– అల్లు అర్జున్ ను ఒంటరి చేయడం కరెక్ట్ కాదు
– సినిమా అంటే టీం వర్క్
• రేవంత్ రెడ్డి చట్టం అందరికీ సమానమే అనే గౌరవం కాపాడారు
– రేవంత్‌రెడ్డి చేసింది రైటే
– అర్జున్ బయటకొచ్చి అభివాదం చేయడం తప్పపట్టను
– పుష్ప థియేటర్ ఎపిసోడ్‌లో మానవతాకోణం లోపించింది
– అందులో పోలీసుల తప్పేమీ లేదు
• సంధ్య థియేటర్ ఘటన తరవాత బాధిత కుటుంబానికి అండగా ఉన్నామని చెప్పాల్సింది
– గోటితో పోయేది గొడ్డలి వరకు వచ్చిందనిపించింది
• నాగబాబు పనితీరు ప్రామాణికంగానే పదవి
– నెలలో 14 రోజులు పేషీతో సహా జిల్లాల్లో పర్యటన
• సమస్యలకు సత్వర పరిష్కారం.. భిన్న పరిస్థితులపై అధ్యయనం
• మొదటి ఆరునెలల్లో పాలనపై పట్టు పెంచుకున్నాం
• గత అయిదేళ్లలో పట్టుతప్పిన కార్యనిర్వాహక వ్యవస్థ సమస్యలు తీర్చి.. గాడిలో పెడుతున్నాము
• మహిళలను వివాదాల్లోకి లాగే ప్రభుత్వం మాది కాదు
• సెక్యులరిజం అంటే అన్ని మతాలకు సమన్యాయం ఉండాలన్నదే నా ఆకాంక్ష
• పార్టీ నాయకుల్ని కలుసుకోలేకపోతున్నాననే బాధ నాలోనూ ఉంది
– బంధుప్రీతి విషయంలో మీడియా ప్రతినిధులు ఎప్పుడూ జగన్‌ను ఎందుకు ప్రశ్నించలేదు?
• మంగళగిరిలో విలేకరులతో ఇష్టాగోష్టిలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
తన సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్సీ ఇవ్వడం వెనక బంధుప్రీతి లేదని, కేవలం పార్టీకి కష్టపడ్డారన్న కోణంలోనే కేటాయించానని జనసేన దళపతి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఆయన కూడా తనతోపాటు కష్టపడ్డానన్నారు. కలసి కష్టపడేవారికి న్యాయం చేస్తే అది బంధుప్రీతి ఎందుకు అవుతుందన్న పవన్… జగన్ బంధుప్రీతిపై ప్రశ్నించని మీడియా తనను మాత్రమే ఎందుకు ప్రశ్నిస్తుందన్నారు. తనకు మంత్రి దుర్గేష్ , ఎమ్మెల్సీ హరిప్రసాద్ కులమేమిటో కూడా తెలియదన్న పవన్.. ఇటీవల హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో పుష్ప సినిమా షో రోజు జరిగిన ఘటనలో, హీరో అల్లు అర్జున్‌ను ఒంటరివాడిని చేశారని వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చట్టప్రకారమే వ్యవహరించారని, అందులో పోలీసుల తప్పులేదన్న పవన్.. థియేటర్ వద్ద అల్లు అర్జున్ ప్రేక్షకులకు ఓపెన్‌టాప్‌లో నిలబడి అభివాదం తప్పు లేదని సమర్ధించారు. తన పార్టీ కార్యకర్తలు, ప్రజలను కలుసుకోవాలని ఉన్నా, కలవలేకపోతున్నాననే బాధ తనకూ ఉందన్న పవన్.. పాలనా, రాజకీయాలు, ఇతర అంశాలపై మీడియాతో తొలిసారి పిచ్చాపాటీగా మాట్లాడారు.
మంగళగిరి: ‘పుష్ప – 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన దుర్ఘటన దురదృష్టకరం. ఈ విషయంలో హీరో అల్లు అర్జున్ని సినిమా బృందం అంతా ఒంటరిని చేశారనిపించింది. దుర్ఘటన జరిగిన వెంటనే హీరో లేదా ఆ సినిమా టీం బాధితుల కుటుంబం దగ్గరకు వెళ్లి మేమున్నామని, జరిగిన సంఘటన బాధాకరమని ఓదార్పును ఇవ్వాల్సింది. అలా చేసి ఉంటే విషయం పెద్దది అయ్యేదే కాదు. అయితే ఆ పని జరగలేదు. తర్వాత ఒక్కొక్కటిగా జరిగిన విషయాలన్నీ గోటితో పోయేది గొడ్డలి వరకు తెచ్చారు‘అనిపించిందని ఉప ముఖ్యమంత్రి, జనసేనాధిపతి పవన్‌కల్యాణ్ వ్యాఖ్యానించారు.
