Suryaa.co.in

Andhra Pradesh

అధికారం పోయిందని అమరావతిపై జగన్ విషం కక్కుతున్నాడు

  • అమరావతి గురించి మాట్లాడే హక్కు జగన్ కు లేదు
  • రాష్ట్ర ప్రజల భవిష్యత్తు నాశనం కావాలని జగన్ చూస్తున్నాడు
  • వైసీపీ నేతలు సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నారు
  • మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

అమరావతి: జగన్మోహన్ రెడ్డి అధికారం కోలపోవడంతో ఏపీ రాజధాని అమరావతిపై విషం కక్కుతున్నాడని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశంపార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడుతూ….రాష్ట్ర రాజధాని అమరావతి అత్యంత సురక్షితమైన ప్రదేశం. కృష్ణానదికి ఆనుకుని ఉన్న అమరావతి కృష్ణా నదికి రికార్డుస్థాయిలో 11.43లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా చెక్కు చెదరలేదు, చుక్క నీరు నిలవలేదు. అమరావతిలో వర్షం వల్ల వచ్చిన నీరు తప్ప, ఎలాంటి వరద అమరావతిని టచ్ చేయలేకపోయింది. చంద్రబాబు పాలనలో అమరావతికి పెట్టుబడులు భారీగా వస్తుండడంతో, వాటిని ఆపేందుకు జగన్ కుట్రపూరిత చర్యలకు దిగుతున్నాడు. ఇది చాలా సిగ్గు చేటు. జగన్ వైఖరిని ఖండిస్తున్నాను.

ఏపీకి పెట్టుబడులు వస్తే జగన్‌కు కడుపుమంట

చంద్రబాబుపాలనలో ఏపీ రాజధాని అమరావతికి పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. దీన్ని చూసి జగన్మోహన్ రెడ్డికి కడుపు మంట మొదలైంది. తన పాలనలో ఏపీకి ఒక్క పెట్టుబడి కూడా రాలేదు. జగన్ అధికారంలో ఉండగా అమరావతి నుండే పరిపాలన చేసి, నేడు దాన్ని కూల్చాలని చూస్తున్నాడు. చంద్రబాబు విజనరీ పాలనను చూసి నేడు అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆస్ట్రేలియా, యూఏఈ ఆసక్తి చూపిస్తోంది. రూ.250 కోట్లతో XLRI (Xavier School of Management) సంస్థ ఏర్పాటు కానుంది.

SRM యూనివర్సిటీలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయబోతున్నారు. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు బీసీఐ ( బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ) ప్రతినిధులు సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. రూ.300 కోట్లతో HPCL, NTPC, ONGC, Indian Bank, SBI వంటి ప్రఖ్యాత సంస్థలు తమ కార్యకలాపాలను ఇక్కడ నుంచే మొదలుపెట్టేందుకు ముందుకు వచ్చాయి. AI Hub రూ.150 కోట్లుతో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో తెలుగువాడిగా పుట్టిన ప్రతివాడు ఏపీ ప్రజల భవిష్యత్తు బాగుపడుతుందని సంతోషించాలి. కానీ జగన్ బాధపడుతున్నాడు, రాజధానిపై విషం కక్కుతున్నాడు.

మహానగరాలే ప్రకృతి విపత్తుల వస్తే మునిగిపోయాయి

సముద్ర మట్టానికి అమరావతి 35మీటర్ల ఎత్తులో ఉంది. హైదరాబాద్ సముద్ర మట్టానికి 536మీటర్ల ఎత్తులో ఉంది. హైదరాబాద్ లో చెప్పుకోదగిన నదులు లేవు, మంచి డ్రైనేజీ వ్యవస్థ ఉంది. కానీ భారీ వర్షాలు వస్తే హైదరాబాద్ మునిగిపోతుంది. చెన్నై సముద్ర మట్టానికి 7 మీటర్ల ఎత్తులో ఉంది. చెన్నైలో మంచి డ్రైనేజీ వ్యవస్థ ఉంది, కానీ భారీ వర్షాలు వస్తే చెన్నై మొత్తం జలదిగ్బంధంగా మారుతుంది.

2015లో చెన్నైలో వరదలు వస్తే 40లక్షల మంది ఇబ్బందులు పడ్డారు, 250మంది చనిపోయారు. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి పెద్ద పెద్ద నగరాలు వరదల సమయంలో అతలాకుతలం అయిన ఘటనలు మనం గతంలో చాలా చూశాం. కానీ నేడు అమరావతి ఎంత వరద, ఎంత వర్షం వచ్చినా సేఫ్ గా ఉంది. కర్నూలు సముద్ర మట్టానికి 274మీటర్ల ఎత్తులో ఉంటుంది. తుంగభద్ర నుండి చిన్న వరద 2009లో వస్తే కర్నూలు కకావికలం అయ్యింది. రాజధాని ప్రాంతంలో హైకోర్టు, సచివాలయం వంటి వాటిలో కార్యకలాపాలు అన్నీ యథావిధిగా జరిగాయి. చంద్రబాబు విజన్ కు అమరావతి ఒక నిదర్శనం.

