-
పాపవినాశనంలో బోటింగు విన్యాసాలా?
-
బీజేపీ స్పందించదేం?
-
భాగస్వామిగా మారాక మారిన బీజేపీ తీరు
-
టీటీడీ సభ్యులు బజ్జున్నారా?
-
అధికారులను అడిగేందుకు భయమా?
-
‘కోటా టికెట్ల’కు కతె్తర పడుతుందని వెనుకడుగు?
-
పవన్ మౌనంపై పెరుగుతున్న విమర్శ
-
పొంతనలేని అధికారుల వివరణలు
-
భక్తుల మనోభావాలు టీటీడీకి పట్టవా?
-
స్వాములు, హిందూ సంఘాల మౌనరాగం
-
టీటీడీ టూరిజం స్పాటా?
-
వెంకన్న భక్తుల ఆగ్రహం
-
వైసీపీ చేతికి టీటీడీ బ్రహ్మాస్త్రం
( మార్తి సుబ్మ్రహ్మణ్యం)
అది కొండపై కొలువుదీరిన దేవదేవుడి సన్నిధిలోని పాపవినాశన తీర్ధం. అక్కడ నిత్యం వేలాదిమంది భక్తులు స్నానాలు చేస్తుంటారు. మరి అలాంటి పాపవినాశనం తీర్ధాన్ని ఎంత పవిత్రంగా తీర్చిదిద్దాలి? ఇంకెంత పరమ పవిత్రంగా ఉంచాలి? టీటీడీ పాలకవర్గం, అధికార గణం మరి ఆ పనిచేస్తోందా?.. ఆ మేరకు భక్తుల మనోభావాలు గౌరవిస్తోందా?.. అదే నిజమైతే వేలాదిమంది వెంకన్న భక్తులు స్నానమాచరించే ఆ తీర్థంలో బోటింగ్ విన్యాసాలేమిటి?
తిరుమల క్షేత్రం ఏమైనా పర్యాటక క్షేత్రమా? ఎవరి అనుమతితో అక్కడ బోటింగ్ చేశారు? అంత సాహసానికి ఒడిగొట్టిన అటవీశాఖ అధికారిపై ఇప్పటిదాకా చర్యలేవీ? సనాతనధర్మ పరిరక్షకుడి అవతారమెత్తిన పవన్ కల్యాణ్ ఎక్కడ? ఇలాంటి అపవిత్ర చర్యలపై టీటీడీ పాలకవర్గం పెదవి విప్పదేం? టికెట్ల కోటాలో కతె్తర పడుతుందని భయమా? అసలు ఈ మొత్తం అపవిత్ర వ్యవహారంలో బీజేపీ భూతద్దం పెట్టి వెతికినా కనిపించదేం? కూటమిలో భాగస్వామిగా మారాక బీజేపీ తీరు మారిందా? అసలు ఆ పార్టీ బోర్డు సభ్యుడు ఉన్నారా? ఈ వ్యవహారంలో దోషి ఎవరు? బోటింగ్‌కు అనుమతి ఇచ్చింది ఎవరు? ఇదీ ఇప్పుడు టీటీడీపై వెంకన్న భక్తులు సంధిస్తున్న ప్రశ్నాస్త్రాలు.
తిరుమల వెంకన్న సన్నిధిలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించే పాపవినాశనం తీర్ధంలో.. అటవీశాఖ సిబ్బంది బోటింగ్ చేస్తున్న ఫొటోలు, వెంకన్న భక్తుల మనోభావాలను అపవిత్రం చేశాయి. అంతగా వారి మనోభావాలు దెబ్బతీసిన ఆ వైనం విపక్ష వైసీపీకి బ్రహ్మాస్త్రంగా మారి.. విమర్శల వర్షం కురిపించినా, ఇప్పటికీ టీటీడీ మహానుభావులలో ఉలుకు లేదు. పలుకు లేదు. చర్యల కొరడా ఝళిపించిందీ లేదు.
అసలు ఈ మొత్తం అపవిత్ర చర్యలో దోషులెవరో తేల్చిందీ లేదు. బోటింగు అనుమతి ఇచ్చిన అధికారెవరో తేల్చిందీ లేదు. పత్రికల్లో వార్తలు వస్తాయి.. దానిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు.. కొద్దిరోజుల తర్వాత దానిని మర్చిపోతారు.. మళ్లీ మరొక సంఘటన! ఇదీ టీటీడీ వరస!! ఎవరేమనుంటే మాకేంటన్న ధిక్కారం. అంతేగా.. అంతేగా!!!