సోమవారం ఉదయం మంగళగిరిలోని డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ సూటిగా స్పందించారు. సినిమా హీరో తన సినిమాను ప్రత్యక్షంగా తిలకించడానికి థియేటర్ కు వెళ్లాలని అనుకోవడం తప్పు కాదు. అయితే పోలీసులు చెప్పిన భద్రతా విషయాలు పాటించాలి. అల్లు అర్జున్ సిబ్బంది అయినా జరిగిన దుర్ఘటన గురించి ఆయనకు వెంటనే చెప్పాల్సింది. అదీ జరగలేదు. అల్లు అర్జున్ థియేటర్ బయట ప్రేక్షకులకు అభివాదం చేయడాన్ని తప్పు పట్టను. ఓ సినిమా హీరో అభిమానులకు, ప్రజలకు అభివాదం చేయకపోతే పొగరు.. లేదా అహంకారం అనుకునే ప్రమాదం ఉంటుంది. అభిమానులు కూడా తమ హీరో అభివాదం చేస్తే ఆనందపడతారు.
పోలీసులను కూడా ఈ ఘటన విషయంలో తప్పు పట్టలేను. భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తూ, వారు ఎప్పటికప్పుడు వీఐపీలను హెచ్చరిస్తూ ఉంటారు. అది వారి విధుల్లో భాగం. సంధ్య థియేటర్ దుర్ఘటన జరిగినపుడు కూడా పోలీసులు తమ విధులను నిబద్ధతతో నిర్వర్తించారు. ఇక చట్టం అందరికీ ఒకేలా పనిచేస్తుంది అనేలా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరించారు. ఆయన గత వైసీపీ ప్రభుత్వం వ్యవహరించినట్లుగా, ఎప్పుడూ అప్రజాస్వామికంగా వ్యవహరించలేదు. సినీ పరిశ్రమకు పూర్తిగా ప్రాధాన్యం ఇచ్చారు. దీంతోనే సినిమాల కలెక్షన్లు హైదరాబాద్ లో పెరిగాయి.
పుష్ప వివాదంలో ఆయన వ్యక్తిగత, రాజకీయ అంశాల జోలికి వెళ్లలేదు. అల్లు అర్జున్ మామగారు కూడా కాంగ్రెస్ నాయకుడే. కానీ ఇలాంటి విషయాల్లో అల్లు అర్జున్ కు మినహాయింపు నిస్తే, తర్వాత చాలామందికి చట్టం పనితీరు విషయంలో సమాధానం చెప్పుకోవల్సి ఉంటుందనే కోణంలోనే అరెస్ట్ చేశారని నేను భావిస్తాను. ఈ మొత్తం వ్యవహారంలో అల్లు అర్జున్ ను ఒంటరి చేశారనిపించింది. సినిమా టీం సమష్టిగా బాధ్యత వహించాల్సిందిపోయి, కేవలం అల్లు అర్జున్ ను మాత్రమే ముందు పెట్టారనిపించింది. ఈ మొత్తం వ్యవహారం గమనిస్తే ఎక్కడో మానవతా దృక్పథం లోపించడం వల్లనే ఈ విషయం గోటితో పోయేది గొడ్డలి వరకు వచ్చిందనిపించింది.
• నాగబాబు పని తీరే ప్రామాణికంగా తీసుకున్నాం
రాజకీయాల్లో పని తీరే ప్రామాణికం. మనతోపాటు కలిసి పనిచేసిన వారిని గుర్తించాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. నాగబాబు నా సోదరుడు కాకపోయినా, నాదెండ్ల మనోహర్ వేరే కులానికి చెందిన వ్యక్తి అయినా నేను తీసుకుంటాను. మనోహర్ , హరిప్రసాద్ మొదటి నుంచి పార్టీ కోసం పని చేశారు. అలాగే నాగబాబు నాతో పాటు సమానంగా పార్టీ కోసం పనిచేశారు. వైసీపీ నేతలతో తిట్లు తిన్నారు. పార్టీ కోసం అండగా నిలబడ్డారు. ఇక్కడ కులం, బంధుప్రీతి అని కాదు.. పనిమంతుడా కాదా? అన్నది చూడాలి. నాకు నిజంగా బంధు ప్రీతే కనుక ఉంటే హరిప్రసాద్ కి కాదని నాగబాబు కే మొదట ఎమ్మెల్సీ పదవి ఇచ్చేవాడిని.
హరిప్రసాద్ ఏ కులమో నాకు తెలియదు. నాతోపాటు కలిసి పని చేశారా? లేదా? అని మాత్రమే చూస్తాను. సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్న పెదపూడి విజయ్ కుమార్ విద్యార్థి నాయకుడిగా పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఆయన మాల కార్పొరేషన్ ఛైర్మన్ అయ్యారు. ఎవరికి ప్రతిభ ఉందో చూసి, వాళ్లకు పదవులు ఇస్తాం. నాగబాబుని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి, మళ్లీ తప్పించాం. కూటమి పొత్తులో భాగంగా గెలిచే సీటును బీజేపీకి వదులుకున్నాం. ఆయన త్యాగం గుర్తించి రాజ్యసభకు అనుకున్నాం కుదరలేదు. కాబట్టి ఎమ్మెల్సీ అనుకున్నాం. నాగబాబు ఎమ్మెల్సీగా ఎంపికవుతారు. మంత్రి పదవి విషయంలో తర్వాత చర్చ చేస్తాం. బంధుప్రీతి విషయంలో మీడియా ప్రతినిధులు ఎప్పుడూ జగన్‌ను ఎందుకు ప్రశ్నించలేదు? కేవలం పవన్‌కల్యాణ్‌ను మాత్రమే ఎందుకు అడుగుతున్నారు? మాకు బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా అన్నయ్య సొంతంగా ఎదిగారు. ఇప్పుడు మా తర్వాత తరం పిల్లలకు ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉంది. మనతో ప్రయాణం చేసి, పనిచేసిన వారిని నేను గుర్తించాలి. కందుల దుర్గేష్ ఏ కులమో నాకు తెలియదు. ఆయన పని తీరు నచ్చి మంత్రి పదవి ఇచ్చాను. రాజకీయాల్లో కులం కాదు.. పని తీరే ప్రామాణికం.
‘సమస్యలను స్వయంగా చూసి, క్షేత్రస్థాయిలో జరిగే అవినీతి, అక్రమాలను వాస్తవంగా పరిశీలించినప్పుడే ప్రజా సమస్యల అసలు లోతు తెలుస్తుంది. బాధితులు ఫిర్యాదు రూపంలో లేదా నోటిమాటగా చెప్పినదాని కంటే వాటిని ప్రత్యక్షంగా తెలుసుకున్నపుడు, క్షేత్రస్థాయికి వెళ్లి చూసినపుడు అసలు స్వరూపం కనిపిస్తుంద’ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు.
ఏజెన్సీ ప్రాంతానికి వెళ్తే చెప్పులతో నడిచే పరిస్థితులు కూడా లేక బురదలో వెళ్లాల్సి వచ్చింది… నేను నడిచి చూపిస్తే క్షేత్ర స్థాయిలో అధికారులు కూడా అంతే బాధ్యతగా పనిచేస్తారనిపించిందన్నారు. రాష్ట్రంలో ఇంకా అనేక ప్రాంతాల్లోని సమస్యలు, అక్కడి ఇబ్బందులను తెలుసుకొనేందుకు నేను నా పేషీతో సహా జిల్లాల్లో కూర్చోవడం అవసరం అనిపించిందని పేర్కొన్నారు. ఇందుకోసం నెలలో 14 రోజులు జిల్లాల్లో పర్యటనలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ఉంటేనే ప్రజల సమస్యలను నేరుగా అర్ధం చేసుకొని, వాటికి సత్వర పరిష్కారం చూపగలనని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిద్వారా అధికార యంత్రాంగం పనిలో నాణ్యత ఉండాలని కోరుకుంటున్నానని పునరుద్ఘాటించారు.
• ఆరు నెలల్లో పాలనా విషయాలపై పట్టు
“నేను ఎప్పుడూ ప్రజల మధ్య ఉండే మనిషిని. వీధుల్లో తిరగడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు కార్యాలయంలో కూర్చుని పని చేయడం అలవాటు చేసుకుంటున్నాను. ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల కాలంలో పరిపాలన గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. విధానపరమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో ఉన్న ఇబ్బందులు తెలుసుకున్నాను. ఆఫీసుల్లో కూర్చుని సమస్యలకు పరిష్కారాలు వెతకలేము. నేను ఎక్కువ ప్రజల్లో తిరిగి ప్రతి సమస్యను అర్ధం చేసుకోవడం వల్ల పాలనా అనుభవం లేకపోయినా పరిష్కారాలు వెతకడం తేలిక అయ్యింది. ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్నా, వాటి పరిష్కార మార్గాలు వెతకాలన్నా ప్రజల మధ్యకే వెళ్లాలి. ప్రజలే తమ సమస్యకు పరిష్కార మార్గాలు కూడా చూపుతారు. అధికారిక వ్యవహారాలకు సంబంధించిన భాష కూడా అర్థమైంది.
