Suryaa.co.in

Andhra Pradesh

క్షమాపణలు చెప్పాకే జగన్‌ పల్నాడులో అడుగుపెట్టాలి

-ఈ ప్రాంతానికి తీరని ద్రోహం చేశారు
-ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదు
-వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు

మాటిచ్చి మోసం చేసిన పాపానికి పల్నాడు, వినుకొండ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన తర్వాతే ముఖ్యమంత్రి జగన్‌ ఈ గడ్డపై అడుగు పెట్టాలని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు డిమాండ్‌ చేశారు. పల్నాడు జిల్లాకు తీరని అన్యాయం చేసిన జగన్‌ అసలు ఏ మొహం పట్టుకుని ఇక్కడకు వస్తున్నారని నిప్పులు చెరిగారు. ఈ నెల 13న బీసీ గర్జన సభ నిమిత్తం ముఖ్యమంత్రి జగన్‌ వినుకొండకు రానున్నారన్న సమాచారంతో శనివారం మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

గోదావరి-పెన్నా అనుసంధానానికి నిధులెక్కడ?
గడిచిన ఐదేళ్లుగా ముఖ్యమంత్రి జగన్‌, ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పల్నాడు ప్రాంతానికి తీరని ద్రోహం చేశారని అగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు ప్రాంతం కరవు తీర్చడం కోసం గోదావరి – పెన్నా అనుసంధానానికి నకిరికల్లు వద్ద శంకుస్థాపన చేసిన చంద్రబాబు రూ.6 వేల కోట్ల నిధులు కూడా కేటాయిస్తే ఆ పథకాన్ని జగన్‌ అటకెక్కించారని వాపోయారు. ఈ రోజు ఆ ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే గోదావరి నీళ్లు నకిరికల్లు వద్ద సాగర్‌లో కలిపితే జూన్‌లో ఇక్కడ పంటలు పండిరచేవారని, కృష్ణా నది నీటి కష్టాలకు కూడా పరిష్కారం లభించి ఉండేదన్నారు. కానీ అది జరకపోవడం వల్ల పల్నాడు ప్రాంతా నికి తీరని అన్యాయం జరిగిందన్నారు. శంకుస్థాపన చేసిన తర్వాక కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అనుమతులు కోసం రూ.14 కోట్లు కట్టమంటే 14 రూపాయలు కూడా ఇవ్వకపోవడం మోసం, దగా కాదా? అని ప్రశ్నించారు.

వంద పడకల ఆసుపత్రికి వంద అయినా ఇచ్చావా?
వంద పడకల ఆస్పత్రికి సంవత్సరం క్రితం వెల్లటూరు రోడ్డులో వంద కోట్లు ఇస్తామని ప్రకటించి వంద రూపాయలైనా ఇవ్వక పోవడాన్ని ఏం అనాలో చెప్పాలన్నారు. అలానే బొల్లాపల్లి చెరువుకు ప్రధానకాల్వ నుంచి నీటిసరఫరాకు రూ.10 కోట్లు ఇస్తామని 365 రోజులు గడిచినా రూ.3 కూడా ఇవ్వలేదని ఎద్దవా చేశారు. ఫలితంగా బొల్లాయిపల్లి సహా వినుకొండలోని అనేక మండలాల్లో గుక్కెడు తాగునీటి కోసం అల్లాడిపోతున్నాయని, పల్నాడును అంతగా వంచించిన వ్యక్తి క్షమాపణలు చెప్పకుండా వినుకొండ గడ్డపై ఏ విధంగా అడుగు పెడతారని ప్రశ్నించారు. మైనార్టీ గురుకుల పాఠశాలకు నిధులు ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం మోసం కాదా? మైనార్టీల కోసం స్థలం ఎందుకు కేటాయించ లేదో ఎమ్మెల్యే బొల్లా చెప్పాలన్నారు. దానికి పదికోట్లు ఇస్తామని పది రూపాయలు కూడా ఎందుకు విదల్చలేదని నిలదీశారు. ముఖ్యమంత్రి మోసాలపై ఎమ్మెల్యే బొల్లా ప్రశ్నించారా, వంద పడకల ఆస్పత్రికి వందకోట్లు, మైనార్టీ గురుకులానికి పదికోట్లపై అడిగారా అని ప్రశ్నించారు.

మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ బొల్లాపల్లి మండలం తాగునీటి కష్టాలు తీర్చడానికి రూ.10 కోట్లు ఇస్తామన్నారు…తారురోడ్డు నిర్మాణానికి రూ.20 కోట్లు మంజూరు చేశారు… 100 పడకల ఆస్పత్రి, ముస్లిం మైనారిటీ కళాశాల మంజూరైనట్లు చెప్పిన ఎమ్మెల్యే బొల్లా నిధులు మంజూరు చేయకుండానే చేశారని పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. కనీసం వంద పడకల ఆస్పత్రి తెస్తే ఎక్కడ ఉందో చూపించాలని సవాల్‌ చేశారు. రింగ్‌ రోడ్డు తెచ్చానని ఊదరగొడుతున్న బొల్లా అదెక్కడుందో చూపిం చాలని డిమాండ్‌ చేశారు. బొల్లా నిజ స్వరూపాన్ని ఇప్పటికైనా నియోజకవర్గ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు మానుకొండ శివప్రసాద్‌, షమీమ్‌ ఖాన్‌, పఠాన్‌ అయూబ్‌ ఖాన్‌, పత్తి పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE