Suryaa.co.in

Telangana

సీఎం చెక్కులు చెల్లుబాటు కాకపోవడం సిగ్గుచేటు

– అలవోకగా అబద్ధాలు, అడుగడుగునా వైఫల్యాలు
– కాంగ్రెస్ ఎంచుకున్న రాచమార్గం ఇది
– ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్ నాయకులందరిదీ ఒకే దారి
– మహిళలకు వడ్డీ లేని రుణాల విషయంలో ఆర్థిక మంత్రి భట్టి గా నిన్న మంచిర్యాలలో మంచినీళ్లు తాగినంత సులువుగా మరోసారి అబద్ధాలు
– మహిళలను మోసం చేస్తున్న కాంగ్రెస్ వైఖరి పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం

హైదరాబాద్ : 21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇచ్చామని మళ్ళీ అదే పాత పాట పాడి మహిళలను మోసం చేసే ప్రయత్నం చేశారు. బ్యాంకు లింకేజీ కల్పించి, మొత్తం 21 వేలు వడ్డీ లేని రుణాలే అని ప్రచారం చేసుకోవడం కాంగ్రెస్ కే చెల్లింది. మీ ప్రభుత్వం ఎప్పటి లాగే, 5 లక్షల వరకే వడ్డీ లేని రుణాలు ఇస్తున్న మాట వాస్తవం కాదా భట్టి గారు, నిజం తెలిసి కూడా ఎందుకు అవాస్తవాలు మాట్లాడుతున్నారు.

ఇదే విషయంపై అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు జీవో 27 ప్రకారం, 5లక్షల వరకే VLR వర్తిస్తది అని సమాధానం చెప్పిన మాట వాస్తవం కాదా? 5లక్షల వరకే వడ్డీ లేని రుణం, మిగతా 15లక్షలకు మహిళలే వడ్డీలు కడుతున్నరు అన్నది వాస్తవం. 20 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్న మాట నిజమే అయితే సంబంధించిన జీవో బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం.

లేదంటే అసెంబ్లీ సాక్షిగా, బహిరంగ సభల్లో అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నందుకు యావత్ మహిళ లోకానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.

స్వయంగా ముఖ్యమంత్రి మహిళ సంఘాలకు రెండు సార్లు ఆవే చెక్కులు ఇచ్చినా ఇప్పటికి చెల్లుబాటు కాకపోవడం సిగ్గుచేటు. నవంబర్ 19, 2024 నాడు వరంగల్ లో స్వయం సహాయక సంఘ సభ్యులకు లోన్ బీమా, ప్రమాద బీమా చెక్కులను సీఎం అందించారు. మళ్ళీ అవే చెక్కులను మార్చి 8, 2025 నాడు ఇందిరా మహిళా శక్తి పేరిట హైదరాబాద్ లో నిర్వహించిన సభలో సీఎం అందించారు.

అయితే ఇప్పటివరకు అవి క్లియర్ గాక మహిళా సంఘాల సభ్యులు ఎదురు చూస్తున్నారు. ఇచ్చిన చెక్కులను వెంటనే క్లియర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

స్కూల్ విద్యార్థుల డ్రెస్ కుట్టు చార్జీలు 50 రూపాయలు ఇచ్చి, 75 రూపాయలు ఇస్తున్నం అని ప్రచారం చేసుకున్నరు.మేము నిలదీస్తే మిగతా 25 రూపాయలు విడుదల చేశారు, సంతోషం. కానీ ఇవి ఇంకా మహిళలకు చేరలేదు. వెంటనే చెల్లించండి. ప్రతి విద్యార్థి కొలతలు స్వయంగా వెళ్ళి తీసుకోవాలని షరతు పెట్టారు. మీరు ఇచ్చే 75 రూపాయలు ఎలా సరిపోతాయి? ఈ కుట్టు ఛార్జీలు 150 రూపాయలకు కి పెంచాలని మహిళా సంఘాల తరుపున డిమాండ్ చేస్తున్నాం.

స్వయం సహాయక బృందాలకు రుణాలు ఇచ్చే ‘శ్రీనిధి’ నిర్వహణ అస్తవ్యస్తంగా మారడం దురదృష్టకరం. మొత్తం రుణాలలో 40 శాతం వాటా నాన్-పెర్ఫార్మింగ్ అసెట్స్ (NPA) ఉండటం శ్రీనిధి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నది. దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఐఏఎస్ అధికారికి బాధ్యతలు అప్పగించి శ్రీనిధి భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం.

మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పి కోతలు కోసిన రేవంత్ రెడ్డి గారూ.. ఏడాదిన్నర పాలనలో మీరు మహిళలకు చేసింది ఎడతెగని వంచనే ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు మిగిలింది ఎడతెగని వేదనే. మహిళలను కోటీశ్వరులను కాదు, కనీసం లక్షాధికారులుగా కూడా చేయని చేతగాని సర్కారు మీది.

ఇప్పటికైనా ప్రచార యావ పక్కన బెట్టి, మహిళలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. వడ్డీ లేని రుణాలపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని, లేదంటే మహిళలే మీకు బుద్ధి చెబుతారని హెచ్చరిస్తున్నాం.

LEAVE A RESPONSE