• ఒక దాని వెంటే 100 సమస్యలు
2008 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. 2014లో పార్టీ స్థాపించాను. సుమారు దశాబ్దన్నర కాలం ప్రజా జీవితంలో ఉన్నాను. అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు ఉన్న సమయం సరిపోవడం లేదు. ఒక సమస్య పరిష్కారం చేసేలోపు వంద దరఖాస్తులు వచ్చిపడుతున్నాయి. మన దగ్గరకు వచ్చే సమస్యలను పరిశీలించి బాధితుల వేదన తీర్చాలని ప్రయత్నిస్తున్నా. రాష్ట్రంలో ఎక్కువ మంది ప్రజలు గ్రామాల్లోనే ఉంటారు. నా శాఖల ద్వారా ఎక్కువ అభివృద్ధి చేయవచ్చు. క్షేత్ర స్థాయి పర్యటనల వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మొన్న గాలివీడులో ఎంపీడీఓ మీద దాడి జరిగినప్పుడు కడప, అన్నమయ్య జిల్లాలో పర్యటించాల్సి వచ్చింది. కేవలం అధికారుల మీదనే కాదు.. క్లాస్ ఫోర్ ఉద్యోగి మీద దాడి జరిగినా నా స్పందన అలాగే ఉంటుంది.
• అధికారుల్లో స్పందించే గుణం తగ్గిపోయింది
సినిమా, రాజకీయాలు ఇప్పుడు నా జీవితం లో భాగం అయిపోయాయి. సద్వినియోగం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. నాకు ఇప్పుడు అసలు సమయం దొరకడం లేదు. నేను 365 రోజులు పని చేయడానికి సిద్ధమే… అయితే శని, ఆదివారాలు కూడా క్షేత్ర స్థాయిలో పని అంటే ఉద్యోగులు ఇబ్బందులుపడతారన్న ఆలోచన ఉంది. పనిలో నాణ్యత రావాలి అంటే సెలవులు తీసుకోవచ్చు. గత ప్రభుత్వ తీరు వల్ల అధికారుల్లో స్పందించే గుణం తగ్గిపోయింది. జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ యువకుడు బ్రెయిన్ డెడ్ అయ్యారు. అంత బాధలోనూ ఆ యువకుడి అవయవాలు దానం చేశారు. ప్రమాదానికి కారణమైనవారిపై చర్యలు కోరుతూ పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన మృతుల కుటుంబ సభ్యులపై పోలీసులు వ్యవహరించిన తీరు సరిగా లేదు. ఈ విషయం మా కార్యాలయం దృష్టికి వస్తే జిల్లా ఎస్పీతో మాట్లాడితే ఆయన కూడా మానవత్వంతో స్పందించలేదు. పాలనలో మానవీయత ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల కలెక్టర్ల సమావేశంలో చెప్పారు. అధికారులు, పోలీసులు ప్రజల పట్ల బాధ్యతతో వ్యవహరించాలి.
• కార్యనిర్వాహక వ్యవస్థను అట్టడుగుకు దిగజార్చారు
ముఖ్యమంత్రి తరచూ మానవతాదృక్పథంతో పని చేయాలని చెబుతారు. మానవతా దృక్పథం లేని ప్రభుత్వం ఉండి ఏం లాభం? గత ఐదేళ్లలో బ్యూరోక్రసీ అట్టడుగుకు దిగజారిందని కేంద్రం నుంచి ఓ అధ్యయన నివేదిక వచ్చింది. గతంలో ప్రతి శుక్రవారం, శనివారం నిర్మాణంలో ఉన్న రోడ్ల నాణ్యతను అధికారులు పరిశీలించే వారు. గత ఐదేళ్లలో అది కూడా జరగలేదు.
• కూటమి ప్రభుత్వంలో పారదర్శకత పాటించాం
అధికార యంత్రాంగాన్ని పటిష్టపరచడంతోపాటు వారి సమస్యలపై కూడా దృష్టి సారించాలన్నది మా ఉద్దేశం. అధికారుల మీద దాడి జరిగితే మనోస్థైర్యం నింపడానికి కడప వెళ్లాను. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అవినీతి లేకుండా బదిలీలు, ప్రమోషన్లు ఇచ్చాం. కొంత మంది అధికారులు ఆర్డర్ వచ్చాక మాదేనా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జాబితా చూసిన తర్వాత మెరిట్ ఆధారంగా వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంతో పోలిస్తే కూటమి ప్రభుత్వం గొప్పగా పని చేస్తుంది. గత ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలను చిందరవందర చేశారు. తప్పు జరుగుతున్నప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారని కలెక్టర్ల సమావేశంలో అడిగితే ఎవరూ నోరు మెదపలేకపోయారు.
