– ఓటమి భయంతోనే పథకాలు పోతాయని చర్యలు
– వైసీపీపై చర్యలు తీసుకోండి
– శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్, టీడీఎల్పీ ఇన్చార్జి కోనేరు సురేష్
ఓటమి భయంతోనే జగన్ రెడ్డి ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నాడని తెదేపా సీనియర్ నాయకులు ఎం.ఏ షరిఫ్ ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టిడిపి ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయన విలేఖరుల సమావేశం నిర్వహించారు. ‘ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన వాలంటీర్లు వైకాపా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ప్రజాధనాన్ని గౌరవ వేతనంగా ఇస్తే వాలంటీర్లను వైసీపీ కార్యకర్తల్లా వాడుకుంటారా?. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం వాలంటీర్లను వాడుకుని జగన్ రెడ్డి అనేక ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారు.
వైసీపీకి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా బెదిరిస్తున్నారు. ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలో కూడా వాలంటీర్ల ద్వారా జగన్ రెడ్డే చెబుతారా? వాలంటీర్లు ఎక్కడెక్కడ ఏఏ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారో రాష్ట్ర ఎన్నికల సంఘానికి అనేకమార్లు పిర్యాదు చేశాం. వైసీపీ స్థానిక నాయకులు వాలంటీర్లను భయపెట్టి పార్టీ కార్యకలాపాలు చేయించుకుంటున్నారు. ఉరవకొండలో వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి వాలంటీర్లు ప్రజలను తీసుకొచ్చి దాన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నించారు.
రాయదుర్గంలో కూడా ఇలానే వాలంటీర్లతో పార్టీ పనులు చేయించుకున్నారు. పాతపట్నంలో స్థానిక వైకాపా ఎమ్మెల్యే రెడ్డిశాంతి వాలంటీర్లకు రూ.10 వేలు విలువ చేసే బహుమతులను అందజేశారు. అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో ప్రజలకు నగదు పంపిణీ చేయాలని వాలంటీర్లకు హుకుం జారీ చేశారు. వాలంటీర్లతో పార్టీ పనులు చేయించుకుంటున్న వైకాపా నాయకులు తీరు చూస్తుంటే ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా ఖూనీ చేస్తున్నారో ప్రజలు అర్ధం చేసుకోవాలి. కాకినాడలో వంగా గీత వాలంటీర్లతో మాట్లాడుతూ..జగన్ రెడ్డి మీకు ఈ ఉద్యోగాలు ఇచ్చారు.. కాబట్టి ఆయన రుణం తీర్చుకోవాలని చెప్పారు.
అధికార పక్షం గానీ, ప్రతిపక్షం గానీ ప్రజలకు ఏం చేస్తామో చెప్పి వారితో ఓట్లు వేయించుకోవాలి. అంతేకానీ, ప్రజలను ప్రలోభాలకు గురి చేసి ఓట్లు అడగటం అప్రజాస్వామికం. వాలంటీర్లను ఎన్నికల కార్యకలాపాలకు ఉపయోగించరాదని ఎన్నికల సంఘం ఆదేశించినప్పటికీ వైసీపీ వారు వాలంటీర్లతో పార్టీ కార్యకలాపాలు చేయించుకుంటున్నారు. 40 రోజుల్లో వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోబోతోంది. వాలంటీర్ చెబుతున్నట్లు సంక్షేమ పథకాలు రద్దవుతాయని ప్రజలు బయపడాల్సిన అవసరం లేదు. అరాచక, అప్రజాస్వామిక, నియంత ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించడానికి టిడిపి-జనసేన పార్టీలతో కలిసి రావాలని.. వైకాపా నాయకులు, వాలంటీర్లు పెట్టే ప్రలోభాలాకు గురికావద్దని ప్రజలను కోరుతున్నాం.
వైకాపా నాయకులు ఎన్నికల సంఘానికి సవాల్ విసురుతున్నారు
– టి.డి.ఎల్.పి ఇంఛార్జ్ కోనేరు సురేష్
వైసీపీ పార్టీ కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించుకుని వారితో పార్టీ పనులు చేయించుకోవడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. తిరుపతి, ఆత్మకూరు నియోజకవర్గాలకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో వాలంటీర్లు ఓటర్ల లిస్టులను పరిశీలించడం, ఓటర్లను తీసుకెళ్లి ఓటేయించడం లాంటివి చేశారు. నాడు ఎన్నికల విధుల్లో పాల్గొన్న వాలంటీర్లపై, వారికి సహకరించిన ఎన్నికల అధికారులపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుని ఉంటే నేడు ఈ పరిస్థితి దాపురించేది కాదు. ఎన్నికల సఘం ఉదాసీన వైఖరి కారణంగానే నేడు ఈ దుస్థితికి కారణం.
చంద్రగిరిలోని గ్రామ సచివాలయాల్లో గిప్టులు భధ్రపరిచి అక్కడ నుంచి ప్రజలకు పంచారు. ధర్మాన ప్రసాదరావు లాంటి వైకాపా మంత్రులు వాలంటీర్లు వైసీపీకి పనిచేయాలని బహిరంగంగా చెబుతుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోంది. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ప్రజాప్రతినిధులు రాజ్యాంగ సంస్థయైన ఎన్నికల సంఘానికి ఛాలెంజ్ విసురుతున్నారు. వీరిపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలోని మొత్తం 2.45 వేల మంది వాలంటీర్లకు ఒక్కొక్కరికీ రూ.10 వేల విలువ చేసే గిప్టులు ఇస్తున్నారంటే ప్రజాధనం దోపిడీ చేయడం కాదా?
ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటున్న వాలంటీర్లు నిష్పక్షపాతంగా ఉండాలని టిడిపి అధినేత చంద్రబాబు వాలంటీర్లను కోరారు. వైసీపీ పక్షంగా వ్యవహరించి జగన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తే..రాబోయే ప్రభుత్వంలో వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం.