-నంద్యాల జనం బేజారు
– మూడు రోజుల ముందు నుంచే కిలోమీటర్ పరిధిలో ఆంక్షలు
సీఎం జగన్ పర్యటనతో రోడ్డుకి ఇరువైపులా ఉండేవారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి పోలీసులు భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడమే కారణం అవుతోంది. నివాస గృహాలు, వాణిజ్య సముదాయాల నుంచి ఎవరిని బయటకు రాకుండా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.తాజాగా సీఎం నంద్యాల పర్యటన కోసం మూడు రోజుల ముందే, కిలోమీటర్ పరిధిలో బారికేడ్లను ఏర్పాటు చేసి, షాపులను తొలగిస్తుండటంతో.. ప్రజలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసా మూడో విడత నగదు బదిలీ కార్యక్రమంలో పాల్గొనేందుకు.. సీఎం జగన్ రేపు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు రానుండటంతో, ఆంక్షలు విధించారు.మూడు రోజుల ముందు నుంచే బారికేట్లు ఏర్పాటు చేశారు.
సీఎం పర్యటన కోసం ఆళ్లగడ్డ మార్కెట్ యార్డులో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బహిరంగ సభను సిద్ధం చేశారు. హెలీప్యాడ్ నుంచి సభా వేదిక వరకు కిలోమీటరుకు పైగా దూరం ఉంది.సీఎం ప్రయాణించే ఈ మార్గంలో ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు.కళాశాల ఎదురుగా ఉన్న 8 దుకాణాలను తాత్కాలికంగా తొలగించి దారి ఏర్పాటు చేశారు. మూడు రోజుల ముందు నుంచే రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాట్లు చేయడం వల్ల వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.