• ఆరు నెలల పాలన బేరీజు వేయండి
గత ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి ఆరు నెలల పాలనతో మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలల పాలన బేరీజు వేయండి. ఆర్థికపరంగా ఇబ్బందులు ఉన్నాయి. పక్కాగా యంత్రాంగాన్ని నిర్లక్ష్యం చేశారు. ఆర్థికంగా రాష్ట్రాన్ని నలిపేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడి వరకు తీసుకువచ్చామంటే గొప్ప విషయం. నెలలో ఒకటో తేదీన జీతాలు ఇవ్వగలుగుతున్నాం. సామాజిక పింఛన్లు సమయానికి ఇవ్వగలుగుతున్నాం. గత ప్రభుత్వ కుంభకోణాలు బయటపెట్టాం. వైసీపీ ఆరు నెలలతో పోలిస్తే కూటమి ప్రభుత్వానికి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. మొదటి ఆరు నెలలు పరిపాలనాపరమైన అంశాలు, అధికారుల పని తీరు, ప్రజల నుంచి వస్తున్న సమస్యలపై దృష్టి సారించాం. వచ్చే ఆరు నెలలు నేరుగా ప్రజల్లోకి వెళ్లి క్షేత్ర స్థాయి పరిస్థితులపై తెలుసుకుంటాం.
• రాష్ట్రం విభిన్న పరిస్థితుల సమాహారం
జిల్లాల్లో పర్యటించి క్షేత్ర స్థాయిలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి వాటి పరిష్కారాలు ఆలోచిస్తాం. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో పనులు ఇతర శాఖల పరిధిలో ఉన్న పనులు గుర్తించి పరిష్కారానికి కృషి చేస్తాం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పింది కూడా అదే. ప్రతి గ్రామానికి తాగునీరు ఇవ్వాలన్నది మోదీ కల. ఆంధ్రప్రదేశ్ లో వంద శాతం దీనిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. తాగునీరు, పారిశుధ్యం, పర్యావరణం తదితర అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాను.
• వాక్ స్వాతంత్ర్యపు హక్కును గౌరవిస్తాం
భారత రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్ర్యపు హక్కును సంపూర్ణంగా గౌరవిస్తాం. అయితే మనిషిపై మానసికంగా దుష్ప్రభావం చూపించే మాటలను మాత్రం అంగీకరించం. ఇష్టానుసారం మాట్లాడి సమాజంలో అశాంతి, హింసను ప్రోత్సహించే వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండటానికే రాజ్యాంగం మనకు హక్కులను కల్పించింది. ఏదైనా విషయంపై చర్చ లేదా నిరసన చాలా హుందాగా, గౌరవంగా ఉండాలి. దాన్ని పక్కన పెట్టి అసభ్య పదజాలం వాడుతాం.. అడ్డువచ్చిన వారిపై దాడులు చేస్తాం.. దానికి వాక్ స్వాతంత్ర్యం అని పేరుపెడతాం అంటే మాత్రం చట్టం తన పని తాను చేసుకొని వెళ్తుంది.
• పేర్ని జయసుధపై కక్ష కట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు
గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు వ్యవహరించినట్లుగా ఇంట్లోని ఆడవారిని బూతులు తిట్టడం మేం చేయం. సాక్షాత్తూ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు భార్యను నోటికొచ్చినట్లు మాట్లాడిందే వాళ్ళు. పౌరసరఫరాల శాఖ పరిధిలో బియ్యం నిల్వ గోదాములో భారీగా బియ్యం మాయమయ్యాయి. అక్రమాలు జరిగిన గోదాము పేర్ని జయసుధ పేరు మీద ఉంది. అప్పుడు చట్టపరంగా కేసులో జయసుధ పేరు పెట్టాల్సి ఉంటుంది. తప్పు జరిగిందని తెలిసే గోదాము యజమానులుగా వారు ఒప్పుకొని అప్పటికప్పుడు రూ.1.7 కోట్ల జరిమానా కట్టడానికి ముందుకు వచ్చారు. మరి తప్పు జరిగినప్పుడు దోషులుగా వారి పేరు పెట్టడంలో తప్పేముంది. దీనిలో కక్ష సాధింపు ఎక్కడుంది..?
• పంతం నానాజీ వివాదంలో వెంటనే స్పందించాం.. క్షమాపణ చెప్పించాం
కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ ఓ దళిత అధికారిపై దూకుడు వ్యవహరించిన ఘటన జరిగిన వెంటనే నేను 15 నిమిషాల్లో స్పందించాను. జరిగిన విషయాన్ని తెలుసుకున్నాను. కేసు కూడా నమోదు చేశారు. సదరు అధికారికి ఆ ఎమ్మెల్యే గంటల్లోనే బేషరతుగా క్షమాపణ చెప్పారు. ఏం జరిగిందో వీడియోలు తెప్పించుకొని మరీ పరిశీలించాను. ఎమ్మెల్యే కోపంలో అప్పటి పరిస్థితుల్లో కాస్త దూకుడుగా వ్యవహరించారని అనిపించింది. వెంటనే ఎమ్మెల్యే పశ్చాత్తాపపడి సదరు వైద్యుడికి క్షమాపణలు చెప్పారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగినపుడు వెంటనే ప్రజా ప్రతినిధులు, నాయకులు తగు విధంగా స్పందించి బాధితులకు సాంత్వన చేయడం కంటే పెద్ద ఊరట ఏముంటుంది..?
• అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో ఉండాలి
రాష్ట్ర ప్రజలకు సంక్షేమం ఎంత ముఖ్యమో అభివృద్ధి అంతే ముఖ్యం. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయని అంటారు. అభివృద్ధి ద్వారా మానవ వనరుల లభ్యత, అవకాశాలను సృష్టించవచ్చు. ప్రజల జీవన విధానాలను మార్చే అవకాశం ఉంటుంది. ఓ గ్రామానికి మంచి రోడ్డు వేస్తే అక్కడకు కొత్తకొత్త ఉపాధి వనరులు, అవకాశాలు వస్తాయి. దీంతో ఆ ప్రాంతంలోని వారికి ఊరట లభిస్తుంది. శాశ్వతంగా వారి జీవన ప్రమాణాలు పెరుగుతాయి. సంక్షేమం కూడా ప్రజలకు అవసరం. ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండూ సమాంతర చక్రాల్లా ముందుకు నడిపిస్తాయి. అవసరం మేరకు సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తూనే, వారి జీవన స్థితిగతులను మార్చే అభివృద్ధిని వారికి ఇవ్వాలి. దేశం ముందుకు వేగంగా నడుస్తున్న వేళ ఆ గతిలో మనం కూడా తగిన ప్రణాళికతో నడవాల్సి ఉంటుంది.
• పర్యావరణంపై బాధ్యత పెరగాలి
కాకినాడ తీరంలో అలీవ్ రిడ్లీ తాబేళ్ల సంరక్షణపై దృష్టి నిలిపాం. తీరంలో సుమారు 100కుపైగా తాబేళ్లు మరణించాయని తెలియగానే దీనికి గల కారణాలపై అధికారులను నివేదిక కోరాం. నివేదిక రాగానే దానికి అనుగుణంగా ఏం చేయాలనే దానిపై వర్క్ షాపు నిర్వహిస్తాం. మత్స్యకారుల వలలకు తాబేళ్లు చిక్కుకొని మరణిస్తున్నాయా..? లేక కాలుష్యం కారణమా అనేది నిగ్గు తేలుస్తాం. పర్యావరణానికి మేలు చేసే అలీవ్ రిడ్లీ తాబేళ్ల సంరక్షణ అందరి బాధ్యత. పర్యావరణ సంరక్షణపైనా అందరికీ బాధ్యత ఉండాలి. అలాగే అటవీశాఖలోని కీలకమైన అంశాలపైనా దృష్టి సారిస్తాం. ఇటీవల కడపలో పర్యటించినపుడు కొందరు వ్యక్తులు అడవుల్లో లభ్యమయ్యే బొగ్గును తవ్వేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. ఒక్కక్కటిగా తెలుసుకుంటున్నాం. అటవీశాఖ అధికారులపై ప్రజల్లో ప్రతికూలమైన అభిప్రాయం కనిపిస్తోంది. దీన్ని నిజాయతీ గల పనితీరుతోనే అధిగమించాలి.
• సాంకేతికత అధికం కావడం వల్ల నైపుణ్యం దెబ్బతింటోంది
టెక్నాలజీకి మనం వశం అయిపోతే వినాశనానికి దగ్గర అయినట్లే. సెల్ ఫోనే మన బలం, బలహీనత కూడా. ఒకప్పుడు మేఘాలు, తూనీగలను చూసి వర్షం వస్తుందని చెప్పేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మనకు ఏదీ కావాలన్నా గూగుల్ ను అడగాల్సిన పరిస్థితికి వచ్చాం. మన శక్తి, సామర్థ్యాలను మిషన్లకు ఇచ్చేస్తున్నాం. మన ఇంటిలిజెన్స్ తగ్గించుకొని వాటి ఇంటిలిజెన్స్ పెంచుతున్నాం. టెక్నాలజీ పెరగడం వల్ల క్రియేటివిటీ దెబ్బ తింటోంది. దీని ప్రభావం మన భవిష్యత్తు తరాలపై పడుతుంది. వారికి ఇప్పటి నుంచే గ్రంథాలయాల్లో చదవడం, శారీరకంగా దృఢంగా ఉండేలా చూడడం మన బాధ్యత. అందుకే ప్రతి స్కూల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేసేలా చూస్తున్నాం.
