-వ్యవసాయ మీటర్ల కొనుగోలులో భారీ కుంభకోణం… ఇవిగో ఆధారాలు, ఇక నీ బుకాయింపు ఆపు పెద్దిరెడ్డి
– వేల కోట్లు సబ్సిడీ బకాయిలు పెట్టి నేడు రైతుల ఖాతాలలో ఠంచనుగా నగదు జమచేస్తామంటే నమ్మేదెలా?
– జగన్ రెడ్డి అసమర్ధతతో భారీగా పతనమైన వ్యవసాయ విద్యుత్ వినియోగం
– వ్యవసాయ మీటర్ల కొనుగోళ్లపై విద్యుత్ మంత్రి పెద్దిరెడ్డి చెబుతున్నవన్నీ పచ్చి అబద్దాలే
– మొత్తం 18,63,008 మీటర్లకు గాను రూ. రూ.6,480.34 కోట్లు, ఒక్కో మీటర్ కు దాదాపు – రూ.35 వేలు ఖర్చు చేయబోతున్న మాట వాస్తవం కాదా?
– 01.04.2022 నాటికి డిస్కంలకు ప్రభుత్వం రూ.12,340 కోట్ల సబ్సిడీ బకాయిలు చెల్లించాల్సిన మాట నిజం కాదా?
ఈ ఆర్దిక సంవత్సరం ఒక్క సెప్టెంబర్ నెలలోనే డిస్కంలకు రూ.860 కోట్లు బకాయి పెట్టింది వాస్తవం కాదా?
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం
విద్యుత్ మీటర్ల కొనుగోళ్లలో భారీ కుంభకోణం ముమ్మాటికి నిజం:
వైసీపీ ప్రభుత్వం మరో భారీ కుంభకోణానికి తెరలేపింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక్కో వ్యవసాయ మీటర్ ను రూ.35 వేలు పెట్టి కొంటూ తాడేపల్లి ఫ్యాలెస్ కు పెద్దమొత్తంలో దోచిపెట్టాలని ప్రణాళిక సిద్దం చేశారు. వ్యవసాయ మీటర్ల కొనుగోళ్లలో రూ.6,500 కోట్ల కుంభకోణంకు తెరలేపారన్న మాట ముమ్మాటికి వాస్తవం. వ్యవసాయ మీటర్ల కుంభకోణంలో జగన్ రెడ్డి బినామీ సంస్థ అయిన షిరిడీ సాయి చక్రం త్రిప్పుతోంది.
ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చడానికి వ్యవసాయ మీటర్ల టెండర్లను రద్దు చేశామని పెద్దిరెడ్డి నిస్సిగ్గుగా పచ్చి అబద్దాలు ఆడుతున్నాడు. అక్టోబర్ 12, 2022 న విద్యుత్ సమీక్షా సమావేశంలో డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎనర్జీ వారు ముఖ్యమంత్రికి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేజీ నం 50 లో వ్యవసాయ మీటర్లకు ఎంతెంత ఖర్చుచేయబోతున్నారో సవివరంగా రాశారు. ఎస్.పి.డీ.సీ.ఎల్ పరిధిలో 11 లక్షల మీటర్లకు గాను రూ.3,825.54 కోట్లు. సిపిడీసీఎల్ పరిధిలో 5 లక్షల మీటర్లకు గాను రూ.1,742.87 కోట్లు. ఈ.పి.డీ.సీ.ఎల్ పరిధిలో 2,63,008 మీటర్లకు గాను రూ.911.93 కోట్లు. మొత్తంగా 18,63,008 మీటర్లకు గాను రూ. రూ.6,480.34 కోట్లు అంటే దాదాపు ఒక్కో మీటర్ కు రూ.35 వేలు ఖర్చు చేయబోతున్నాం అని విద్యుత్ శాఖా అధికారులు సిఎంకు వివరించారు.
