Suryaa.co.in

Andhra Pradesh

ప్రజాదర్భార్ లో కలిసిన వారి యోగక్షేమాలు తెలుసుకున్న జగన్‌

– వైఎస్సార్సీపీ శ్రేణులకు జగన్‌ భరోసా

పులివెందుల: భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌… కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ నేనున్నాను అంటూ భరోసాతో పాటు ధైర్యాన్ని కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకుని, వారి సమస్యలు ఓపిగ్గా విని, వారికి భరోసా కల్పించారు.

కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని, అరాచక పాలన సాగిస్తోందని, అకారణంగా దాడులు చేస్తున్నారని పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు వైయస్‌‌ జగన్‌ వద్ద వాపోయారు. దీనికి ఆయన స్పందిస్తూ.. ఎవరూ అధైర్యపడొద్దని, మంచి రోజులు వస్తాయని, సమస్యలు శాశ్వతం కాదంటూ భరోసా కల్పించారు. త్వరలోనే మన ప్రభుత్వం మళ్లీ వస్తుందని, అప్పుడు అందరికీ మంచి జరుగుతుందని చెప్పారు.

టీడీపీ అరాచకాలను పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన సూచించారు. కష్టాలు ఎల్లకాలం ఉండవని, ప్రతి ఒక్కరూ పోరాట పంథాను ఎంచుకుని ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఇటీవల హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతున్న కూటమి నేతల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పులివెందులలోని క్యాంపు కార్యాలయం కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజలతో కిక్కిరిసిపోయింది. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలబడాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులకు వైయస్‌ జగన్‌ సూచించారు.వివిధ

సమస్యలతో బాధపడుతున్న పలువురు వైయస్‌ జగన్‌ వద్ద వారి సమస్యలు విన్నవించుకున్నారు. వారి సమస్యలను ఆలకించిన ఆయన వారికి అన్నలా అండగా ఉంటానని ధైర్యాన్నిచ్చారు. స్వయంగా పరిష్కరించగల వాటికి తక్షణమే స్పందించారు. వారి సమస్య పరిష్కారానికి ఏమి చెయ్యాలో పక్కనే ఉన్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి సూచించారు.

ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి మేలు ఒకటి కూడా జరగలేదని వచ్చిన వారంతా తమ గోడు వెళ్ళబోసుకున్నారు. అన్ని వర్గాలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చిన వైయస్‌ జగన్, వారి పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ప్రజల నడ్డి విరుస్తున్న విద్యుత్‌ ఛార్జీలపై ప్రజల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తుందని, రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చిందని ఆయన అన్నారు.

LEAVE A RESPONSE