• గత ప్రభుత్వంలో ఎర్రచందనం ఖాళీ చేసేశారు
గత ప్రభుత్వం హయాంలో ఎర్ర చందనాన్ని పూర్తిగా దోచుకున్నారు. శేషాచలం అడవుల్లోకి వెళ్లి చూస్తే పూర్తిగా చెట్లను నరికేశారు. వాళ్లు కొట్టే విధానం చూస్తే మతిపోతుంది. పుష్ప లాంటి సినిమాలు రావడానికి కారణం కూడా వీళ్లు దోచుకున్న విధానమే. ఎర్రచందనం టన్నుకు రూ.70 లక్షలు వస్తుందని అనుకున్నాం. ఏ కారణమో తెలియదుగానీ చైనా వాళ్లు కొనడం తగ్గించేశారు. దీంతో అంత రేటు రావడం లేదు. ఇతర దేశాలతో మాట్లాడుతున్నాం. కొన్ని రోజుల్లో సమస్య తొలగిపోతుంది. గత ప్రభుత్వ హయాంలో ఎర్రచందనం అక్రమ రవాణాని నిరోధించలేకపోయింది.
గతంలో మన రాష్ట్రం నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న రూ.110 కోట్ల విలువ చేసే ఎర్ర చందనాన్ని కర్ణాటకలో అటవీ శాఖ అధికారులు సీజ్ చేశారు. అది వాళ్లు అమ్మేసుకున్నారు. ఇందుకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య ఓ ద్వైపాక్షిక ఒప్పందం అనేది ఏమీ లేకపోవడమే అందుకు కారణం. ఇటీవల కర్ణాటక పర్యటనలో ఆ విషయం తెలిసి అడిగితే మీ వల్ల మాకు రూ. 110 కోట్ల లాభం వచ్చిందని ఆనందంగా చెప్పారు.
మన అటవీశాఖ వద్ద సిబ్బంది కొరత ఉంది. సిబ్బంది కొరత ఎందుకు ఉంది అంటే నిధుల లేమి కారణం అంటున్నారు. ఉన్నంతలో మన వాళ్లు బాగా పని చేస్తున్నారు. ఇటీవల కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ని కలిసినప్పుడు రాష్ట్రల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం అంశాన్ని లేవనెత్తాం. మొదటి సారి కర్ణాటకతో ఒప్పందం చేసుకున్నాం. ఒప్పందం మేరకు మన రాష్ట్ర ఉత్పత్తి వారి రాష్ట్రంలో దొరికితే 60 : 40 రేషియోలో పంచుకోవాల్సి ఉంటుంది.
• 11 సీట్లు వచ్చినా.. వైసీపీదీ అదే రౌడీయిజం
వైసీపీ నాయకులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. అన్నమయ్య జిల్లాలో ఎంపీడీవోపై దాడి చేశారు. ఇలాంటి చర్యలను ప్రజలు ఉపేక్షించరు. 11 సీట్లు వచ్చాక కూడా వారిలో మార్పు రాలేదు. వారి పార్టీ నేతలను జగన్ ఎందుకు ఆపడం లేదు? ప్రభుత్వ అధికారులపై దాడులు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పువు. ప్రజలు క్రిమినల్ పాలిటీషన్లను సహించరు. ఇలాంటి రాజకీయాలను ఉపేక్షించరు.
• పార్టీ నాయకుల్ని కలవలేకపోతున్నామనే బాధ ఉంది
అధికారంలోకి వచ్చాకా పార్టీ గెలుపు కోసం కష్టపడ్డవారిని కలవలేకపోతున్నామనే బాధ నాలో ఉంది. ప్రజా సమస్యలు తీర్చడంలోనే సమయం గడిచిపోతోంది. పార్టీ బలోపేతంపై దృష్టిపెడతాం. అలాగే మార్చి 14 పార్టీ ఆవిర్భావ సభ కోసం జనవరి 4వ తేదీ నుంచే పనులు మొదలుపెడుతున్నాం. ఏ జనం అయితే నాకోసం కష్టపడ్డారో వారందరినీ కలుస్తాను.
• జగన్ గుణం.. భయపెట్టడం
ప్రతి వ్యక్తిలో ఒక గుణం ఉంటుంది. ఎవరిని ఎలా భయపెట్టాలో జగన్ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. అధికారంలో లేకపోయినా అధికారులను ఎలా భయపెట్చొచ్చో నేర్చుకోవచ్చు. అది నెగిటివ్ అనుకోండి. చాలా మందిలో చాలా పాజిటివ్ అంశాలు ఉంటాయి. చేగువేరా నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే… మానవ హక్కులకు ఉల్లంఘన జరిగినప్పుడు మనం దేశం, మన ఖండం కాకపోయినా స్పందించాలి అనేది నేర్చుకున్నాను. మనిషికి అన్యాయం జరిగినపుడు సాటి మనిషిగా స్పందించాలనే గొప్ప నాయకుడి లక్షణం చేగువేరాది. మానవత్వం తాలుకా రాజకీయానికి ఆయనే ఆదర్శం.