సాక్షాత్తు విద్యుత్ శాఖా అధికారులే ముఖ్యమంత్రి వద్ద వాస్తవాలు కుండబద్దలు కొడితే ఇంకా మంత్రి పెద్దిరెడ్డి మాత్రం మీటర్ల కొనుగోళ్లకు కేవలం రూ.1150 కోట్లు మాత్రమేనని ఖర్చు చేస్తున్నామని అబద్దాలు చెబుతున్నారు. విద్యుత్ శాఖా అధికారులు చెప్పిన నిజాలను ఒక్క అంకె తప్పు లేకుండా వార్తాపత్రికలు ప్రచురిస్తే అవి అబద్దం అని ఆయా పత్రికా యాజమాన్యాలను పెద్దిరెడ్డి నిందించడం సిగ్గుచేటు. వేల కోట్లు దోపిడీ చేయడం కోసం ఒక్కో వ్యవసాయ మీటర్ ను రూ.35 వేలు పెట్టి కొనుగోలు చేస్తూ తన కమీషన్ ఎప్పుడెప్పుడు తాడేపల్లి ఫ్యాలెస్ కు వస్తుందా అని జగన్ రెడ్డి ఎదురుచూస్తున్నారు. లెటర్ ఆఫ్ ఇంటెంట్ కూడా విడుదల చేశామని జూన్ 2023 నాటికి ఈ పనులన్నీ పూర్తి చేస్తామని అధికారులు స్పష్టంగా చెప్పారు.
పెద్దిరెడ్డి విద్యుత్ మీటర్ల టెండర్లను రద్దు చేశామని చెబుతుంటే విద్యుత్ శాఖ అధారులు మాత్రం టెండర్లు దక్కించుకున్న కంపెనీల యొక్క సాంపిల్ మీటర్లను టెస్టింగ్ కు పంపి వాటి రిజల్ట్స్ కూడా తీసుకున్నాం అని చెబుతున్నారు. పై వాస్తవాలు గమనించిన తర్వాత రైతుల మెడకు ఉరితాళ్లు గా మారబోతున్న విద్యుత్ మీటర్ల వ్యవహారంలో జగన్ రెడ్డి సర్కార్ తమ బినామీ కడప కంపెనీలను అడ్డంపెట్టుకుని భారీ కుంభకోణానికి తెరలేపిందని వార్తపత్రికలు ప్రచురించిన కధనాలు నూటికి నూరు శాతం నిజం అన్న మాట స్పష్టమౌతోంది.
పి.ఎస్.పి (పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్లాంట్లు) ల ఏర్పాటులో కూడా జగన్ రెడ్డి బినామీలదే హవా:
ఒక్క విద్యుత్ మీటర్లు, సోలార్ పవర్ ప్లాంట్లలోనే కాకుండా పి.ఎస్.పి విద్యుత్ ప్లాంట్లలో సైతం జగన్ రెడ్డి బినామీ కంపెనీలే చక్రం త్రిప్పుతున్నాయి. విద్యుత్ శాఖా అధికారులు ముఖ్యమంత్రికి ఇచ్చిన ప్రజెంటేషన్ లోనే ఈ వాస్తవాలు బట్టబయలైనాయి. రాష్ట్రంలో వివిధ జిల్లాలలో ఏర్పాటు కాబోతున్న ఈ పి.ఎస్.పి ప్లాంట్లలో సింహ భాగం జగన్ రెడ్డి బినామీలైన షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్, అరబిందో మరియు జగన్ రెడ్డి ఊడిగం చేసే అదానీ కంపెనీలకే దక్కించుకున్నాయి. షిరిడిసాయి ఎలక్ట్రికల్స్ కు 900, 1000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్లాంట్ల (పి.ఎస్.పి) ను, 1200 ఎకరాల భూమిని కట్టబెట్టారు. రాష్ట్ర సంపదను అరబిందో, అదానీ, షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కు దోచిపెడుతున్నారు. అలాగే పి.ఎస్.పి ప్లాంట్ల ఏర్పాటుకు అరబిందోకు నంద్యాల, అనంతపురం లలో 1000 ఎకరాలు, అదానీకి వివిధ ప్రాంతాల్లో 1600 ఎకరాలు భూమిని కేటాయించారు. ఈ విధంగా తన గొడుగు కంపెనీలకు దోచిపెట్టడంలో జగన్ రెడ్డి తన పనితనాన్ని మరోసారి నిరూపించుకున్నాడు.
విద్యుత్ డిస్కాంలకు వేల కోట్లు సబ్సిడీ బకాయిలు పెట్టి నేడు రైతులకు సకాలంలో నగదు జమచేస్తామంటే నమ్మేదెలా?
