Suryaa.co.in

Andhra Pradesh

బాబు హయాంలోని ఐదేళ్ల అప్పును జగన్ ఏడాదిలోనే చేశారు

-దళితులంటే అంత చులకనా?
-ఫిర్యాదులు చేస్తే చంపేస్తారా?
-నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఐదేళ్లలో చేసిన అప్పులను, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఏడాది కాలంలోనే చేశారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు తెలిపారు. పైగా చంద్రబాబు నాయుడు కంటే తామే తక్కువ అప్పులను చేశామని జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ సభ్యులు, వైకాపా నాయకులు చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు.

గురువారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారని, ఆయన చేసిన అప్పుల గురించి ప్రశ్నిస్తే తప్పా? అంటూ నిలదీశారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ సినిమాలోని ఒక పాటను రఘురామకృష్ణం రాజు ఆలపిస్తూ, ఒప్పులకుప్ప… అప్పులకుప్పకు మంచిగా మ్యాచ్ అయిందని అపహస్యం చేశారు. రేపో, మాపో అధికారంలో నుంచి దిగిపోయే వారికి ఆగడాలు ఎక్కువ అంటూ విమర్శించారు.

నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి, పక్కనే కూర్చున్న విద్యాధికుడైన మంత్రి ఆదిమూలపు సురేష్ ను లేపి పక్కకు తోసేసారని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు . ప్రస్తుతం జిల్లా మంత్రిగా ఉన్న ఆయన్ని, రానున్న ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీ చేసేందుకు ఇతర జిల్లాకు బదిలీ చేశారు. పక్కనే కూర్చున్న జిల్లా మంత్రిని తోసేసిన , జగన్మోహన్ రెడ్డి తన పిన్ని భర్త అయిన వై వి సుబ్బారెడ్డిని పక్కన తెచ్చి కూర్చోబెట్టుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆదిమూలపు సురేష్ కింద కూర్చుని ఉంటే, కింద కూర్చున్నావా అని అడిగి మరి ఆయన్ని పైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు నటించాల్సింది పోయి… పక్కనే కూర్చున్న వ్యక్తి పట్ల మనసులో ఎప్పటినుంచో గూడు కట్టుకొని ఉన్న ద్వేష భావాన్ని ప్రదర్శించడం ఎంతవరకు సమంజసం?

మనుషులంతా ఒక్కటేనని భావనలో ఉన్న ప్రస్తుత తరుణంలో ఒక దళిత మంత్రిని తీవ్రంగా అవమానిస్తే, పార్టీలోని దళిత నేతలు నోరెత్తే సాహసం చేయకపోవడం విడ్డూరం. దళితుల పట్ల నాకెంతో గౌరవం ఉంది. నేను నిజమే చెబుతాను. కానీ జగన్మోహన్ రెడ్డి అబద్ధం చెబుతారని రఘురామకృష్ణం రాజు అన్నారు. మా అబ్బ తన చెల్లెళ్లను ఎస్సీలకు ఇచ్చారని తరచూ పేర్కొనే జగన్ మోహన్ రెడ్డి, ఒక దళిత నాయకుడిని అవమానించడం ఎంతవరకు సమంజసం. సమాజం, రాజ్యాంగం పట్ల అవగాహన ఉన్న ఎవరు ఇటువంటి సంఘటనలను హర్షించరు. దళిత మంత్రిని కుర్చీలో నుంచి లేపి, తనని కూర్చోబెడుతుంటే వారించాల్సిన వై వి సుబ్బారెడ్డి, తాపీగా కూర్చోవడం దురదృష్టకరం.

ఎన్నికల ముందు ఎన్నో డ్రామాలు ఆడేవారు. అంగవైకల్యంతో బాధపడుతున్న వారిని జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర రూట్లో కూర్చోబెట్టి, ఆయన కలుసుకునే విధంగా ఏర్పాటు చేసేవారు. అలాగే అంబులెన్స్ లో రోగి ఎవరు లేకపోయినా, మానవతా దృక్పథంతో అంబులెన్స్ కు దారి ఇచ్చినట్లుగా నాటకాన్ని రక్తి కట్టించేవారు.అపరిచితుడు సినిమాలో రామాచారి, అపరిచితుడు పాత్రల్లా జగన్మోహన్ రెడ్డిలో కూడా రెండు పార్శ్వాలు ఉన్నాయన్నారు. మరో రెండు నెలల పాటు జగన్ మోహన్ రెడ్డి, రామాచారి పాత్రలోనే ఉంటే మంచిదని, నాలుగు ఓట్లైనా వస్తాయన్నారు. దళితుల పట్ల సంయమనముతో వ్యవహరిస్తూ, భూస్వామ్య సామాజిక వర్గాల వారు మర్యాదగా నడుచుకుంటున్నట్లు నటించండంటూ ఎద్దేవా చేశారు.

అబద్దాలకోరు ఎవరో తెలుసుకొమ్మని ఆ భగవంతుడే చెప్పినట్లుగా ఉంది
అబద్దాలకోరు ఎవరో తెలుసుకొమ్మని ఆ భగవంతుడే చెప్పారని, అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ను ఉద్దేశించి రఘురామకృష్ణం రాజు అన్నారు. రాజ్యాంగబద్ధమైన మీ పదవిని చూసి నేనేమి భయపడడం లేదని, రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగడం అంటే కోర్టులో అబద్ధాలు చెప్పమని లైసెన్స్ ఇచ్చినట్లు కాదన్నారు. గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులపై న్యాయస్థానంలో నేను ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్ ) దాఖలు చేశాను. పిల్ లో నేనొక వైకాపా ఎంపీ నని పేర్కొనడం జరిగింది.

దానికి నేను అబద్ధం చెప్పినట్లుగా న్యాయస్థానంలో అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ పేర్కొన్నారు. నేను అప్పడు వైకాపాలోనే ఉన్నాను. ఇటీవలే బహుశా వారం రోజుల క్రితం ఆ పార్టీకి రాజీనామా చేసి ఉంటాను. వైకాపాలో కొనసాగుతూ ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన నేను, వైకాపా ఎంపీనని పేర్కొంటే అబద్ధం చెప్పినట్లు ఎలా అవుతుందో అడ్వకేట్ జనరల్ కే తెలియాలి. వైకాపా నాయకత్వం నాపై డిస్ క్వాలిఫికేషన్ పిటిషన్ దాఖలు చేసిందని, ఆ విషయాన్ని పిల్ లో పేర్కొనలేదనడం విచిత్రంగా ఉంది. వైకాపా నాయకత్వం డిస్ క్వాలిఫికేషన్ పిటిషన్ దాఖలు చేస్తే, లోక్ సభ సచివాలయం వారు దాన్ని ఎత్తిపడేశారు.

వందమంది వంద రకాల పిటిషన్లు దాఖలు చేస్తుంటారని, అందరి పిటిషన్ల గురించి నేను మెన్షన్ చేయలేను కదా అంటూ రఘురామ కృష్ణంరాజు ఎదురు ప్రశ్నించారు. అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టును తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించడం ద్వారా పెడ్ జ్యూరీ కి పాల్పడ్డారని ఆయన తెలిపారు. నేను గతంలో పార్లమెంటరీ లా అండ్ జస్టిస్ కమిటీ సభ్యుడిగా వ్యవహరించాను. దేశంలోని వివిధ రాష్ట్రాల హైకోర్టులను సందర్శించాను. రాష్ట్ర హైకోర్టును మాత్రం సందర్శించలేకపోయాను.