• లౌకిక వాదం ముసుగులో…
దేశంలో సెక్యులరిజం అనేది కేవలం హిందువులకే వర్తిస్తుంది. హిందువు అనే వాడు తన మతాన్ని తాను పాటిస్తూ ఇరత మతాలను గౌరవిస్తున్నాడు. ఇతర మత గ్రంథాలను తన మత గ్రంథంతో సమానంగా గౌరవిస్తుంటే… హిందు మత గ్రంథాలకు ఆ గౌరవం దక్కడం లేదు. సెక్యులరిజం ముసుగులో చాలా మంది చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు. 15 నిమిషాలు పోలీసులు కళ్లు మూసుకుంటే హైదరాబాద్ లో హిందువులు ఉండరని కొందరు ప్రకటన చేస్తే ఒక్క కమ్యూనిస్టు లీడర్ కూడా దాని మీద మాట్లాడలేదు. అదే ఇతర మతాల వారి మనోభావాలను దెబ్బ తీస్తే మాత్రం వామపక్షవాదులు హిందువుల మీద పడిపోతారు.
దేశంలో సెక్యులరిజం అంటే అన్ని మతాలకు సమానంగా ఉండాలి. ఏ మతానికి, దాన్ని ఆచరించే వారి మనోభావాలకు ఇబ్బంది కలిగినా ఒక విధమైన స్పందన అందరిలో ఉండాలి. దేశంలో జనభా తక్కువ ఉన్నారని ఒక న్యాయం. ఎక్కువున్నారని మరో న్యాయం కాకుండా ఎవరి మనోభావాలకు, ఎవరి మత ఆచారాలకు భంగం కలిగినా ఒకే రకమైన స్పందన ఉండాలని నా భావన.
ప్రతిసారి సెక్యూలరిజం పేరుతో హిందువుల మనోభావాలను దెబ్బతిన్నా ఎందుకు మాట్లాడటం లేదు అనే ఆవేదనతోనే సనాతన ధర్మం గురించి, హిందువుల ఐక్యత గురించి మాట్లాడాను. నేను ఇప్పటికీ కూడా నా మతాన్ని ఆచరిస్తూ ఇతర మతాలను గౌరవించే సంస్కారం ఉన్నవాడినే. మత మార్పిడిల విషయంలో దాని మూలం వెతకాలి. ప్రజలు ఏ అంశం ఆధారంగా మతం మారుతున్నారో మూలాలు వెతికి పరిష్కారం దిశగా ప్రయత్నించాలి. అప్పుడే మత మార్పిళ్లు ఆగుతాయి. మతం తాలుకా మూల సిద్ధాంతం తెలుసుకుని ప్రజలు దానిని ఆచరించడానికి వెళుతున్నారా? లేదా అనేది కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన అవసరం.
• సంక్రాంతికి పనులు పూర్తవుతాయి
గ్రామ సభల్లో తీర్మానం చేసిన పనులు దాదాపు పూర్తవుతున్నాయి. రోడ్ల విషయానికి వస్తే 78 శాతం పూర్తయ్యాయి. సంక్రాంతికి దాదాపు పూర్తవుతాయి. జలజీవన్ మిషన్ నిధులు పెంచమని కేంద్రాన్ని అడిగాం. వాళ్లు సానుకూలంగా స్పందించారు.
• ఆరు నెలల్లో సంతృప్తిని ఇచ్చినవి ఏమిటంటే..
ఆరు నెలల అధికారంలో నాకు సంతృప్తినిచ్చిన విషయాలు చాలా ఉన్నాయి. మొదటి క్యాబినెట్ మీటింగ్ అయిపోయాక తిరిగి వస్తుండగా ఒక మహిళ- నా కుమార్తె కనిపించడం లేదని కన్నీరు పెట్టింది. పోలీసులకు చెప్పిన వారం రోజుల్లోనే ఆమె జాడ కనుగొన్నారు. అలాగే ఏజెన్సీ ఏరియాకు వెళ్లినప్పుడు, ఆ మట్టిలో నడిచినప్పుడు అధికారం చేతిలో ఉంది, వీళ్ల కోసం ఇంకా పనిచేయాలి అనిపించింది.
ప్రస్తుతం చేస్తున్న మూడు సినిమాలకు నేను ఇచ్చిన సమయానికి వారు పూర్తి చేయలేకపోయారు. సినిమాలకు సంబంధించి ప్రత్యేకంగా సమయం ఇచ్చాను. ఆ సమయం దాటి చేయలేను అని ముందే చెప్పాను. చెప్పిన సమయం కంటే ఎక్కువ రోజులే చేశాను. ఉస్తాద్ భగత్ సింగ్ కి చెప్పిన స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నారు. ఓజీకి సంబంధించి నా పాత్రలేని భాగం మొత్తం పూర్తి చేయమని చెప్పాను. హరి హర వీర మల్లు మరో ఏడు ఎనిమిది రోజుల షెడ్యూల్ ఉంది.