ఇది లొంగటం కాదు…..డిఫెన్స్ లా కనపడే ఎటాక్…

Spread the love

రాహుల్ ద్రావిడ్…భారత క్రికెట్ చరిత్రలో పరిచయం అక్కర్లేని పేరు. అపారమైన అనుభవం, సంక్షోభ సమయంలో కూడా చెక్కుచెదరని మనో నిబ్బరం, పరుగులు సాధించడం ఎంత ముఖ్యమో,వికెట్ కాపాడుకోవటం అంతకంటే ముఖ్యమని, దాదాపు రెండు దశాబ్దాల పాటు నిదానం అనే మాటని మైదానానికి పరిచయం చేసిన గొప్ప ఆటగాడు. గ్యాలరీలో కూర్చుని చూసే వాడికి , ప్రతి బంతిని బౌండరీ కొట్టొచ్చని అనిపిస్తుంది. భారత క్రికెట్ కి ఎన్నో విజయాలను అందించడంలో ద్రావిడ్ ది కీలక పాత్ర. కానీ చాలామందికి ద్రావిడ ఆడుతున్నంత సేపు చిరాకేస్తుంది. ఎందుకంటే ఆయన డిఫెన్స్ కే డిఫెన్స్ నేర్పుతాడు. కొంతమంది చిరాకు పడతారు. కొంతమంది విసుక్కుంటారు,కొంతమంది అసలు ఇతను టీం లో అవసరమా అని కూడా అనుకుంటారు. కానీ ద్రావిడు ఎప్పుడు…..గ్యాలరీ కోసం వాడలేదు. తన వ్యక్తిగత ఇమేజ్ కోసం కూడా ఆడలేదు. క్రికెట్ ఆడినన్ని రోజులు…. జట్టు జట్టు కోసం ఆడాడు. జట్టుని నిలబెట్టడం కోసం ఆడాడు. జట్టుని గెలిపించడం కోసం ఆడాడు.

ఎక్కువమంది ప్రేక్షకులకు కృష్ణమాచారి శ్రీకాంత్ లు,వీరేంద్ర సెహ్వాగులు,మహేంద్ర సింగ్ ధోనీలు నచ్చినంతగా …..ద్రావిడ్ నచ్చడు. ఎందుకంటే సగటు ప్రేక్షకుడికి ప్రతి బాలు బౌండరీ దాటాలి,వీలైతే సిక్స్ పడాలి. కానీ ముందే చెప్పినట్టు…. మ్యాచ్ గెలవడం ఎంత ముఖ్యమో….వికెట్ కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఆయన డిఫెన్స్ చూసి,జిడ్డు గాడు అనుకున్న వాళ్లు కూడా, ఆయన అవుట్ అయినప్పుడు… ఆ షాట్‌ కొట్టకుండా ఉంటే బాగుండేది, అలా కొడితే బాగుండేది,ఇలా కొడితే బాగుండేది….అని మళ్ళీ వాళ్లే కామెంట్ చేస్తారు.

గ్యాలరీలో ప్రేక్షకుల అరుపులు, డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చుని చూస్తున్న జట్టు సభ్యుల స్పందన….. ఏవి పట్టించుకోకుండా…. ప్రతి బంతిని దీక్షంగా పరిశీలించి…. పరిశీలించి…. పరిశీలించి….పరిశీలించి…. బాహ్య ప్రపంచంతో సంబంధం లేని ఒక యోగిలా నిర్ణయం తీసుకునేవాడు. ఒక సీనియర్ ఆటగాడిగా ఆయన జడ్జిమెంట్ చాలాసార్లు జట్టుకి విజయాన్ని అందించింది. కొన్నిసార్లు జట్టు ఓడిపోవడానికి కూడా కారణమైంది ఆయన నిర్ణయాలే.

సుదీర్ఘ కెరియర్లో….. జట్టు సభ్యుడిగా,జట్టు కెప్టెన్ గా భావోద్రేకాలకు అతీతంగా….విజయమే లక్ష్యంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు కొన్ని ఫలించాయి. కొన్ని వికటించాయి. ఫలించినప్పుడు గంగోలి మాదిరిగా చొక్కా విప్పలేదు. వికటించినప్పుడు కుంగిపోలేదు.

ఇప్పుడు కాలం మారింది.
ఫార్మాట్ కూడా మారింది.
ఒకప్పుడు ఎవరు జట్టుతో వాళ్లు ఆడేవాళ్లు.
కానీ ఇప్పుడు ఐపీఎల్ పేరుతో ఎవరెవరో కలిసి ఒక జట్టుగా ఆడుతున్నారు .
కొత్త ఆటగాళ్ల కొత్త వ్యూహాలకు సీనియర్ ఆటగాళ్లు తడబడుతున్నమాట నిజం.

అప్పట్లో ఇంగ్లాండ్ / ఆస్ట్రేలియా/పాకిస్తాన్ జట్లతో…..విడివిడిగా ముఖాముఖి ఆడేవాళ్ళం.

కానీ ఇప్పుడు పరిస్థితి మారింది…
మనకు కనిపిస్తున్న ప్రత్యర్థి పాకిస్తాన్ అయినప్పటికీ, ఆట మొదలవుకముందే ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా…పాకిస్తాన్ కు అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నాయి.
ఆ విషయం ఆట పూర్తయి,ఓడిపోయిన తర్వాత మనకు అర్థమవుతుంది.

అందుకే ఈసారి మ్యాచ్ లో పాకిస్తాన్ ని ఓడించడానికి…ఇంగ్లాండ్ సహకారం అవసరమైంది.
ఈ మధ్య ఇంగ్లాండ్ కి ఆస్ట్రేలియా కి మధ్య యుద్ధం మొదలవడం, మనకు అనుకూలంగా మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది.

ఇంగ్లాండ్ మనకు చాలా ద్రోహం చేసింది, ఇంగ్లాండ్ మీద మనకి చాలా కోపం ఉంది.

కానీ ఇప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి….పాకిస్తాన్ ని ఓడించాల్సిన అవసరం ఉంది.
అందుకే…
వ్యూహం అనుకోండి….
చాణక్యవనుకోండి…
చేతగానితనం అనుకోండి…
చారిత్రక తప్పిదం అనుకోండి.

ఏమైనా అనుకోండి…..
పాకిస్తాన్ ని ఓడించడానికి ….ఈసారి ఇంగ్లాండు సహకారం…చారిత్రక అవసరం.
ఇది ఇంగ్లాండ్ కి లొంగటం కాదు…..పాకిస్తాన్ నుండి జట్టుని, జట్టు సభ్యుల్ని కాపాడుకునే…డిఫెన్స్ లా కనపడే ఎటాక్.

– డాక్టర్ కొలికపూడి శ్రీనివాస రావు

Leave a Reply