– ఎల్ టి టి, టెర్రరిస్టులకు భయపడని కుటుంబం ఈడీ నోటీసులకు భయపడతుందా?
– ప్రశ్నించిన కాంగ్రెస్ నాయకుల పై ఈడీ, ఐటి దాడులు చేయించడం అప్రజాస్వామికం
కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేని బిజెపి ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ, ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు ఇప్పించడం పిరికిపంద చర్య అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. బుధవారం ఏఐసీసీ అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర రెడ్డి తో కలిసి హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.
స్వాతంత్రం తీసుకువచ్చి దేశ సమైక్యత, సమగ్రత కోసం ప్రాణాలర్పించిన కుటుంబం పట్ల బిజెపి ప్రభుత్వం కక్ష సాధింపుగా పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. ఎల్ టి టి, పంజాబ్ టెర్రరిస్టులకు భయపడని గాంధీ కుటుంబం ఈడీ నోటీసులకు భయపడుతుందని బిజెపి ప్రభుత్వం
భావించడం సిగ్గుగా ఉందన్నారు. మోడీ సర్కార్ తప్పిదాలను ఎత్తి చూపుతున్న ప్రతి సందర్భంలో కాంగ్రెస్ నాయకుల ఇళ్లపై ఐటి, ఈడిలతో దాడులు చేయించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించిన వారిపై ఈడి కేసులు, ఐటీ దాడులు చేసినంత మాత్రాన కాంగ్రెస్ నాయకులు ఎవరు భయపడరన్నారు.
ఇలాంటి 100 నోటీసులిచ్చిన సోనియా గాంధీ కుటుంబాన్ని భయపెట్టలేరన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గ్రహించాలని అన్నారు. ఉదయపూర్ చింతన్ శిబిర్ తర్వాత మతతత్వ బీజేపీ పార్టీని గద్దె దించడం కోసం కాంగ్రెస్ పార్టీ అనేక నిర్ణయాలు చేయడం బిజెపికి కంటగింపుగా మారింది అన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రజలను జాగృతం చేసేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేపట్టే కార్యక్రమాలతో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నందున రాజకీయంగా ఎదుర్కోలేని బిజెపి ఈడీ నోటీసులు ఇప్పించి వేధింపులకు పాల్పడుతున్నదని దుయ్యబట్టారు.
గతంలో ఈడి నోటీసులు ఇచ్చి వేధించి, వేధించి ఏమీ లేదని తేల్చి చెప్పిన బిజెపి ప్రభుత్వం మళ్లీ దేశ స్వాతంత్ర సంగ్రామంలో స్వతంత్ర భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మోతిలాల్ నెహ్రూ ఏర్పాటు చేసిన నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో సోనియా, రాహుల్ గాంధీ లకు ఈడి తో నోటీసులు జారీ
చేయించడం జుగుప్సకరంగా ఉందన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని బీజేపీ వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా ఉందన్నారు. సోనియా రాహుల్ గాంధీలకు దేశంలోని కాంగ్రెస్ శ్రేణులు ప్రజలు అండగా ఉంటారని వారిని బిజెపి ప్రభుత్వం ఏమీ చేయలేదని అన్నారు.
ఏఐసిసి అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాల తరువాత ఢిల్లీలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిర్వహించాలని ఇప్పుడు బిజెపి కి ఎందుకు గుర్తు వచ్చిందో ప్రజలకు తెలుసన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో, బిల్లు తీసుకురావడంలో ఎక్కడా కనిపించని బిజెపి నాయకులు ఇప్పుడు రాజకీయ లబ్దికోసం ఆవిర్భావ వేడుకలు పేరిట మోసలి కన్నీరు కార్చడం దురదృష్టకరమన్నారు.
తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడం కోసం చిల్లర రాజకీయాలు చేయడం బిజెపి మానుకోవాలని హితవు పలికారు. ఈడీ నోటీసులు పేరిట సోనియా గాంధీ కుటుంబ సభ్యుల పట్ల బిజెపి ప్రభుత్వం వేధింపులకు పాల్పడితే కాంగ్రెస్ కార్యకర్తలు దేశవ్యాప్తంగా రోడ్డుమీద కి వస్తారని, అప్పుడు బిజెపి తట్టుకోలేదని హెచ్చరించారు