అమరావతి నాశనమే జగన్ పంతం

ఏపీ రాజధాని అమరావతిని నాశనం చేయడమే జగన్ పంతంగా పెట్టుకున్నాడు. కృష్ణానదికి గతంలో ఎన్నడూ రాని విధంగా వరద వస్తే దాన్ని కారణంగా చూపించి, రాజధానిని నాశనం చేయాలని చూడడం జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర విధానాలకే నిదర్శనం. అమరావతిని ఆధునిక నగరంగా తీర్చిదిద్దాలనే చంద్రబాబు ఆలోచనలు ఫలించాలని కోరుకోవాలి కాని, నాశనం కావాలని కోరుకోవడం ఏంటి జగన్? అమరావతి గురించి నోరెత్తే నైతిక హక్కు నీకు ఉందా జగన్? నువ్వు అధికారంలో ఉండగా ఎక్కడి నుండి పరిపాలన చేశావ్? విశాఖ నుండి చేశావా? అమరావతి నుండి చేశావా?

ఐదేళ్లు ఇరిగేషన్ శాఖను పడుకోబెట్టిన అసమర్ధుడు జగన్

జగన్మోహన్ రెడ్డికి నీటిపారుదలశాఖ(ఇరిగేషన్)పై కనీస అవగాహన లేదు. టీఎంసీ, క్యూసెక్కులకు తేడా తెలియని అసమర్ధుడు జగన్. ముఖ్యమంత్రిగా జగన్ తన అసమర్ధ ఐదేళ్ల పాలనలో నీటిపారుదలశాఖను పడుకోబెట్టాడు. కనీసం కాలువల్లో పూడిక తీసిన పరిస్థితులు కూడా లేవు. 10వేల క్యూసెక్కుల కెపాసిటీ కలిగిన ఏలేరు రిజర్వాయర్ కు రూ.292కోట్లతో 70వేల క్యూసెక్కులు పోయేందుకు చంద్రబాబు వర్క్ ఆర్డర్లు ఇస్తే, ఆ పనులను జగన్మోహన్ రెడ్డి ముందుకు తీసుకెళ్లలేదు. కానీ జగన్ ఏలేరు ముంపు ప్రాంతానికి వెళ్లి ఏలేరు ఆధునీకరణ పనులు 30వేల క్యూసెక్కులకే గతంలో చేపట్టారని మాట్లాడి తన అసమర్ధతను నిరూపించాడు. నీటిపారుదలశాఖపై కనీస అవగాహన లేని జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లు రాష్ట్రాన్ని ముంచాడు. జగన్ పాలనలో నీటిపారుదలశాఖ మంత్రి రోడ్లపై డ్యాన్సులు వేయడం తప్ప చేసిందేమీ లేదు.

కాకాణి పాపాల చిట్టాను ప్రభుత్వం త్వరగా విప్పాలి

మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పాపాల చిట్టాను రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు త్వరగా విప్పాలని కోరుతున్నాను. గత ఐదేళ్లలో కాకాణి గోవర్ధన్ రెడ్డి జిల్లాను అడ్డగోలుగా దోచుకున్నాడు. వాటిని నిలదీశానని నాపైకి హిజ్రాలను పంపిన ఓ కోర్టు దొంగ కాకాణి. గత ఐదేళ్లలో కాకాణి గోవర్ధన్ రెడ్డి 68ఎకరాల్లో వరదాపురం మైన్ దోచుకున్నాడు.

అంతేగాకుండా 14 హిటాచీలు, 30డంపర్లు, బ్లాస్టింగ్ ట్రక్కులను నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను. గూడూరు నియోజకవర్గంలో సిలికా, వెంకటగిరి నియోజకవర్గంలో క్వార్ట్జ్ మైనింగ్‌ను కాకాణి దోచుకుని వేల కోట్లు అడ్డగోలుగా సంపాదించాడు. ఇలాంటి వ్యక్తి చంద్రబాబు గురించి తప్పుడు కూతలు కూస్తున్నాడు. చంద్రబాబు గురించి మాట్లాడే ముందు కాకాణి ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని హెచ్చరిస్తున్నాను.

రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేని వైసీపీ నాయకులు చంద్రబాబు గురించి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ నేతలు నీతిమాలిన రాజకీయాలకు పాల్పడుతున్నారు. మేం ప్రతిపక్షంలో ఉండగా గతంలో ఎన్నడూ ఇలా చేయలేదు అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.

LEAVE A RESPONSE