– టీచర్లను వేధిస్తే రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తా
– ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ నిధుల మళ్లింపు పై సెబీ కి లేఖ రాస్తా
– ఎన్నో సంక్షేమ పథకాలను ఎత్తివేసిన జగన్మోహన్ రెడ్డి సర్కార్
– నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు
భవిష్యత్తును తాకట్టు పెట్టి, ఆరోగ్యాన్ని పణంగా పెట్టి తాను సంక్షేమ కార్యక్రమాల్ని చేపడుతుంటే ఆ దుష్ట చతుష్టయం, ఆ దత్త పుత్రుడు కుట్రలు చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాపోతున్నారని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు. తమకేమైనా అయితే తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ నిలిచిపోతాయని ప్రజలను భయాందోళనలకు గురి చేసే ప్రయత్నాన్ని చేస్తున్నారని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం సహకారం అందించే పథకాలతో పాటు, ఎస్సీ ఎస్టీ ల అభివృద్ధి కోసం అమలు చేసిన పథకాలను, అలాగే గతంలో అమలులో ఉన్న దాదాపు 20 నుంచి 25 సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎత్తివేసిందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న ఏకైక పథకం అమ్మఒడి మాత్రమేనని అన్నారు. అయితే, ఇప్పుడు గ్రామాలలో పాఠశాలలే లేకుండా లాగేసుకుంటున్నారని విరుచుకు పడ్డారు.
రాష్ట్రంలో 11 నుంచి, 12 వేల పాఠశాలలను హైస్కూల్ లో విలీనం చేసి మూసివేశారన్నారు. శనివారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ…. లక్ష 50 వేల కోట్ల రూపాయలు డి బి టి (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్) ద్వారా లబ్ధిదారులకు అందజేశామని విశ్వసనీయతకు మారుపేరైన, మాట తప్పని, మడమ తిప్పని వై ఎస్ జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారని, ఇందులో 54 వేల కోట్ల రూపాయల పింఛన్లను డిబిటి ద్వారా కాకుండా నగదు రూపంలో ఎందుకు లబ్ధిదారులకు అందజేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. వాలంటీర్లుగా పిలవబడే తమ పార్టీ కార్యకర్తల ద్వారా నెల ,నెలకు 2500 రూపాయలను లబ్ధిదారులకు అందజేస్తూ, ఓట్లు కొనుగోలు చేయడం కాకపోతే, మరేమిటని నిలదీశారు.
హైస్కూల్లో, ప్రాథమిక పాఠశాలల విలీనం పేరిట… పాఠశాలలను లాగేసుకుంటున్న ప్రభుత్వ పెద్దలు, ఉపాధ్యాయులను పారిశుద్ధ్య కార్మికులు గా చూస్తున్నారని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. గురువు దేవుడితో సమానమని ఆ గురువునే గౌరవించలేని వారు ఇంకా ఏమి చేయగలరని ప్రశ్నించారు.
అమ్మ ఒడి పథకంలో భాగంగా పాఠశాల బాత్రూంల శుభ్రత కోసమని డబ్బులను కట్ చేస్తున్నారని, ఆ డబ్బులను వెచ్చించి ఒక వ్యక్తిని నియమించవచ్చు కదా అని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. వారి ద్వారా పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
టీచర్లను ఇలాగే వేధిస్తూ, విద్యార్థులకు అన్యాయం చేస్తే ఈ విషయాన్ని తాను రాష్ట్రపతి దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం గ్రాఫ్ పడిపోతుందని ఇప్పటికిప్పుడు ఎన్నికలంటూ జరిగితే 40 నుంచి 44 సీట్లకు మించి రావన్నారు. గురువుల పట్ల అభినయిస్తున్న ప్రేమను వాస్తవంలో చూపించాలని హితవు పలికారు. ప్రభుత్వ చర్యల వల్ల పార్టీ నష్టపోకుండా తాను సలహాలు ఇస్తూనే ఉంటానని, ఎవరు చూస్తారులే అనుకోవద్దని… లక్షల్లో వ్యూస్ వస్తున్నాయని తెలిపారు.