తిరుమలలోని కుమారధార, పసుపుధార నీరు పాపవినాశనం డ్యామ్‌కు చేరుతుంటుంది. ఆ ప్రాంతంలూనే టీటీడీకి చెందిన పాపవినాశనం తీర్ంధ, గంగాదేవి ఆలయం ఉంది. స్వామిని దర్శించుకున్న ప్రతి ఒక్కరూ ఇక్కడకు వచ్చి, స్నానం చేస్తుంటారు. అయితే ఇది అటవీశాఖ పరిథిలో ఉండటంతో పెద్దగా అభివృద్ధి కాలేదు. ఇదీ క్లుప్తంగా పాపవినాశనం కథ.
ముచ్చటగా మూడురోజుల క్రితం తిరుమల కొండపై ఉన్న ఈ పాపవినాశనం తీర్థంలో బోట్లు తిరగడం సంచలనం సృష్టించింది. మీడియాలో వచ్చిన ఆ వార్త వెంకన్న భక్తులను ఆగ్రహానికి గురిచేసింది. భక్తుల స్నానాలకు తప్ప మరెలాంటి కార్యకలాపాలకూ స్థానం లేని ఆ తీర్థంలో బోట్లు ఎలా వచ్చాయి? ఎవరు అనుమతి ఇచ్చారు? అన్న ప్రశ్నలు వెల్లువెత్తాయి.
దానితో అటవీశాఖ జిల్లా అధికారి పి.వివేక్ మీడియాముందు కొచ్చి.. వెంకటేశ్వర నేషనల్ పార్క్ శేషచలం బయో స్పేర్ రిజర్వు లోని పాపవినాశనం డ్యామ్ చుట్టూ చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం వచ్చిందని చెప్పారు. ఆ తనిఖీల కోసమే బోట్లు వినియోగించామని, మళ్లీ తిరిగి బోట్లను వెనక్కి పంపించామని సెలవిచ్చారు.బాగానే ఉంది. కానీ సదరు సారును కూంబింగ్‌కు అనుమతించింది ఎవరన్నది ఇప్పటిదాకా తేల్చలేదు.
ఇంకోవైపు టూరిజం కోసమే బోటింగ్ చేస్తున్నామన్న అటవీశాఖ సిబ్బంది ప్రకటనలు చూస్తే.. తిరుమల దైవక్షేత్రమా? పర్యాటక ప్రాంతమా? అన్న కొత్త సందేహాలకు కారణమయింది.
కాగా కొద్దిరోజుల క్రితం కొండపైన చోటుచేసుకున్న పరిణామాలు వైసీపీకి బ్రహ్మాస్త్రంగా పరిణమించడం, టీడీపీ వర్గాలను ఆందోళన పరుస్తోంది. ప్రధానంగా కొండమీద ఉన్న బాలాజీనగర్‌లో మద్యం పట్టుకున్నట్లు, స్వయంగా పోలీసులే ప్రకటించారు. గెస్టుహౌసుల వద్ద తాగుబోతులు భయభ్రాంతులను చేస్తున్న వైనం కూడా వెలుగుచూసిన వైనాన్ని.. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మీడియా సమక్షంలోనే చాకిరేవు పెట్టారు. కొండపైన మద్యం దొరుకుతుంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారన్న భూమన ప్రశ్నలకు ఇప్పటివరకూ జవాబు లేదు.
అంటే దీన్నిబట్టి.. అలిపిరి దగ్గర నుంచే నిఘా నిద్రపోతోందని స్పష్టమవుతోంది. అసలు కొండపైకి వచ్చే చిన్న చిన్న వ్యాపారాలను, విజిలెన్స్ ఎప్పుడైనా తనిఖీ చేశారా? తట్టల వ్యాపారాలు రోజూ కొండపైకి ఏమి తీసుకువస్తున్నారని ఏనాడైనా తనిఖీలు చేశారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు పాపవినాశనం ఉన్న ప్రాంతంలో, గంజాయి విరివిగా దొరుకుతున్నాయన్న ఆరోపణలొస్తున్నాయి. మరి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయన్నది ప్రశ్న.
