుకు వెళ్లడానికి అంబులెన్స్ ఇవ్వని అధికారులపై చర్యలు తీసుకోవాలి
-కొత్త మేడిపల్లి గ్రామాన్ని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సందర్శించాలి
-గిరిజనగూడెం గ్రామ సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావిస్తా
-బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ నిద్రమత్తులో ఉందా? కోమాలో ఉందా? అర్థం కావడం లేదు అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం, ఏన్కూరు మండలం, కొత్తమేడేపల్లి గ్రామానికి చెందిన గిరిజన బాలిక సుక్కి కి (3) సకాలంలో సరైన వైద్యం అందకపోవడంతో పాటు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందిన తర్వాత శవాన్ని తీసుకు వెళ్లడానికి అంబులెన్స్ ఇవ్వకపోవడంతో ఆమె తండ్రి మల్లయ్య మోటార్ సైకిల్ పై కూతురు శవాన్ని ఖమ్మం నుంచి కొత్తమేడేపల్లి గ్రామానికి తీసుకువచ్చిన ఉదంతంపై పత్రికల్లో వచ్చిన కథనాలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు.

మంగళవారం స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి కొత్త మేడేపల్లి గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించి తల్లిదండ్రులను ఓదార్చారు. సంఘటన సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ స్థితిగతులు, గ్రామ భూ భౌగోళిక పరిస్థితులను ఆయన పరిశీలించారు. సుక్కి మరణానికి సంబంధించిన వివరాలను ఆమె తండ్రి మల్లయ్యను అడిగి తెలుసుకున్నారు. తన కుమార్తెకు జ్వరం రావడంతో ఈనెల 4వ తేదీన ఫిడ్స్ వచ్చాయని వెంటనే 108 అంబులెన్స్ కు ఫోన్ చేయగా రాకపోవడంతో మోటార్ సైకిల్ పై ఏన్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లామని చెప్పారు.

అప్పటికే ఆరోగ్య పరిస్థితి విషమించిందని మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళమని వైద్యులు రెఫర్ చేశారని చెప్పారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ కు ఫోన్ చేయగా రాలేదన్నారు. ప్రభుత్వ వైద్యులను బ్రతిమిలాడిన అంబులెన్స్ ను పిలిపించలేదని మల్లయ్య విలపిస్తూ వెల్లడించారు. ఆర్టీసీ బస్సులో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా ఆస్పత్రి వైద్యులు వెనువెంటనే అడ్మిషన్ చేసుకోకుండా జాప్యం చేశారని, చాలా సమయం తర్వాత అడ్మిట్ చేసుకున్నప్పటికీ చికిత్స పొందుతూ 5వ తేదీన తెల్లవారుజామున తన కుమార్తె మరణించిందని మల్లయ్య విలపిస్తూ ఆనాడు జరిగిన పరిస్థితి గురించి భట్టి విక్రమార్క గారికి వివరించారు.

తన కుమార్తె శవాన్ని గ్రామానికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని కాళ్ళపై పడి బ్రతిమిలాడిన అక్కడ ఉన్న వైద్యులు, అధికారులు ఎవరు స్పందించలేదని తెలిపారు. ప్రైవేట్ అంబులెన్స్ ను అడగ్గా 5వేల రూపాయలు అడిగారని అంత ఇచ్చే స్తోమత లేకపోవడంతో తన దగ్గర ఉన్న బస్సు చార్జీలతో ఏన్కూరు శివారు దగ్గరికి వచ్చి జరిగిన పరిస్థితి గురించి తన గ్రామ పెద్దకు వివరించగా ఆయన దయతలిచి గ్రామానికి చెందిన ఒక యువకుడిని మోటార్ సైకిల్ ఇచ్చి పంపించాడని చెప్పుకొచ్చారు. మోటార్ సైకిల్ పైన ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తన గ్రామం వరకు తన కుమార్తె శవాన్ని తీసుకువెళ్లామని గుండెలు బాదుకుంటూ చెప్పడంతో భట్టి విక్రమార్క భావోద్వేగానికి గురయ్యారు.

ఆ తర్వాత గ్రామంలో మూతపడి ఉన్న బాల వెలుగు విద్యాలయం, గ్రామ రహదారి, విద్యుత్తు సమస్యలు, మౌలిక సమస్యలను ఆయన పరిశీలించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. వైద్య అధికారుల నిర్లక్ష్యం వల్ల గిరిజన బాలిక మృతి చెందడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. బాలికను ఏన్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకు వచ్చిన క్రమంలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి అంబులెన్స్ రాకపోవడం విచారకరమని పేర్కొన్నారు. అదేవిధంగా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో బాలిక మృతి చెందిన తర్వాత శవాన్ని ఇంటికి తీసుకు వెళ్లడానికి అక్కడి అధికారులు వైద్యులు అంబులెన్స్ ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శించడం దుర్మార్గమన్నారు.

తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో సరైన వైద్యం అందక గిరిజన బాలిక మృతి చెంది పది రోజులు గడుస్తున్న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు స్పందించకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. సరైన సమయంలో వైద్యం అందించని దుస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటు అన్నారు. వైద్యం అందక ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు పిట్టల్లా రాలిపోతుంటే రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ కోమాలో ఉందా? నిద్రమత్తులో ఉందా? అర్థం కావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన బాలిక సుక్కీ మృతి పై ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెంటనే స్పందించి కొత్త మేడేపల్లి గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. గుత్తి కోయలు నివసిస్తున్న గిరిజన గ్రామాల్లో సరైన వైద్యం అందేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీలుగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, గిరిజన సంక్షేమ శాఖ అధికారి తక్షణమే గ్రామాన్ని సందర్శించి గ్రామంలో ఉన్న స్థితిగతులు తెలుసుకొని విద్య, వైద్యం, రహదారి, మౌలిక వసతులు కల్పించడానికి ప్రభుత్వానికి తగిన నివేదికలు పంపించి చర్యలు తీసుకోవాలని సూచించారు.

కొత్త మేడేపల్లి గిరిజన బాలిక మృతి చెందిన ఘటనలో వైద్య అధికారులు నిర్లక్ష్యం, ప్రభుత్వ వైఫల్యం గురించి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తానని వెల్లడించారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారుల వైఫల్యం వల్లే గ్రామంలో బాల వెలుగు పాఠశాల మూత పడిందని దీనిని వెంటనే పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట డిసీసీ అధ్యక్షులు దుర్గాప్రసాద్, వైరా నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు రాందాస్ నాయక్, బాలాజీ నాయక్ తదితరులు ఉన్నారు.

LEAVE A RESPONSE