అప్పటి లా అండ్ జస్టిస్ కమిటీ చైర్మన్ సుశీల్ మోడీకి, వైకాపా ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి ఫోన్ చేసి, ఏపీలో లా అండ్ జస్టిస్ కమిటీ కార్యక్రమాలను పెట్టుకోవద్దని, పెట్టుకున్న మీ కమిటీ సభ్యుడైన రఘురామకృష్ణంరాజుని తీసుకురావద్దని సూచించారు. ఆయన రాష్ట్రానికి రావడం మా ముఖ్యమంత్రి కి ఇష్టం లేదని, వస్తే ఒప్పుకోడని, గొడవలైపోతాయంటూ, మీ సమక్షంలోనే ఆయన్ని పోలీసులు అరెస్టు చేస్తే బాగుండదు కదా అని చెప్పినట్లు తెలిసిందన్నారు.

ఇలాంటి పనికిమాలిన వారి ప్రభుత్వంలో మనము ఉన్నామా?, సిగ్గేస్తోంది… ముఖ్యమంత్రి వ్యక్తిత్వం చూస్తే జాలేస్తుంది. ముఖ్యమంత్రి ఒప్పుకోవడం లేదని, రఘురామ కృష్ణంరాజు వస్తే అరెస్టు చేస్తారని విజయసాయిరెడ్డి, పార్లమెంటరీ లా అండ్ జస్టిస్ కమిటీ చైర్మన్ సుశీల్ మోడీకి ఫోన్ చేసి చెప్పారని కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి పై నేను ప్రమాణం చేస్తున్నాను. ఫోన్ చేయలేదని విజయసాయిరెడ్డి అతను నమ్మే దైవం పైన అయినా, లేకపోతే ఆయన బాస్ నమ్మే దేవుడి పైన అయినా ప్రమాణం చేస్తారా? అంటూ నిలదీశారు.

కోర్టు భవనాల నిర్మాణానికి నార్త్ ఈస్ట్ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులను వెచ్చిస్తుంది. ఇతర రాష్ట్రాలలో కోర్టు భవన నిర్మాణాలకు 60 నుంచి 70% నిధులను ఖర్చు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసే నిధులకు 30 నుంచి 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ గా చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన డబ్బులతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ గా అందజేసిన నిధులను ఒక ప్రత్యేక బ్యాంకు అకౌంట్ లో జమ చేయవలసి ఉంటుంది. అయితే, రాష్ట్రంలో న్యాయస్థాన భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయలేదు.

అయినా అడ్వకేట్ జనరల్ నిధులను విడుదల చేసినట్లుగా చెప్పి న్యాయస్థానాన్ని తప్పు దోవ పట్టించారు. ఇదే విషయమై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్, రఘునందన్ రావు లు అడ్వకేట్ జనరల్ నుద్దేశించి గతంలోనే నిధులు ఇచ్చేశాం… బ్యాంకు ఖాతాలో వేసేశాం అని అన్నారు కదా అంటూ ప్రశ్నించగా, సాంకేతిక లోపం వల్ల డబ్బులు జమ చేయలేకపోయామని అడ్వకేట్ జనరల్ విన్నవించినట్లుగా పత్రికల్లో చదివామని తెలిపారు .

రాష్ట్ర ప్రభుత్వ అక్రమాలపై ఫిర్యాదులు చేస్తే ఎవరినైనా చంపేస్తారా? అంటూ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. రాష్ట్రంలో రెండేసి ఓట్లు ఉన్న వారి ఓట్లను తొలగించాలని, ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు నమోదు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ, బెంగళూరుకు చెందిన ఒక ఐటీ ఉద్యోగి రాష్ట్రపతి కార్యాలయానికి లేఖ రాశారు. రాష్ట్రపతి కార్యాలయం స్పందిస్తూ, విచారణ చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాష్ట్రపతి కార్యాలయ ఉత్తర్వులు అందక ముందే, జగన్మోహన్ రెడ్డికి ఆ విషయం తెలియడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఎన్నికల సంఘానికి వచ్చిన కరస్పాండెన్స్ వాళ్లకు ఎలా తెలిసిందో తెలియడం లేదన్నారు. రాష్ట్రపతికి కార్యాలయానికి ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసిన వ్యక్తి ఇంట్లో లేని సమయంలో, ఒక రౌడీ ముఠా అతని ఇంట్లో చొరబడి దౌర్జన్యం చేశారు. జరిగిన సంఘటనపై అతను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, అతన్ని చొక్కా పట్టుకొని ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని బెదిరించారు. ఐ వి ఆర్ ఎస్ ద్వారా నన్ను తిట్టినట్లుగానే, అతన్ని కూడా అసభ్య పదజాలంతో దూషిస్తూ కేసు విత్ డ్రా చేసుకోవాలని బెదిరించారు. లేకపోతే చంపేస్తామని హెచ్చరించారు. నిజాయితీగా ఒక అంశంపై ఫిర్యాదు చేసిన వ్యక్తిని ఐపి అడ్రస్ ఆధారంగా సజ్జల గ్యాంగ్ అతని ఇంటి మీదికి వెళ్లిపోయి, చంపేస్తామని బెదిరించడం వారి దౌర్జన్యానికి ప్రత్యక్ష సాక్ష్యం .

ఎంతమందిని బెదిరించగలరు, ఎంతమందిని చంపగలరు. రేపు ఎన్నికల్లో తెదేపా, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థుల గుర్తులపై ప్రజలు ఓట్లు వేస్తారు. వారిని కూడా చంపేయగలరా? అంటూ నిలదీశారు. నా మీదకు గుండాలను కాకుండా, పోలీసులను జగన్మోహన్ రెడ్డి పంపించారు. పోలీసులు నన్ను అక్రమంగా నిర్బంధించి లాకప్లో చిత్రహింసలకు గురి చేశారు. అతను ఐటీ ఉద్యోగి కాబట్టి బెదిరిపోయాడు.

నేను జగన్మోహన్ రెడ్డి అక్రమాలకు ఎదురొడ్డి నిలిచాను. ప్రజలు నాకు అండగా ఉన్నారు. గత నాలుగువేలుగా ఈ ప్రభుత్వ అరాచకాలను, అక్రమాలను, కిరాతక చర్యలను ప్రశ్నిస్తూనే ఉన్నాను. ఈ ప్రభుత్వం మరో ఆరు వారాల్లో కూలిపోవడం ఖాయం. నీచమైన భాషలో మాట్లాడే వారిని పోషించి, తల్లిని, చెల్లిని తిట్టించే దుష్ట సంస్కృతికి చరమగీతం పాడడం ఎంతో దూరంలో లేదన్నారు. అటువంటి వారికి సమాధి కట్టడానికి ఎన్నికలే పునాది అవుతాయన్నారు.

వైకాపా ఆలోచనలకు అరిష్టం కలిగే విధంగా బిజెపి నాయకత్వం, పొత్తుల కోసం చంద్రబాబు నాయుడుని పిలిపించారు. ఢిల్లీలో బిజెపి, తెదేపా మధ్య పొత్తు పొడవడం, జగన్మోహన్ రెడ్డి పొత్తికడుపులో కత్తిపోటు పుచ్చుకున్న భావన కలుగుతుంది. కొన్ని బ్లూ చానల్స్, చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యక్రమం కోసమే హస్తినకు వెళ్తున్నారని ప్రచారం చేస్తున్నాయి. బిజెపి ఆహ్వానం పైనే ఆయన హస్తినాకు వస్తున్నారన్నది నాకు తెలిసిన నిజం.

పొత్తును చెడగొట్టేందుకు ఆఖరి నిమిషం వరకు జగన్మోహన్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలనే చేయనున్నారు. అయినా ఆ పప్పు లేని ఉడకవని తెలిసి, పొత్తు లో భాగంగా నరసాపురం స్థానాన్ని తీసుకుంటే రఘురామకృష్ణం రాజుకు టికెట్ ఇవ్వద్దని వేడుకుంటున్నట్లు తెలిసిందన్నారు.

LEAVE A RESPONSE