Suryaa.co.in

Andhra Pradesh

దళిత అభ్యర్థిపై దాడిచేస్తుంటే చోద్యం చూస్తారా?

-ఎస్సీ, ఎస్టీలే లక్ష్యంగా జగన్ మూక దాడులు
-భయభ్రాంతులను చేసి ఎన్నికల్లో గెలవాలని కుట్ర
-వైసిపి గూండాలపై తక్షణమే చర్యలు తీసుకోండి
-టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య డిమాండ్

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలే లక్ష్యంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ మూకలు విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ దళితులను భయభ్రాంతులకు గురిచేయడం ద్వారా ఎన్నికల్లో ఫలితాలను తమకు అనుకూలంగా మలుచుకోవాలన్నది వైసిపి గూండాల ఆలోచనగా కన్పిస్తోంది. ఎన్నికల కమిషన్ నియమావళికి విరుద్దంగా ప్రత్తిపాడులో వైసిపి అభ్యర్థి బాలసాని కిరణ్ కుమార్ వాలంటీర్లతో సమావేశం ఏర్పాటుచేశారు.

దీనిని ప్రశ్నించేందుకు వెళ్లిన టిడిపి అభ్యర్థి, మాజీ సీనియర్ ఐఎఎస్ అధికారి అయిన బూర్ల రామాంజనేయులు వాహనంపై వైసిపి గూండాలు స్వైరవిహారం చేసి ఆయనపై దాడికి ప్రయత్నించారు. ప్రజాగళం సభకు వెళ్లాడన్న అక్కసుతో గిద్దలూరు మండలం పరమేశ్వరనగర్ కు చెందిన గిరిజనుడు మునయ్యను నిన్న వైసిపి గూండాలు గొడ్డలితో అత్యంత దారుణంగా నరికి చంపారు. ఆ ఘటన జరిగి 24గంటలు గడవకముందే ప్రత్తిపాడులో దళితుడైన టిడిపి అభ్యర్థి రామాంజనేయులు వాహనాన్ని ధ్వంసంచేసి ఆయనపై హత్యాయత్నానికి తెగబడ్డారు.

ఎన్నికల నియమావళిని అతిక్రమించడమంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడమే. అదేమని ప్రశ్నించిన రామాంజనేయులుపై దాడికి పాల్పడటం దారుణం. ప్రత్తిపాడులో రామాంజనేయులుపై దాడిచేసిన వైసిపి గూండాలపై కేసులు నమోదు చేసి, కఠినచర్యలు తీసుకోవాలి. ఎన్నికల నియమావళికి విరుద్దంగా వైసిపి అభ్యర్థితో సమావేశమైన వాలంటీర్లందరినీ తక్షణమే తొలగించాలి. తాడేపల్లి ప్యాలెస్ ప్రలోభాలకు లొంగి పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించే పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలి. పారదర్శకంగా, స్వేచ్చాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రజలకు నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషనర్ దే.

LEAVE A RESPONSE