ఇంతకీ వైఎస్సార్ పార్టీకి ఇప్పుడు బలమైన ప్రత్యర్థి ఎవరు..ఎవరిలో ఆ పార్టీ అధినేత జగన్ ప్రమాదాన్ని ఎక్కువగా చూస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే జన్మవైరి నారా చంద్రబాబు నాయుడు కంటే జనసేన అధినేత అధినేత పవన్ కళ్యాణ్ లోనే బద్ధవైరి కనిపిస్తుట్టున్నాడు వైఎస్సార్ పార్టీకి..! అందుకే..పవన్ కళ్యాణ్ కదలికల పట్ల ఇటీవలి కాలంలో అధికార పార్టీలో అప్రమత్తత పెరిగిపోయింది.. ఆయన కాలు కదిపితే ఆటంకాలు..నోరు మెదిపితే ఉలికిపాటు..!
ఇటు వైఎస్సార్ పార్టీ ..ఆటు తెలుగుదేశం..నడిమద్దిలో జనసేన..ఎవరికి వారు ఎన్నికల కసరత్తుకు శ్రీకారం చుట్టేసినట్టే..! ముఖ్యంగా అధికార వైసిపి కాస్త జోరుగా కనిపిస్తోంది. ఎన్నికలు మామూలుగా 2024 లో జరగాల్సి ఉన్నా అంతకంటే ముందుగా ఎప్పుడు జరిపించుకోవాలన్నది ముఖ్యమంత్రి జగన్ కంటే బాగా తెలిసిన వారెవరు ఉంటారు.షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికలకు ముఖ్యమంత్రి జగన్ గంట కొట్టేస్తారని అంచనా.. బహుశా వచ్చే ఏడాది ఏప్రిల్ ..మే సమయంలో ఉండవచ్చని కొన్ని వర్గాల ఊహాగానం..? ముందస్తు ఎన్నికల సన్నాహంలో భాగంగానే ఈమధ్య జగన్ పథకాల వేగం పెంచారు. ఉచితాలు కూడా ఊపందుకున్నాయి. మరోవైపు మూడు రాజధానుల మూడుముక్కలాట టెస్ట్ మ్యాచ్ మందకొడి గమనం నుంచి..వన్డే వేగం దాటి.. టి 20 దూకుడుకు చేరింది. ఆ స్పీడు గత కొంత కాలంగా మంత్రుల మాటల్లో కనిపిస్తోంది.మొన్న విశాఖ గర్జనతో సన్నివేశం సిద్ధమైపోయినట్టే..!
అధికారపార్టీ ఈ సన్నద్ధతలో భాగంగా తన వ్యూహాలు పటిష్టం చేసుకోవడంతో పాటు ప్రతిపక్షాల జోరు పెరగకుండా పగ్గాలు వేసే పనిలో కూడా గట్టిగా నిమగ్నం అయింది.ఒక పక్క తెలుగుదేశం నుంచి నాయకులను ఆకర్షించే వ్యూహాలు అమలు చేస్తూనే, మరో పక్క పవన్ కళ్యాణ్ దూకుడుకు కళ్లెం వేయడంపై ఎక్కువ దృష్టి పెడుతోంది అధికార పార్టీ..! పవన్ కళ్యాణ్ సభలకు హాజరవుతున్న జనం నానాటికీ పెరుగుతున్నారు. ఇది కొంత కలవర పెట్టే పరిణామమే అయినా గతంలో చిరంజీవి సభలకు.. 2019 కి ముందు సైతం పవన్ మీటింగులకు కూడా ప్రజల హాజరు భారీ స్థాయిలోనే ఉందన్నది అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఎన్నికల ఫలితాలు కూడా ఎలా ఉన్నాయనేది ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అయితే 2019 కి..ఇప్పటికీ పరిస్థితిలో చాలా మార్పు ఉందన్నది కాదనలేని మాట. జగన్ మూడున్నర సంవత్సరాల పాలనను పరిగణనలోకి తీసుకుంటే గ్రాఫ్ కొంత పడిందనేది విశ్లేషకుల వ్యాఖ్యానం. అభివృద్ధి కంటే జగన్ ఉచితాలపైనే ఎక్కువగా ఆధారపడతున్నారనేది ప్రధాన విమర్శ..అలాగే రాజధాని విషయంలో జరుగుతున్న రాజకీయాలు మరిన్ని విమర్శలకు తావిస్తున్నాయి.అధికారం చేతిలో ఉండి..అసెంబ్లీలో తిరుగులేని బలం కలిగి ఉన్న పరిస్థితుల్లో చెయ్యాల్సింది నేరుగా చెయ్యకుండా ప్రభుత్వమే ఆందోళనకు దిగడం దేనికో..ఇదే ఇప్పుడు జనంలో నలుగుతున్న ప్రశ్న.. ఎవరూ అడ్డుకోలేని కార్యక్రమానికి ఎవరో అడ్డం పడుతున్నారనే బూచిని చూపడం ప్రభుత్వ సంకల్పంలోని డొల్లతనానికి అద్దం పడుతోందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
అదే సమయంలో జనసేన అధినేత వేగం పెంచారు. ఓట్ల మాటెలా ఉన్నా ఆయన సభలకు జనం విపరీతంగా హాజరు అవుతుండడంతో అధికార పార్టీలో కొంత కలవరం పెరిగిందన్నది కాదనలేని నిజం.అందుకు ప్రత్యక్ష సాక్ష్యం గత రెండు రోజులుగా విశాఖలో జరుగుతున్న హై డ్రామా.. అంతేకాదు..ఈ మధ్యన పవన్ ఏం మాటాడినా అధికార పార్టీ నేతలు.. ముఖ్యంగా మంత్రుల్లో కలవరపాటు పెరిగింది. వైసిపి నేతలు ఆయనకి విపరీతమైన ప్రాధాన్యత ఇస్తూ ఎక్కువగా ఆయన్ని ఢీకొనే పనిలోనే నిమగ్నమై ఉన్నారు.మంత్రులు..ఇతర నాయకులు ఇలా వ్యవహరించడం ముఖ్యమంత్రి ఆదేశాల వల్లనే అన్నది తేటతెల్లం.. మరి పవన్ విషయంలో అధికార పార్టీ దగ్గర ఏం నివేదికలు ఉన్నాయో..!?
ఈఎస్కే
జర్నలిస్ట్