– తెలంగాణ బీజేపీలో బీసీలెక్కడ?
– బీసీలకే సీఎం ఇస్తామంటారు
– ఏ ఎన్నికల్లోనూ బీసీలకు సీటివ్వరు
– కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై బిజెపి తిరుగుబాటు ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్
– జూబ్లీహిల్స్ సీటు దీపక్‌రెడ్డికి ఇవ్వడంపై అసంతృప్తి
– ఇంతకూ ఏ పార్టీని గె లిపిస్తున్నారంటూ కిషన్‌రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు
హైదరాబాద్: బిజెపి మాజీ ఫైర్‌బ్రాండ్, తిరుగుబాటు ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్లీ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కడిగిపారేశారు. ‘‘ బీజేపీ అధికారంలోకి వస్తే బీసీనే సీఎం అంటారు. కానీ ఏ ఎన్నికల్లోనూ బీసీకి సీటివ్వరు. తెలంగాణ బీజేపీలో బీసీలెక్కడున్నారో చెబుతారా? ఇదేం కిషన్‘రెడ్డి రాజ్యం’’ అంటూ తాజా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రెడ్డివర్గానికి చెందిన అభ్యర్ధిని ఖరారు చేసిన వైనం దృష్టిలో ఉంచుకుని దునుమాడారు.
పనిలో పనిలో ‘‘ఇంతకూ జూబ్లీహిల్‌సలో మీరు కాంగ్రెసును గె లిపిస్తున్నారా? బీఆర్ఎస్ను గెలిపిస్తున్నారా? ప్రజలు అడుగుతున్నార’’ంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇంతకూ రాజాసింగ్ ఏమన్నారంటే..
‘ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. కిషన్ రెడ్డి రాజ్యం.. కిషన్ రెడ్డి రాజ్యం. తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడల్లా లేదా ప్రముఖ నాయకుడు వచ్చినప్పుడల్లా, భవిష్యత్తులో ఒక బీసీ తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతాడని అందరూ అంటారు. తెలంగాణలో చిన్న ఎన్నికల గాని, పెద్ద ఎన్నికల గాని వస్తే బీసీలనే మర్చిపోతారు. బీసీలు మన తెలంగాణ భారతీయ జనతా పార్టీ లోపట ఎక్కడున్నారో కొద్ది చెప్తారా కిషన్ రెడ్డి? నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు లేదా ఓబీసీల గురించి మాట్లాడలేదు. నేను హిందుత్వం గురించి మాత్రమే మాట్లాడుతా . కానీ నేను ఈరోజు దాని గురించి మాట్లాడటానికి కారణం.. మీరు ప్రతి ఎన్నికల్లో బీసీ కార్డును ప్లే చేసి, బీసీ సమాజానికి మీరు మోసం చేస్తారు. అందుకే నేను ఈరోజు చెప్పాల్సి వచ్చింది.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిజీ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మీరు ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారు? జూబ్లీ హిల్స్ ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు. బీఆర్ఎ స్ ను గెలిపిస్తారా? కాంగ్రెస్‌ను గెలిపిస్తారా? అని సోషల్ మీడియాలో మిమ్మల్ని జనాలు అడుగుతున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. మీ గౌరవం ప్రమాదంలో ఉందా ?’ అంటూ బీజేపీకి రాజీనామా చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కడిగేశారు.