రాజ్యాంగ ఉల్లంఘనలపై చర్చకు సిద్ధం… ఎవరు వస్తారో రండి
రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతూ, కార్పొరేషన్ల పేరిట చేసిన అప్పులపై చర్చకు తాను సిద్ధమని, ఆర్థిక మంత్రి బుగ్గన వస్తారా?, కృష్ణ వస్తారా??, రమ్మనండి… ఎవరు వచ్చినా చర్చకు తాను సిద్ధమని రఘురామ కృష్ణంరాజు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యంపై వచ్చే ఆదాయాన్ని చూపెడుతూ, ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరిట రుణాలను పొందే ప్రయత్నం చేసిందన్నారు. ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు అప్పులు ఇవ్వవద్దని తాను రాసిన లేఖ ద్వారా 1800 కోట్ల రుణం ఆగిపోయిందన్నారు. ఓ దిక్కుమాలిన సంస్థ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు ఇండియా రేటింగ్స్ ఇప్పించి, అదే కంపెనీ ద్వారా ఎన్సీడీలు, డి బెంచర్స్ రేటింగ్ తీసుకొని ఏపీ బేవరేజర్స్ కార్పొరేషన్ పేరిట 8 వేల కోట్ల రూపాయలు రుణాన్ని ఎత్తారన్నారు. తాను ఇదే విషయమై హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశానని గుర్తు చేశారు. అయితే తాను దాఖలు చేసిన పిటిషన్, పబ్లిక్ ఇంట్రెస్ట్ కు వ్యతిరేకంగా ఉన్నదని తీర్పులో చెప్పారన్నారు. అంతేకానీ జడ్జిమెంట్ లో ఎక్కడ కూడా రాజ్యాంగ ఉల్లంఘనలపై స్పందించలేదని పేర్కొన్నారు. హైకోర్టు రాజ్యాంగ ప్రొవిజన్ పై స్పందించ లేదని గుర్తు చేశారు. అయితే సాక్షి దినపత్రిక మాత్రం అడ్డగోలు కథనాలు రాసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ పన్నులు వేసిన ఆ ఆదాయం ట్రెజరీకే చేరాలని చట్టంలో స్పష్టం గా పేర్కొనడం జరిగిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. రాజ్యాంగంలోని 293 (3) అధికరణ ప్రకారం కార్పొరేషన్ల పేరిట ఎటువంటి అప్పులను చేయవద్దని పేర్కొనడం జరిగిందన్నారు. కార్పొరేషన్ల పేరిట అప్పులు చేయడం రాజ్యాంగ అతిక్రమణ అవునా?, కాదా? అంటూ ప్రశ్నించిన రఘురామకృష్ణం రాజు, ఈ మేరకు ఆర్బిఐ కూడా తన ఉత్తర్వులలో, ఇది రాజ్యాంగ ఉల్లంఘనేనని స్పష్టం చేసిందన్నారు.
రాజ్యాంగానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు వస్తుందని తాను అనుకోవడం లేదని, రాజ్యాంగం ప్రకారమే కోర్టు లు ఏర్పడడం జరిగిందన్నారు. రాజ్యాంగంలోని అధికరణను కాదనరనే అనుకుంటున్నానని, ఆ భావంతోనే కోర్టుకు వెళ్తానని చెప్పారు. కార్పొరేషన్ల పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు మరో 10 నుంచి 15 ఏళ్లు తీర్చే విధంగా, రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెడుతూ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని తెలిపారు.. అలాగే 870 బార్లకు 2025 వ సంవత్సరం జూన్, జూలై మాసాల వరకు అనుమతులను మంజూరు చేస్తున్నారన్నారు.. రానున్న ప్రభుత్వం కూడా ఏమీ చేయలేకుండా ఈ నిబంధనలను పొందుపరుస్తున్నారన్న ఆయన, ప్రభుత్వము అనేది నిరంతర ప్రక్రియ అని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ఎత్తిచూపుతూ, ఆర్బిఐ జారీ చేసిన ఉత్తర్వులను, కార్పొరేషన్ల పేరిట రుణాలను మంజూరు చేసిన బ్యాంక్, ముఖ్యమంత్రిపై సమగ్ర విచారణను కోరుతానని తెలిపారు. సిబిఐ విచారణ కోరుదామంటే ఆ సంస్థ, ముఖ్యమంత్రి లండన్ వెళ్తానంటే, వెళ్లమంటుందని, పారిస్ వెళ్తానంటే అనుమతిని ఇస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ మోసంపై ఎస్ ఎఫ్ ఐ ఓ లేదా ఇతర సంస్థల విచారణను కోరనున్నట్లు తెలిపారు.