కాగా తిరుమల కొండ సన్నిధిలో బోటింగ్ చేయడంపై.. భక్తుల ఆగ్రహానికి సంబంధించిన వార్తలు మీడియాలో వచ్చాయి. ఆ తర్వాత టీటీడీ బోర్డు మీటింగ్ కూడా జరిగింది. కానీ దానిపై ఏ ఒక్క సభ్యుడూ టీటీడీ ఈఓ, ఏఈఓను నిలదీసిన పాపాన పోకపోవడమే ఆశ్చర్యం. దానితోపాటు బాలాజీనగర్‌లో పోలీసులే బయటపెట్టిన మద్యం బాటిళ్లపైనా ప్రశ్నిస్తే ఒట్టు. బహుశా వీటి గురించి ప్రశ్నిస్తే.. తమ కోటా టికెట్లకు అధికారులు ఎక్కడ కత్తెర వేస్తారోనన్న భయమే, వారి మౌనానికి కారణమన్న విమర్శలు భక్తుల నుంచి వినిపిస్తున్నాయి.
కొండపై జరుగుతున్న అపవిత్ర చర్యలపై ఒక్క సభ్యుడు కూడా ప్రశ్నించకుండా కేవలం టికెట్లు, దర్శనాలకే పరిమితం కావడం బట్టి..వారికి భక్తులతోపాటు, కొండపై పవిత్రతను కాపాడాలన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్ధమవుతూనే ఉంది. కొంతమంది సభ్యులు తమ కోటాను, పీఏలకు కేటాయించారన్న విమర్శలు కూడా వినిపిస్తుండటం విచారకరం.
సరే.. టీటీడీ బోర్డులో ఎక్కువ మంది టీడీపీ సభ్యులు ఉండవచ్చు. అందువల్ల వారికి మొహమాటం ఉందనుకోవచ్చు. కానీ ప్రశ్నించే జనసేన పార్టీ, హిందుత్వంపై పేటె ంట్ ఉన్న బీజేపీ సభ్యులు కూడా.. కొండపై జరిగే వ్యవహారాలను ప్రశ్నించకుండా, మౌనరాగం ఆలపించడమే ఆశ్చర్యం.
ప్రధానంగా బీజేపీ సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి, గతంలో టీటీడీ విధానాలపై విరుచుకుపడేవారు. కొండపై జరిగే అపవిత్రంపై గళమెత్తేవారు. కానీ ఇప్పుడాయనే బోర్డు సభ్యుడు. కానీ ఇప్పటివరకూ బోర్డు నిర్ణయాలను ప్రశ్నించినట్లు కనిపించలేదు. తాజాగా పాపవినాశనంలో బోటు షికారుపై భానుప్రకాష్‌రెడ్డి అగ్గిరాముడవుతారని భక్తులు భావించారు. బాలాజీనగర్‌లో దొరికిన మందుబాటిళ్లపై శివమెత్తుతారని అనుకున్నారు. కానీ ఎక్కడా ఇప్పటివరకూ చడీచప్పుడు లేదు. అటు బీజేపీ నాయకులు కూడా గత ఏడాది నుంచి టీటీడీ గురించి పెదవి విప్పడమే మానేయడం ఆశ్చర్యం.
అటు సనాతనధర్మ పరిరక్షకుడి అవతారమెత్తిన పవన్ కల్యాణ్‌పైనా.. ఈ అంశానికి సంబంధించి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాపవినాశనంలో బోటింగ్‌కు అనుమతి ఇచ్చిన అంశం ఇంత వివాదమవుతున్నా, ఇప్పటి వరకూ పవన్ ఎందుకు స్పందించలేదు? పైగా అటవీశాఖ కూడా ఆయన శాఖ పరిథిలోనిదే.
అదేవిధంగా కొండపైన ఉన్న బాలాజీనగర్‌లో మద్యం బాటిళ్లను స్వయంగా పోలీసులే పట్టుకున్న వైనంపై.. పవన్ సహజశైలి ప్రకారమయితే, ఈపాటికి అగ్గిరాముడవ్వాలి. అధికారులపై మూడో కన్ను తెరవాలి. టీటీడీ అధికారులు భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయాలి. తన శాఖ పరిథిలోనిదే కాబట్టి, బోటింగుకు ఆదేశించిన అధికారిని సస్పెండ్ చేయాలి. యధావిధిగా టీటీడీ ఈఓ, ఏఈఓ నిర్లక్ష్యంపై శివమెత్తాలి. కానీ.. అందుకు భిన్నంగా పవన్ కల్యాణ్ మౌనరాగం ఆలపించడమే భక్తుల ఆశ్చర్యానికి కారణం.
విచిత్రంగా పాపవినాశనంలో బోటింగ్‌పై స్వామీజీలు, పీఠాథిపతులు కూడా మౌనంగా ఉండటం మరో వింత. వారితోపాటు హిందూ సంస్థలు కూడా ఆ వ్యవహారంతో తమకు సంబంధం లేనట్లు మౌనంగా ఉన్న వైనం భక్తులను విస్మయానికి గురిచే స్తోంది.