01.04.2022 నాటికి డిస్కంలకు ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీ బకాయిలు రూ. 3,238 కోట్లు. వివిధ ప్రభుత్వ శాఖలు డిస్కంలకు పెట్టిన విద్యుత్ వాడకపు ఛార్జీల బాకీలు రూ.9,102 కోట్లు. మొత్తంగా 01.04.2022 నాటికి డిస్కంలకు రూ.12,340 కోట్లు ఈ ప్రభుత్వం చెల్లించాలి. వేల కోట్ల సబ్సిడీ బకాయిలు, ప్రభుత్వ శాఖలు వాడిన విద్యుత్ బకాయిలు చెల్లించని జగన్ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయ మీటర్లు పెట్టి రైతుల ఖాతాలలో జమచేస్తామంటే ఎవరు నమ్ముతారు? ఈ ఆర్దిక సంవత్సరం ఒక్క సెప్టెంబర్ నెలలోనే ప్రభుత్వం డిస్కంలకు సబ్సిడీ రూపంలో చెల్లించాల్సింది రూ.926 కోట్లు అయితే.. చెల్లించింది కేవలం రూ.203 కోట్లే.
వివిధ ప్రభుత్వ శాఖాలు వినియోగించిన కరెంటుకు డిస్కంలకు కట్టాల్సింది రూ.327 కోట్లు… కట్టింది రూ.191 కోట్లే. ఒక్క సెప్టెంబర్ నెలలోనే ప్రభుత్వం డిస్కంలకు సబ్సిడీ మరియు విద్యుత్ ఛార్జీల రూపంలో చెల్లించాల్సిన రూ.1254 కోట్లకు గాను చెల్లించింది కేవలం రూ.394 కోట్లు మాత్రమే. అంటే ఒక్క సెప్టెంబర్ నెలలోనే జగన్ సర్కార్ డిస్కంలకు రూ.860 కోట్లు ఎగనామం పెట్టింది. ఇంతపెద్దమెత్తంలో బాకీ పెట్టిన జగన్ రెడ్డి ప్రభుత్వం రైతుల ఖాతాలలో ఠంచనుగా డబ్బులు జమ చేస్తామనడం పచ్చి మోసం, దగా.
జగన్ సర్కార్ అసమర్ధత వల్ల వ్యవసాయ విద్యుత్ వినియోగంలో భారీ పతనం:
జగన్ రెడ్డి అసమర్ధత వల్ల వ్యవసాయ విద్యుత్ వినియాగం కూడా భారీగా పడిపోయింది. గత ఏడాది విద్యుత్ వినియోగం ఈ ఏడాదితో పోల్చి చూస్తే మే మాసంలో 32.43 శాతం, జూన్ లో 23.88 శాతం, ఆగష్టులో 24.19 శాతం వ్యవసాయ విద్యుత్ వినియోగం పడిపోయింది. మంత్రి పెద్దిరెడ్డి చెబుతున్నట్లు వ్యవసాయానికి బ్రహ్మాండంగా నాణ్యమైన విద్యుత్ నిరంతరాయంగా సరఫరా చేస్తుంటే విద్యుత్ వినియోగం భారీగా పడిపోయింది? వ్యవసాయం సంక్షోభంలో ఉందనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి. ఇవి మీ అధికారులు ముఖ్యమంత్రికి ఇచ్చిన లెక్కలు కావా? వ్యవసాయానికి జగన్ రెడ్డి 9 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తున్న మాట పచ్చి అబద్దం అని ఈ లెక్కలతో తేలిపోయింది.
ఎస్సీ, ఎస్టీలకు సబ్సిడీ విద్యుత్ లో మోసం:
ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే సబ్సిడీ విద్యుత్ లో కూడా జగన్ రెడ్డి మోసం విస్మయం కలిగిస్తోంది. ప్రతీ ఏటా పెరగాల్సిన సబ్సిడీ విద్యుత్ కనెక్షన్లు పెరగకపోగా ఉన్న సబ్సిడీ కనెక్షన్లలలో సైతం కోతలు పెట్టి నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీలను సైతం మోసం చేసిన చరిత్ర జగన్ రెడ్డి సొంతం. 2021 లో 22,47,587 ఎస్సీ ఎస్టీ సబ్సిడీ కనెక్షన్లకు గాను 2022 కి 18,54,165 కుదించి ఏకంగా 3,93,422 కనెక్షన్లకు సబ్సిడీ తొలగించారు. ఒక్క ఉత్తరాంధ్రలోనే ఈపీడీసీఎల్ పరిధిలో గత ఏడాది 8,16,585 ఎస్సీ, ఎస్టీ సబ్సిడీ కనెక్షన్లు ఉంటే అవి కాస్తా 5,94,141 కనెక్షన్లకు పడిపోయింది. అంటే ఏడాదిలో ఒక్క ఉత్తరాంధ్రలోనే 2,22,444 సబ్సిడీ కనెక్షన్లు తొలగించిన దుర్మార్గపు ప్రభుత్వం ఇది. ఉత్తరాంధ్రలో ఉన్న ఎస్సీ, ఎస్టీలకు చేసిన న్యాయం ఇదేనా? ఈ లెక్కలను బట్టి చూస్తే ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం చేసిన ఘనత జగన్ రెడ్డిదేనని తెలుస్తోంది.
