Suryaa.co.in

Telangana

తెలుగు భాషని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగువారందరిపైన ఉంది

– మాతృభాష గొప్పతనాన్ని పిల్లలకు తెలియజేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉంది
– తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

హైదరాబాద్: అబిడ్స్ లోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఉత్తమ గ్రంథ పురస్కారాలు -2025 , వరిష్ట పురస్కారాలు ప్రదానోత్సవం కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఉత్తమ గ్రంథ రచయితలను సత్కరించి, అవార్డులను గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రదానోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” ఏ ఉద్యమం అయిన రచయితల రచనాలతోనే ఊపు అందుకుంటుందని , తెలంగాణ ఉద్యమం కూడా రచయితల వలన గొప్పగా నడిచిందన్నారు .తెలుగు సాహిత్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం నేడు చాలా ఉందన్నారు. నేడు సినిమా కల్చర్ ఎక్కువగా పెరగడం వలన సాహిత్యాన్ని ఎవరు ఆదరించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తెలుగు భాషని కాపాడుకోవాలి అంటే కచ్చితంగా సాహిత్యాన్ని కాపాడుకోవాలన్నారు . తెలుగు భాష గొప్పతనాన్ని , మాతృభాషలో ఉన్న అమృతాన్ని పిల్లలకు తెలియజేయాలని తల్లిదండ్రులను ఆయన కోరారు. మమ్మి అంటే దయ్యం , అమ్మ అంటే కన్నతల్లి అనే గొప్ప విషయాన్ని పిల్లలకు అర్ధం అయ్యేలా వివరించాలని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆచార్య ఎల్లూరి శివారెడ్డి ,తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షులు ,కాంచనపల్లి గోవర్ధనరాజు , ఉదారి నారాయణ, రామచంద్రమౌళి , కాలువ మల్లయ్య , సంగిశెట్టి శ్రీనివాస్, సంగంపట్ల నర్సయ్య , అమరవాది వద్దిరాజు రంగరాజు పద్మజ,
నాగరాజు సురేంద్ర , ఎన్నారు వెంకటేశం , రూప్ కుమార్ రవి , తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE