– ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర
మంగళగిరి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మొంథా తుపాను నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకోవడం, అధికార యంత్రాంగాన్ని సకాలంలో అప్రమత్తం చేయడం వలనే ప్రాణ నష్టాన్ని తగ్గించగలిమని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యంగా గుడిసెల్లో నివసించే వారిని వెంటనే గుర్తించి, పునరావాస శిబిరాలకు తరలించి వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించినట్టు తెలిపారు.
మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం సీనియర్ ఐఏఎస్ అధికారులను పర్యవేక్షణకు నియమించడం ముఖ్యమంత్రి నిరంతరం సమీక్షలు నిర్వహించడం వల్ల అధికార యంత్రాంగం వెంటనే స్పందించిందని పేర్కొన్నారు. నెల్లూరులోని సంగం బ్యారేజీ వద్ద బోటు ఇరుక్కుపోవడం వంటి సంఘటనలను కూడా అధికారులు తక్షణమే పరిష్కరించారని, ఎన్డీఆర్ఎఫ్ సహకారంతో వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగామని వివరించారు. ఈ విజయం అంతా ప్రభుత్వ అప్రమత్తత, నిరంతర పర్యవేక్షణ వల్లే సాధ్యమైందని స్పష్టం చేశారు.
ఇటువంటి ఆపద సమయంలో ప్రభుత్వానికి ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చాలా బాధ కలిగిస్తున్నాయని విమర్శించారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో తుపానులు వచ్చినా, వేలాది ఎకరాల పంట నష్టం జరిగినా ఆయన ఎప్పుడూ పంట చేనులో కాలు పెట్టని వ్యక్తి అని ఆక్షేపించారు. ప్రస్తుతం బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని సమీక్షలు జరిపి తుపాను రావడం ప్రభుత్వ వైఫల్యం వల్లేనని చెప్పడం ఆయన కనీస ఆలోచనా రహితాన్ని చూపుతుందని అన్నారు.
తుపానులు ఎవరికీ చెప్పి రావని, వాటిని ఆపడం ప్రభుత్వాల వల్ల లేదా మనుషుల వల్ల సాధ్యం కాదని గుర్తు చేశారు. కాకపోతే తుపాను వల్ల జరిగే ప్రాణ నష్టాన్ని ఆపడం, ప్రజలను అప్రమత్తం చేసి పునరావాసం కల్పించడం వంటివి మాత్రమే ప్రభుత్వాలు చేయగలవని తెలిపారు. జగన్ కేవలం రాజకీయ కోణంలోనే మాట్లాడుతున్నారని, ప్రభుత్వంపై నిరంతరం బురద జల్లి రాజకీయ ప్రయోజనం పొందాలనే ఆలోచన తప్ప, ప్రజల కష్టాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన లేదని విమర్శించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించి రైతులతో మాట్లాడి వారికి మనోదైర్యాన్ని ఇవ్వడం గతంలోనూ చూశామని తెలిపారు. గతంలో పంట నష్టం జరిగితే వారం రోజుల్లోనే పరిహారం రైతుల అకౌంట్లలో జమ చేశామని ఈసారి కూడా పంట నష్టం వివరాలు సేకరించి త్వరలోనే నష్టపరిహారం చెల్లించడానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చామని వివరించారు. ముందస్తుగా క్యాంపులకు తరలించిన వారికి తక్షణ సాయంగా రూ. 3,000, నిత్యావసర వస్తువులు ఇచ్చామని తెలిపారు.
జగన్ హయాంలో పంట నష్టం జరిగినా కొన్న ధాన్యానికి కూడా నెలల తరబడి డబ్బులు ఇవ్వలేదని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ. 1,100 కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం రైతాంగం కోసం పనిచేసే ప్రభుత్వమని, ఇన్సూరెన్స్ కట్టినా కట్టకపోయినా నష్టపోయిన ప్రతి ఎకరాకు పరిహారం ఇస్తామని, నష్టపోయిన పంటను కొంటామని హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డికి విధ్వంసం చేయడం అలవాటు అయిపోయి.. విధ్వంసం జరిగితే ఆనందించాలనే మనస్తత్వం కనిపిస్తోంది. ఐదేళ్లలో చేసిందంతా విధ్వంస పాలనే కానీ ఈ ప్రభుత్వం ప్రజల కష్టాలను తెలుసుకొని వారికి మనోధైర్యాన్ని ఇచ్చి వారిని ఆదుకుంటుందని స్పష్టం చేశారు