బలవంతంగా ఎస్సీ, ఎస్టీ సోదరుల నుంచి కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు వసూలుకు తెగబడిన వైసీపీ ప్రభుత్వం:
11.10.2022 న ఏపీసీపీడీసిఎల్ పరిధిలో 1,80,782 ఎస్సీ, ఎస్టీ కనెక్షన్ల నుంచి బకాయిపడ్డ రూ.79 కోట్లు వెంటనే వసూలు చేయాలని ఆ సంస్థ ఎండీ పద్మా జనార్ధన్ రెడ్డి అత్యంత దుర్మార్గంగా ఒక సర్కులర్ ను విడుదల చేశారు. దళితుల నుంచి విద్యుత్ బకాయిలు వసూలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠకమైన చర్యలు తీసుకుంటామని నోటీసులో రాశారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఎస్సీ, ఎస్టీలపై ఇంత దారుణంగా వ్యవహరించలేదు. ఎస్సీ, ఎస్టీ వర్గాలపై ఉదారంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం నేడు ఆ వర్గాలపై కత్తికట్టి కోట్ల రూపాయల వసూలుకు తెగబడింది. పేదవర్గాలపై జగన్ రెడ్డి ప్రభుత్వానికి కనికరం లేకపోగా రౌడీయిజం చేస్తూ వారి నుంచి బకాయిలు వసూలు చేయాలంటూ సర్కులర్ జారీ చేయడం దుర్మార్గం. ఇదేనా జగన్ రెడ్డి దళిత సోదరులపై కురిపించే కపట ప్రేమ?
రూ.2910 కోట్లు ట్రూ అప్ ఛార్జీల మరియు రూ. 920 కోట్ల ఎలక్ట్రిసిటీ డ్యూటీ డిమాండ్ భాదుడు:
పరిశ్రమలు వాడుకున్న విద్యుత్ పై ఎలక్ట్రిసిటీ డ్యూటీ డిమాండ్ వసూలు చేస్తారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఆగష్టు వరకు ఎలక్ట్రిసిటీ డ్యూటీ డిమాండ్ రూ.123 కోట్లు వసూలు చేస్తే ఈ ఏడాది రూ.1043 కోట్లు వసూలు చేశారు. అంటే ఒక్క ఏడాదిలోనే అదనంగా రూ.920 కోట్లు ఎలక్ట్రిసిటీ డ్యూటీ డిమాండ్ పేరుతో అదనపు భారాన్ని మోపారు. ట్రూ అప్ ఛార్జీల వసూళ్లు మా పరిధిలో ఉండవంటూ పెద్దిరెడ్డి అమాయకంగా మాట్లాడుతున్నారు. విద్యుత్ డిస్కాంల ప్రతిపాధనల వల్లే ట్రూ అప్ ఛార్జీలు నిర్ణయించబడాతాయన్న వాస్తవం ప్రపంచం మొత్తం తెలుసు. ట్రూ అప్ ఛార్జీల బాదుడులో జగన్ రెడ్డి నం.1 అన్న విషయం కూడా అందరికీ తెలుసు. కానీ తమకు ఏపాపం తెలియదన్నట్లు నటించడం ఒక్క పెద్దిరెడ్డికే చెల్లింది. ఆగష్టు నెల నుంచి రూ. 2,910 కోట్లు ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేయబోతున్నాం అని అధికారులు ముఖ్యమంత్రికి కాలర్ ఎగరేసి చెప్పిన మాట వాస్తవం కాదా పెద్దిరెడ్డి?. ఆగష్టు లో రూ. 92 కోట్లు, సెప్టెంబర్ లో రూ.92.96 కోట్లు ఇలా ప్రతీనెలా సుమారు రూ.100 కోట్లు వినియోగదారులపై తాము భాదటానికి సిద్దమయ్యామని మీ శాఖా అధికారులే చెప్పిన మాట వాస్తవం కాదా పెద్దిరెడ్డి.
విద్యుత్ సంస్థల పేరుతో మరో రూ.17,074 కోట్ల అప్పులు చేసేందుకు రెడీ అయిన జగన్ రెడ్డి ప్రభుత్వం:
ఇప్పటికే దాదాపు రూ.8 లక్షల కోట్లకు పైబడి అప్పుల భారాన్ని రాష్ట్రం నెత్తిన రుద్దిన జగన్ రెడ్డి మరలా కొత్తగా డిస్కంల పేరుతో మరో రూ. 17,074 కోట్లు అప్పుకు సిద్దమయ్యాడు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పి.ఎఫ్.సి) మరియు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్.ఈ.సీ) ల ద్వారా ఈ రుణాన్ని తాము సేకరించబోతున్నట్టు విద్యుత్ శాఖా అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఏపీఎస్.పి.డీ.సిఎల్ పేరుతో రూ.12,334 కోట్లు, ఏపీఈపీడీసిఎల్ పేరుతో రూ.2,805, ఏపీసీపీడీసీఎల్ పేరుతో రూ.1935 అప్పులు చేయబోతున్నామని ముఖ్యమంత్రికి తెలియజేసి వారి చిరునవ్వుకు కారణమయ్యారు మన విద్యుత్ శాఖ అధికారులు. ఇప్పటికే జగన్ రెడ్డి రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల్లో ముంచాడు. అవి చాలవన్నట్లు మరో రూ.17,074 కోట్ల అప్పులకు సిద్దపడటం చూస్తే రాష్ట్రాన్ని మరో శ్రీలంక చేసేవరకు జగన్ రెడ్డి నిద్రపోయేట్టు లేడు.
ఆక్వా సబ్సడీ:
గత ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మత్చ్యకారులకు ఇచ్చిన సబ్సిడీ రూ.494 కోట్లు అయితే అది కాస్తా ఈ ఏడాది రూ.221 కోట్లకు పడిపోయింది. అంటే అక్వా రంగ అభివృద్ధిపై ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందే దీనితో అర్దమైపోతుంది.
ముగింపు:
జగన్ రెడ్డి వ్యవసాయ మీటర్ల కొనుగోలులో భారీ కుంభకోణానికి పాల్పడుతున్న మాట మొమ్మాటికి నిజం. ఒక్కో వ్యవసాయ విద్యుత్ మీటర్ రూ.35 వేల పెట్టి కొనుగోలు చేస్తున్నారని వార్తా పత్రికల్లో వచ్చిన కధనాలు అక్షర సత్యాలు. విద్యుత్ శాఖా అధికారులే ముఖ్యమంత్రికి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఈ విషయాలు చెప్పారు. తన బినామి సంస్థయైన షిరిడీసాయి ఎలక్ట్రికల్స్ కు దోచిపెడుతున్న విషయం కూడా నూటికి నూరు శాతం వాస్తవం. అలాగే అదానీకి, అరబిందో లకు కూడా రాష్ట్ర సంపదను దోచిపెడుతున్నారు. విద్యుత్ సంస్థలకు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిన జగన్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ మీటర్లు పెట్టి రైతుల ఖాతాలలో నగదు జమచేస్తామనడం పచ్చి అబద్దం. వేలకోట్లు రూపాయలు దారిమళ్లించి దోచుకోవడం కోసమే విద్యుత్ మీటర్ల పేరుతో రైతుల మెడలకు ఉరితాళ్లు బిగిస్తున్నారు. వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ మీటర్ల నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు తెలుగుదేశం ప్రభుత్వం పోరాడుతూనే ఉంటుంది. టెండర్ల రద్దు డ్రామాలను కూడ కట్టిపెట్టి విద్యుత్ మీటర్ల కొనుగోళ్లను వెంటనే నిలిపివేసి రైతులకు యదావిధిగా ఉచిత విద్యుత్ పథకం కొనసాగించాలి. రైతుల జీవితాలను దుర్భరంగా మారుస్తాం, వారికి అన్యాయం చేస్తామంటే తెలుగుదేశం చూస్తూ కూర్చోదని వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.