Suryaa.co.in

Editorial

మోదీతో యుద్ధానికి జగనన్న రె‘ఢీ’

– పెట్రోల్ ధరలపై ప్రభుత్వ యుద్ధం
ఇప్పటికే మోదీ, నద్దా, అమిత్‌షా ఆఫీసులకు ఫిర్యాదు చేసిన ఇద్దరు ఎంపీలు, ఒక జాతీయ నేత
– 14న అమిత్‌షా దృష్టికి ప్రకటన సారాంశం
– వైసీపీ సోషల్‌మీడియాలో ‘మోదీపై యుద్ధం’ అంశం కూడా
– జీఓ నెంబరు 16 సంగతేమిటో చెప్పాలన్న కన్నా
( మార్తి సుబ్రహ్మణ్యం)
అనుకున్నదే జరుగుతోంది. బద్వేలు ఉప ఎన్నికలో టీడీపీ సాయం తీసుకున్న బీజేపీ భవిష్యత్తు వ్యూహమేమిటో గ్రహించిన ఏపీ సీఎం జగన్.. శరవేగంగా రాజకీయ వ్యూహాన్ని మార్చి, కేంద్రంలోని మోదీ సర్కారుకు ఝలక్ ఇచ్చారు. పెట్రోల్-డీజిల్ ధరలపై సుంకం తగ్గిస్తూ మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయంతో, జగన్ సర్కారు ఆత్మరక్షణలో పడింది. రాష్ట్రంలో కూడా జగన్ ప్రభుత్వం.. తన వాటాగా వచ్చే సుంకాన్ని తగ్గించాలన్న డిమాండ్, విపక్షాల నుంచి పెరుగుతోంది. అటు బీజేపీ కూడా రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహించి, వైసీపీ సర్కారుపై ఒత్తిడి పెంచింది.
ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం ఇంధన ధరలు, సుంకాల వాటా వాస్తవ విశ్లేషణ పేరిట విడుదల చేసిన అధికార ప్రకటన ద్వారా.. ధర్నాలు చేస్తున్న బీజేపీకి, మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వానికి సవాల్ విసిరింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. రాష్ట్రంలో పెట్రోల్ ధరలపై రాజకీయం చేస్తోందని విమర్శిస్తూ, ఆ పార్టీతో నేరుగా యుద్ధానికి దిగడం సంచలనం సృష్టిస్తోంది. అటు వైసీపీ సోషల్‌మీడియా కూడా రంగంలోకి దిగి జగన్ ప్రభుత్వ వైఖరిని సమర్ధిస్తూ ప్రచారంలో పెట్టడం చర్చనీయాంశమయింది.
అయితే మోదీ సర్కారును ముద్దాయిని చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనను.. ఈపాటికే ఇద్దరు ఎంపీలు, రాష్ట్రానికి చెందిన ఒక జాతీయ నేత ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు నద్దా, హోంమంత్రి అమిత్‌షా కార్యాలయాలకు ఫ్యాక్స్ రూపంలో పంపించినట్లు సమాచారం. రాష్ట్రంలో మోదీ ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమయిందన్నది ఆ ఫిర్యాదు సారాంశమని తెలుస్తోంది.
‘‘ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది ఎంత? తగ్గించింది ఎంత?’’ అన్న శీర్షికతో కేంద్రం తన వాటాగా ఇస్తున్న నిధులు, రాష్ట్రాలకు నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రభుత్వ ప్రకటనలో స్పష్టం చేయడం ద్వారా.. కేంద్రంలోని మోదీ సర్కారుపై, జగనన్న ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమయ్యారన్న సంకే తాలు పంపించినట్టయింది.
‘‘ లీటరు ధర వంద రూపాయలు దాటించి, ఐదో, పదో తగ్గించామంటూ పెంచిన వారే రోడ్లమీదకు వచ్చి నిరసన చేస్తామంటే ఇంతకంటే ఘోరం ఉంటుందా’’ అన్న నిలదీతతో ప్రారంభించి.. ‘‘ ఒకరేమో ఇబ్బడిముబ్బడిగా పెంచి, అరకొరగా తగ్గించి, ధర్నాలంటూ ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు. మరొకరు తమ హయాంలో ఎంత పెంచారన్నది మరచి రాజకీయం చేస్తున్నార’’న్న విమర్శనాస్త్రం సంధించింది. ఇది.. రేట్లు పెంచిన బీజేపీ ప్రభుత్వం కంటితుడుపుగా కొంత తగ్గించి, ఏపీ సర్కారును కూడా పెట్రోల్ రేట్లు తగ్గించాలంటూ తమ పార్టీ చేసిన ధర్నాలను వెక్కిరించడమేనని బీజేపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
‘‘ కేంద్రం పెట్రోల్-డీజిల్‌పై 3,35,000 కోట్లరూపాయల పన్నులు వసూలు చేసినప్పటికీ అందులో రాష్ట్రాలకు పంచింది కేవలం 19,475 కోట్లు మాత్రమే. అంటే కేవలం 5.80 శాతం మాత్రమే. వాస్తవంగా కేంద్రం వసూలు చేసే పన్నులలో రాష్ట్రాలకు 41 శాతం వాటా పంచవలసి ఉన్నప్పటికీ, పెట్రో ఆదాయాన్ని విజిడబుల్‌పూల్ లోకి రాకుండా సెస్‌లు, సర్‌చార్జిల రూపంలో సుమారు 2,87,500 కోట్ల రూపాయలు వసూలు చేసి ఆమేరకు రాష్ట్రాలకు ఇవ్వవలసిన వాటా తగ్గించిన విషయం వాస్తవం కాదా?’’ అని సంధించిన ప్రశ్నాస్త్రం.. రాష్ట్రాలకు మోదీ సర్కారు అన్యాయం చేస్తోందని, నేరుగా యుద్ధం ప్రకటించడమేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పైగా ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు తగ్గినా, మోదీ సర్కారు మాత్రం పెట్రోల్ ధరలు పెంచిందన్న కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, శివసేన, ఆమ్ ఆద్మీ, వామపక్షాల దారిలోనే జగన్ సర్కారు కూడా పయనిస్తున్నట్లు ఆయన ప్రకటన వైఖరి స్పష్టం చేస్తోందని కమలదళాలు కారాలు, మిరియాలు నూరుతున్నారు. ‘‘క్రూడాయిల్ ధరలు తగ్గిపోయినప్పటికీ 2019 మే లో లీటర్ పెట్రోల్ రు.76.89, లీటరు డీజిల్ రు.71.50గా ఉన్న ఆయిల్ ధరలు, నవంబర్1, 2021 నాటికి లీటర్ పెట్రోల్ రు.115.99, లీటర్ డీజిల్ రు.108.66కి చేరింద’’న్న జగన్ ప్రభుత్వ విమర్శలు.. మోదీ ప్రభుత్వాన్ని ప్రజల ముందు ముద్దాయిలా నిలబెట్టేలా ఉన్నాయని బీజేపీ మండిపడుతోంది.
మరోవైపు వైసీపీ సోషల్‌మీడియాలో కూడా.. మోదీ ప్రభుత్వం పెట్రోల్‌పై చేస్తున్న రాజకీయాన్ని విమర్శిస్తూ, విస్తృత స్థాయిలో చేస్తున్న ప్రచారంపై కూడా బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వైసీపీ సోషల్‌మీడియాలో తప్పంతా మోదీ చేసి, నింద రాష్ట్రాలపై వేస్తున్నారనే అర్ధం వచ్చేలా వేస్తున్న కార్టూన్లు, గ్రాపిక్ డిజన్లు, వైసీపీ అనుకూల మేధావులు రాస్తున్న వ్యాసాలు రాష్ట్రంలో వ్యక్తిగతంగా మోదీ ఇమేజ్‌ని, సంస్థాగతంగా బీజేపి ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని బీజేపీ నాయకత్వం ఆందోళన చెందుతోంది.
‘‘రాష్ట్రం ఆర్ధిక సంక్షోభంలో ఉన్నప్పుడల్లా నిధులిస్తూ గండం నుంచి గట్టెక్కిస్తున్న మోదీ సర్కారుపై ఈవిధంగా విషం చిమ్మడం చేసిన మేలు మరవడమే. పైగా కేంద్ర నిధులు, అప్పుల కోసం వారంలో నాలుగురోజులు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్ చాంబర్ వద్ద కనిపించే బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి ఈ ప్రకటన ఇవ్వడం మరింత ఆశ్చర్యం. జగన్ ప్రభుత్వ అనుభవరాహిత్యంతో వస్తున్న వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజల ముందు ముద్దాయిగా నిలబెట్టే విష రాజకీయాలను ప్రజలు తిప్పికొడతారు. కేంద్రంపై ఇన్ని అభాండాలు, ఇంత విషం చిమ్మిన జగన్ ప్రభుత్వం, రోడ్డు సెస్‌కు లీటరు పెట్రోలుపై వసూలు చేస్తున్న రూపాయి నిధులతో రోడ్లు ఎందుకు బాగుచేయడంలేదో చెప్పకుండా తప్పించుకోవడం క్షమార్హం కాదు. కేంద్రం సుంకాన్ని తగ్గించినందున, రాష్ట్రం కూడా తన వాటాను తగ్గించుకుంటే ప్రజలకు వెసులుబాటు ఉంటుందన్నదే మా పార్టీ వాదన’’ అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విరుచుకుపడ్డారు.
పెట్రోల్‌పై వ్యాట్‌ను 35.20 శాతం, డీజిల్‌పై 27 శాతం పెంచుతూ.. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, 2020 జనవరి 29న ఇచ్చిన జీవో నెంబర్ 19ను జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది? అసలు ఆ జీఓ అమలులో ఉందా? ఉపసంహరించుకున్నారా? మళ్లీ తర్వాత కొత్త జీఓ ఏమైనా ఇస్తే దాన్ని బహిరంగపరచాలని కన్నా సవాల్ చేశారు.
తాజా పరిణామాలపై బీజేపీ శిబిరం జగన్ సర్కారుపై గుర్రుగా ఉంది. ప్రజలకు తనపై వస్తున్న వ్యతిరేకతను తమ పార్టీ వైపు మళ్లించే ప్రయత్నం చేయడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు మోదీ సర్కారు నుంచి అన్ని రకాల ప్రయోజనాలు పొందుతూనే, మరోవైపు మోదీ సర్కారును అభాసుపాలు చేస్తున్న జగన్ ప్రభుత్వ తీరును, ఇకపై ఎప్పటికప్పుడు ఎదురుదాడి చేసి ఎదుర్కొంటామని బీజేపీ నేతలు చె బుతున్నారు. కాగా, జగన్ ప్రభుత్వం మోదీని అప్రతిష్ఠపాలుచేసేలా ఇచ్చిన ప్రభుత్వ ప్రకటనను, ఈనెల 14న తిరుపతికి రానున్న అమిత్‌షా దృష్టికి తీసుకువెళతామని బీజేపీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు.
‘‘ ప్రజాధనంతో ఇన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్న జగన్ ప్రభుత్వం పెట్రో ధరలను జీఎస్టీ పరిథిలోకి రాకుండా ఎందుకు అడ్డుకుంటోంది? ఆ మేరకు కేంద్రానికి లేఖ రాసి మీ నిజాయితీ నిరూపించుకోండి. రెండేళ్ల నుంచి రాష్ట్రానికి ఎంత ఆదాయం వచ్చిందో చెప్పగలరా? దానిని మీ ప్రకటనలో ఎందుకు చేర్చలేదు?’’ అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నెహ్రు యువకేంద్ర జాతీయ ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి సవాల్ చేశారు.
‘‘ పత్రికా ప్రకటన కాదు.. మాట తప్పినందుకు క్షమాపణ కోరాలి. ఒకొక్క పత్రికకు .నీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు 4.5 కోట్లు వెచ్చించి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న మీకు ప్రజల పట్ల సానుభూతి లేదని అర్థం అవుతున్నది… పక్క రాష్ట్రాల్లో డీజిల్, పెట్రోల్ మీద రాయితీ ఇచ్చారు అంటే ధనిక రాష్ట్రాలు అయ్యికాదు, అవసరాలు లేక కాదు.. ప్రజలమీద ప్రేమతో . రోడ్ల కోసమని, అమరావతి కొరకు సెస్సు పేరుతో పిండుతున్నారే? మరి రోడ్లు, అమరావతి, ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చిన వెంటనే రేట్లు తగ్గిస్తా అన్న నీవు మాట తప్పి,మడమ తప్పి చరిత్ర హీనుడు అయ్యా వు. రే ట్లు తగ్గించే వరకు బిజెపి రాజీలేని పోరాటాలు చేస్తుంది‘‘అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు విరుచుకుపడ్డారు.

LEAVE A RESPONSE