కార్పొరేషన్ల పేరిట రుణాల మంజూరులో కీలక పాత్ర పోషించిన ఆనాటి ఎస్బిఐ చైర్మన్ కు క్విడ్ ప్రోకో లో భాగంగా ఉద్యోగం ఇచ్చారని, పంజాబ్ నేషనల్ బ్యాంక్ చైర్మన్ ముఖ్యమంత్రి కలిశారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఎవర్ని ఎలా మేనేజ్ చేస్తున్నారో తెలియదు కానీ రుణాలను మాత్రం పొందుతున్నారని చెప్పారు.
జిపిఎఫ్ నిధుల మళ్లింపు పై చివాట్లు పెట్టిన కోర్టు
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (జి పి ఎఫ్) నిధుల మళ్లింపు పై రాష్ట్ర ప్రభుత్వానికి , హైకోర్టు చివాట్లు పెట్టిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. జిపిఎఫ్ నిధులు బటన్ నొక్కుడులో భాగంగా దారి మళ్ళినట్లుగా కోర్టుకు కహానీలు వినిపించబోయారని, కానీ కోర్టు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చివాట్లను పెట్టి, 800 కోట్ల రూపాయలు తక్షణమే జమ చేయాలని ఆదేశించిందన్నారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ నిధుల మళ్లింపు పై సెబీ కి ఒక లేఖ రాస్తానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
అలాగే కార్పొరేషన్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం రుణంగా పొందిన ఎనిమిది వేల కోట్ల రూపాయలు కూడా ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ కు సంబంధించినవేనని, వాటిని కూడా వెనక్కి ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఇక, ఏకచిత్ర నటుడు ఒకరు మంత్రిని పక్కనే కూర్చోబెట్టుకొని, అవాకులు, చెవాకులు పేలారని అతడి నుంచి అంతకంటే ఎక్కువ ఏమి ఆశించగలమని అపహాస్యం చేశారు. ఎంపీగా చేయాలంటే అలాగా…ఇలాగా అంటూ ఏవో కబుర్లు చెప్పబోయారని ఏద్దేవా చేశారు.
హైకోర్టును మార్చే అధికారం ప్రభుత్వానికి లేదు
రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కర్నూలుకు మార్చమని ప్రతిపాదించిన విషయంపై పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులు లేవనెత్తిన అంశంపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఇచ్చిన సమాధానం కొంత స్పష్టంగా, మరికొంత అస్పష్టంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన, మూడు రాజధానుల బిల్లు పిటీషన్ ను ఇప్పటికే హైకోర్టు కొట్టి వేసిందని గుర్తు చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి, రాష్ట్రపతి ఆమోదించిన తరువాతే, అమరావతిలో హైకోర్టు ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు గుర్తు చేశారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో బెంచ్ ఏర్పాటు చేసుకునే అధికారం
రాష్ట్ర ప్రభుత్వానికి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయానికి ఉన్నదని చెప్పారు. అంతేకానీ హైకోర్టును మార్చే అధికారం లేదని గుర్తు చేశారు. అవసరమైతే, కర్నూలులో, విశాఖలోనూ బెంచ్ ఏర్పాటు చేసుకోవచ్చునని అన్నారు.