Suryaa.co.in

Political News

కూలుతున్న జగన్ రెడ్డి అధికార కోటలు

మనం కలవరపడి వెనుతిరిగితే కాలం ఎగబడి మీద పడుతుంది. అదే ఎదురు తిరిగి చెలరేగితే కాలం భయపడుతుంది. కనురెప్పలు మూత పడితే కాలం జోకొడుతుంది. అదే కంఠమెత్తి తిరగబడితే కాలం జే,జే లు పలుకుతుందని ఒక కవి చెప్పిన సూక్తి.

మొన్న జరిగిన గ్రామ పంచాయితీ సర్పంచుల,వార్డు మెంబర్లకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే 2024 లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు సజావుగా,స్వేచ్ఛగా జరిగితే పులివెందులలో సియం జగన్మోహన్‌రెడ్డి విజయం సాధించడం సాధ్యమేనా అన్న అనుమానం కలుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులు జగన్‌రెడ్డి ఫ్యాన్‌ రెక్కలు ముక్కలు చెయ్యగా,విద్యావంతులు మా ఓటర్లు కాదు,మా ఓటర్లు వేరే వున్నారని వైసిపి నాయకులు సాకులు చెప్పారు.రాష్ట్రంలోని వివిధ గ్రామ పంచాయతీ, వార్డులకు జరిగిన ఉపఎన్నికల్లో అధికారపార్టీకి చావుదెబ్బ తగిలింది. రెండున్నరేళ్ళ క్రితం జరిగిన స్థానిక ఎన్నికల్లో అధికార దుర్వినియోగం చేసి, అరాచకం సృష్టించి వైసిపి స్వీప్‌ చేయగా మొన్న జరిగిన పంచాయితీ ఉపఎన్నికల్లో అధిక స్థానాల్లో వైసిపి బలపరిచిన అభ్యర్థులకు పరాభవం ఎదురైంది.

గతంలో శాసనమండలి గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గ ఎన్నికల్లో అధికారపార్టీకి పరాభవం జరిగినట్లే,తాజాగా జరిగిన పంచాయతీ ఉప ఎన్నికల్లోనూ వైసీపీ ప్రభుత్వంపై స్పష్టoగా ప్రజా వ్యతిరేకత వ్యక్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా 34 గ్రామ పంచాయతీలు, 245 వార్డులకు ఉప ఎన్నికలు నిర్వహించగా అనేకచోట్ల వైసీపీకి టీడీపీ గట్టి షాక్‌ ఇచ్చింది.

టీడీపీ బలపర్చిన అభ్యర్థులు ఎక్కువ చోట్ల విజయం సాధించారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో భారీ మెజార్టీతో టీడీపీ సర్పంచ్‌ గెలుపొందడం గమనార్హం.గుంటూరు, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, కడప, కృష్ణా జిల్లాల్లో అధిక సంఖ్యలో టీడీపీ సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు విజయం సాధించారు. అత్యధిక వార్డు స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. పోలింగ్‌ సందర్భంగా వైసీపీ నేతలు తమ అధికారాన్ని విస్తృతంగా ప్రయోగించినప్పటికీ ఫలితం దక్కలేదు.

జగన్‌మోహన్‌ రెడ్డి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న విషయం పంచాయతీ ఉప ఎన్నికల ఫలితాల ద్వారా బట్టబయలైంది,అరాచకం, అధికార గణాన్ని అడ్డుపెట్టుకుని వైసిపి అనేక ప్రతిబంధకాలు సృష్టించినా. జగన్‌ అరాచక, అవినీతి, రైతు వ్యతిరేక విధానాలకు, బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసినందుకు ఓటు ద్వారా ప్రజలు బుద్ది చెప్పారు.

గ్రామీణులు కూడా జగన్ రెడ్డి నవ మోసాలకు మొగ్గు చూపకుండా పంచాయితీలకు ,వార్డులకు జరిగిన ఉప ఎన్నికల్లో అవినీతి జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఓటుతో గుణపాఠం చెప్పారు. వైనాట్‌ 175 అంటున్న జగన్‌ రెడ్డి అధికార గర్వాన్ని నేలమట్టం చేయబోతున్నామని గ్రామీణ ప్రజలు కూడా హెచ్చరికలు పంపారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరగబడిన విధంగానే స్థానిక సంస్థల ప్రజలు తిరగ బడ్డారు.జగన్ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్దపడుతున్న విషయం పంచాయితీ ఉప ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి. ఈ ఫలితాలు తెలుగు దేశం శ్రేణుల్లో నూతనోత్సాహం నింపాయి.

పంచాయితీలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఫలితాలు వారికి అనుకూలంగా వచ్చి ఉంటే మా ఘనత అని,మా పరిపాలన చూసి ప్రజలు మమ్మల్ని గెలిపించారని బాకాలూదుకొనేవారు. కానీ ఫలితాలు వ్యతిరేకంగా రావడంతో పంచాయితీ ఎన్నికల్లో కొన్ని స్థానాలు గెలిచి వరల్డ్ కప్ గెలిచినట్లు ప్రచారం చేసుకొంటున్నారు అంటూ తెలుగుదేశం పై ఒక మంత్రి వెటకారం చేశారు.

గుంటూరు, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, కడప, కృష్ణా జిల్లాల్లో అధిక సంఖ్యలో టీడీపీ సర్పంచ్‌లు గెలవడం ప్రభుత్వం పట్ల ప్రజాభిప్రాయం ఏమిటో స్పష్టoగా అర్ధం అవుతున్నా,అధికార కోటలు కూలుతున్నవెటకారాలతో తృప్తి పడుతున్నారు.తిరుగులేని ప్రజాదరణతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి పై కేవలం నాలుగేళ్లలోనే ఇంత ప్రజా వ్యతిరేకత రావడానికి కారణం ఆయనలో వున్నఅహంకారంమే .

జగన్ కాలికి బలపం కట్టుకుని ఆ యాత్రా ఈ యాత్రా అంటూ ఏళ్ల తరబడి జనం లో తిరిగిన జగన్‌ను చూసి జనం జాలిపడ్డారు.కానీ అతడిలోవున్న అంతర్ముఖుడిని చూడలేకపోయిన ప్రజలు జగన్ రెడ్డిని జనోద్దారకుడిగా గుర్తించి గంపలు కొద్దీ ఓట్లు వేసి గెలిపించారు. అవినీతికి తావులేని పాలన అందిస్తానని అవినీతిని వ్యవస్థీకృతం చేశారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని తన బానిస వ్యవస్థగా మార్చేశారు. గిట్టనివారిపైకి జేసీబీ, ఏసీబీ, పీసీబీలను ప్రయోగించారు. ప్రత్యర్థులకు చెందిన పరిశ్రమలు, కంపెనీలపైకి పీసీబీని ప్రయోగించారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాదుడే బాదుడు అని గత ప్రభుత్వాన్ని విమర్శించిన జగన్‌రెడ్డి, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సంక్షేమం అనే మత్తు లో సమస్త పన్నులు పెంచి పేదప్రజల నడ్డి విరిచారు. ప్రజలకు వర్తమానమే కాదు,భవిష్యత్ కూడా అగమ్యగోచరంగా మార్చారు.రాష్ట్రం నాశనం అవుతుంటే ప్రజలు మాత్రం ఎన్నాళ్ళు భరిస్తారు? తమ భవిష్యత్,రాష్ట్ర భవిష్యత్ బాగుపడాలి అంటే తెలుగుదేశం పార్టీనే అధికారంలోకి రావాలని ప్రజలు భావిస్తున్నారు.

అబద్దాలు నమ్మి, అధికారం ఇచ్చి ఆగమయ్యామని, జగన్ రెడ్డి ఎదో చేస్తాడని పెద్ద మెజారిటీ తో గెలిపించినా ప్రజలకు, రాష్ట్రానికి చేసిందేమి లేదని, పరిపాలన జగన్ వల్ల కాదని,సమర్ధత,అనుభవం వున్న నాయకుడికి అధికారం ఇవ్వడం లో పొరపాటు పడ్డామని ప్రజలు గుర్తించారు. అందులో భాగంగానే జగన్ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత పతాక స్థాయికి చేరిందని చెప్పడానికి మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు, ఇప్పుడు పంచాయితీల ఉపఎన్నికల ఫలితాలే నిదర్శనం అని చెప్పాలి.

రాష్ట్ర రక్షకుడు చంద్రబాబే నని ప్రజలు గుర్తించారు. అందుకే అనుభవం, సమర్ధుడు,దార్సనికుడు చంద్రబాబు మళ్ళి అధికారంలోకి రావాలని భావిస్తూ తెలుగుదేశానికి మద్దతు తెలిపేందుకు ప్రజలు సిద్దమవుతున్నట్లు పంచాయితీ ఫలితాలు రుజువు చేస్తున్నాయి.ఇంకా జగన్ రెడ్డికి మద్దతు ఇస్తే జరిగే పరిణామాలు ఏమిటో ప్రజలు గుర్తించారు. అందుకే విజ్ఞత ప్రదర్శించి విపత్తు నివారించు కొంటున్నారు ప్రజలు.

మాట తప్పను,మడమ తిప్పను,విశ్వసనీయత, విలువలు,నన్నే నమ్మండి అంటూ జగన్ వేసిన వల్లే వేతలను ప్రజలు విశ్వసించడం లేదు. అభివృద్దికి అనుభవజ్ఞుడు కావాలన్న ఆకాంక్షతోనే తెలుగుదేశం వైపు చూస్తున్నారు.ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. మంచి పాలకులను ఎన్నుకునే స్వేచ్చ ప్రజలకే వుంది.

వైసిపి పంచాయితీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని రకాలుగా అధికారం ప్రయోగించినా,భారీగా డబ్బు ఖర్చు చేసినా ప్రజాగ్రహం ముందు మనీ పవర్, మజిల్ పవర్ నిలవ లేదు. మళ్ళీ అధికారం నాదే, సి‌ఎం పీఠం నాదే అంటూ 175 సీట్లు ఎందుకు గెలవలేమని విర్రవీగుతున్న అధికార పార్టీ నాయకుల అధికార గర్వం నేలమట్టం కాబోతుంది. ప్రజాస్వామ్యంలో సుప్రీం అయిన ప్రజలు రాక్షస రాజకీయాన్ని సహించేది లేదని ఓటు ద్వారా రుజువు చేశారు.

ఒక పక్కన జగన్ రెడ్డి అహంకార కోటలు కూలుతున్నా ప్రజల తీర్పును గౌరవించకుండా ఇంకా కుంటి సాకులు వెతుకడం సిగ్గు చేటు. రెండున్నరేళ్ళ నాడు జరిగిన గ్రామీణ ప్రాంతాల్లో వున్న సహజ వనరులు దోపిడీ చెయ్యడం కోసం కోట్లాది రూపాలు ఖర్చు చేసి ఎన్నికల్లో గెలిచింది వైసిపి. గత రెండున్నరేళ్లుగా అధికార పార్టీ నాయకులు పంచభూతాలను దోపిడీ చేశారు.

తివిరి ఇనుమున కాసులు పిండుకొంటున్న మాఫియా శక్తుల ఆగడాలకు నదుల గర్భశోకం మిన్నంటుతుంది రాష్ట్రంలో. గ్రామాల్లోఇసుక తవ్వకాలకు అడ్డు పడిన వారిని ఖతం చేసే స్థాయిలో మాఫియా కసాయి తనం చెలరేగిపోతుంది.అందుకే చిన్న పంచాయతీల్లోనూ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటే గ్రామాల్లో వున్నసొత్తును దోచుకోడానికే అని అర్ధంఅవుతుంది.

ఏది ఏమైనా జగన్ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్దపడుతున్న విషయం పంచాయితీ ఉప ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి. ఈ ఫలితాలు తెలుగు దేశం శ్రేణుల్లో నూతనోత్సాహం నింపాయి.

నీరుకొండ ప్రసాద్,
సీనియర్ జర్నలిస్ట్,
9849625610

LEAVE A RESPONSE