Suryaa.co.in

Andhra Pradesh Political News

రెండుమూడు సార్లు ఎన్నికల్లో ఓడిపోయి మళ్లీ గెలవడం అందరికీ సాధ్యం కాదు!

– చంద్రబాబు రిచర్డ్‌ నిక్సనూ కాదు, కరుణానిధి అంతకన్నా కాదనే సోయి లేని టీడీపీ
(వేణుంబాక విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యులు)

ఒక దేశ అత్యున్నత పదవికి మొదటిసారి పోటీపడి ఓడిపోయాక ఏడెనిమిదో లేదా పదిపదిహేనేళ్లకో మరోసారి ప్రయత్నించి సఫలమయ్యే రాజకీయ నాయకులు కొద్ది మందే ఉంటారు. ఈ విషయంలో ఉదాహరణలు మొదటగా అత్యున్నత ప్రజాస్వామ్య దేశంలో పరిగణించే అమెరికా నుంచి తీసుకుందాం.

ప్రపంచ ప్రఖ్యాత అమెరికా అధ్యక్షుడు డ్వైట్‌ డి.ఐజనవుర్‌ హయాంలో (1953–61) ఎనిమిదేళ్లు ఉపాధ్యక్షుడిగా ఉన్న అంతకన్నా ప్రసిద్ధ నేత రిచర్డ్‌ ఎం నిక్సన్‌ గురించి చెప్పుకోవాలి. ఉపాధ్యక్ష పదవి ముగిసే సమయంలో అధ్యక్ష పదవికి రిపబ్లికన్‌ పార్టీ టికెట్‌ సునాయాసంగా సంపాదించారాయన.

అయితే, కొత్త తరానికి, మార్పునకు అవకాశం ఇవ్వాలనే నినాదంతో డెమొక్రాటిక్‌ టికెట్‌ పై అధ్యక్ష బరిలోకి దిగారు 43 ఏళ్ల మసాచూసెట్స్‌ సెనెటర్‌ జాన్‌ ఎఫ్‌ కెనడీ. హేండ్సమ్‌ నేతగా పేరున్న కెనడీ చేతిలో నిక్సన్‌ అతి స్వల్ప తేడాతో ఓడిపోయారు. 1960 నవంబర్‌ 8 అధ్యక్ష ఎన్నికల్లో విజేత కెనడీకి 3,42,20,984 ఓట్లు (49%) పోలవగా, నిక్సన్‌ కు 3,41,08,157 ఓట్లు (49.55%) లభించాయి.

అంటే ఇద్దరు అభ్యర్థుల మధ్య తేడా కేవలం 1,12,827 ఓట్లు మాత్రమే. ఎలక్టొరల్‌ కాలేజీ ఓట్లను పక్కనబెడితే, పాప్యులర్‌ ఓట్లలో ఇంత తక్కువ ఆధిక్యం సంపాదించింది అమెరికా చరిత్రలో కెనడీ ఒక్కరే. ఎనమిదేళ్ల ఉపాధ్యక్ష పదవి తర్వాత ప్రెసిడెంట్‌ కావడానికి ప్రయత్నించిన నిక్సన్‌ తొలి ప్రయత్నంలో ఇలా ఓడిపోయారు. కాని రెండేళ్ల తర్వాత 1962 నవంబర్‌ ఎన్నికల్లో ఆయన తన సొంత రాష్ట్రం కాలిఫోర్నియా గవర్నర్‌ పదవికి పోటీచేసి ఓడిపోయారు. కనీసం గవర్నర్‌ పదవిని కూడా దక్కించుకోలేకపోయిన నిక్సన్‌ రాజకీయ జీవితం ఇక ముగిసినట్టేనని రాజకీయ పరిశీలకులు భావించారు. (అసలు అధ్యక్ష పదవికి పోటీపడిన అభ్యర్థి గవర్నర్‌ పదవిని ఆశించడం ఈరోజుల్లో జరగదు.)

పట్టువదలని విక్రమార్కుడిలా తొలుత రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వాన్ని సంపాదించిన నిక్సన్‌ 1968 నవంబర్‌ అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ అభ్యర్థి, నాటి ఉపాధ్యక్షుడు అయిన హ్యూబర్ట్‌ హంఫ్రీని ఓడించి 50 ఏళ్ల వయసులో అమెరికా అధ్యక్షుడయ్యారు. నిక్సన్‌ తర్వాత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒకసారి ఓడిపోయిన ఏ నాయకుడూ మళ్లీ ఎన్నికల్లో గెలవ లేదు.

ఈ రికార్డు ప్రస్తుతానికి నిక్సన్‌ పేరు మీదే నిలిచి ఉంది. 2016 అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించి, మరుసటి ఎన్నికల్లో (2020) ఓడిపోయారు డొనాల్డ్‌ ట్రంప్‌. ఒకవేళ ఆయనకు ఈసారి కూడా రిపబ్లికన్‌ టికెట్‌ లభించి, 2024 నవంబర్‌ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తే–నిక్సన్‌ రికార్డును ట్రంప్‌ పగలగొట్టినట్టవుతుంది.

మొరార్జీకి రెండుసార్లు తప్పిపోయిన ప్రధాని పదవి 1977లో దక్కింది!
భారత తొలి ప్రధాని పండిత నెహ్రూ కన్నా వయసులో ఐదున్నరేళ్లు చిన్నవాడైన సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, నాటి బొంబాయి మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి అయిన మొరార్జీ దేశాయి గారు 1960ల్లో ప్రధాని పదవి కోసం రెండుసార్లు ప్రయత్నించారు. 1964 మేలో నెహ్రూ జీ కన్నుమూశాక ఆయన వారసుడు కావడానికి కాంగ్రెస్‌ పార్టీమెంటరీ పార్టీ (సీపీపీ) నాయకత్వం కోసం మొరార్జీ పోటీపడినప్పటికీ ఆయన కన్నా జూనియర్‌ అయిన లాల్‌ బహదూర్‌ శాస్త్రికి ఆ అవకాశం దక్కింది. 1966 జనవరిలో శాస్త్రీజీ హఠాన్మరణం తర్వాత ప్రధాని పదవి ఆశిస్తూ– సీపీపీ నాయకత్వానికి మొరార్జీ పోటీపడగా, పార్టీ సంస్థాగత నాయకత్వం (సిండికేట్‌) మద్దతు పుష్కలంగా ఉన్న నెహ్రూజీ కుమార్తె ఇందిరా గాంధీకి మెజారిటీ కాంగ్రెస్‌ ఎంపీల మద్దతు లభించింది.

ఇలా రెండో ప్రయత్నంలో కూడా గుజరాతీ నేత దేశాయి ఓడిపోయారు. చివరికి 1977 పార్లమెంటు ఎన్నికల్లో జనతాపార్టీ అధ్యక్షుడిగా ఉన్న మొరార్జీ గుజరాత్‌ నుంచి లోక్‌ సభకు ఎన్నికయ్యారు. అంతేగాక ఈ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికై 81 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి పీఠమెక్కారు. వాస్తవానికి కొత్తగా ఎన్నికైన జనతా ఎంపీల్లో మెజారిటీ సభ్యుల మద్దతు సీనియర్‌ దళిత నేత బాబూ జగ్జీవన్‌ రామ్‌ కు ఉన్నప్పటికీ, ఎమర్జెన్సీలో ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారనే కారణంతో లోక్‌ నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్, ఇతర సీనియర్లు మొరార్జీని ప్రధానిని చేయాలని నిర్ణయించారు. వారి అభిప్రాయం మొరార్జీకి కలిసొచ్చింది.

ఇక సీఎం పదవిని వరుసగా దాదాపు 7 ఏళ్లు నిర్వహించిన నేతల విషయానికి వస్తే– తమిళనాడు మాజీ సీఎం ఎం.కరుణానిధి గుర్తుకొస్తారు. 1969–76 మధ్య దాదాపు ఏడేళ్లు సీఎంగా ఉన్న ఈ డీఎంకే అధినేత 13 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నారు. చివరికి 1989 జనవరి ఎన్నికల్లో డీఎంకే ఘనవిజయంతో ఆయన ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారు. గత నాలుగున్నరేళ్లుగా ప్రతిపక్ష నేతగా ఉన్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మళ్లీ 2024లో సీఎం అవుతారని కొందరు టీడీపీ నేతలు కలలగంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ లో వాస్తవ రాజకీయ పరిస్థితులు చూడ నిరాకరిస్తున్న బాబు గారి అభిమానులు గమనించాల్సిన నిజం ఏమంటే–సుదీర్ఘ చరిత్ర ఉన్న డీఎంకేకు, ఫార్టీ ఇయర్స్‌ తెలుగుదేశం పార్టీకి ఎలాంటి పోలిక లేదు. ప్రజా ఉద్యమాల్లో రాటుదేలిన పోరాట యోధుడు, గొప్ప రచయిత అయిన కరుణానిధికి, కుప్పం ఎమ్యెల్యే నారా వారికి మధ్య పోల్చదగిన ఎలాంటి ఉమ్మడి రాజకీయ లక్షణాలు లేవు. ఈ నేపథ్యంలో టీడీపీ అభిమానులు, బాబు గారి భజనపరులు వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గెలుపుపై ఎలాంటి ఆశలు పెట్టుకోకపోవడమే వారి ఆరోగ్యానికి మేలు.

LEAVE A RESPONSE