జ‌గ‌న్‌…తుగ్ల‌క్ 3.0 వెర్ష‌న్

-మాట‌త‌ప్పుడు, మ‌డ‌మ‌తిప్పుడుకి బ్రాండ్ అంబాసిడ‌ర్
-టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్
అస్త‌వ్య‌స్త‌మైన నిర్ణయాలు, విధ్వంసంతోకూడి అరాచ‌క పాల‌న‌, రివ‌ర్స్ అడ్మినిస్ట్రేష‌న్‌, మాట త‌ప్పుడు, మ‌డ‌మ‌తిప్పుడుతో జ‌గ‌న్ ఆధునిక‌కాలం తుగ్ల‌క్ 3.0 వెర్ష‌న్ గా పేరుగాంచార‌ని టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ విమ‌ర్శించారు. గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం తాడేప‌ల్లిలోని మహానాడు, సుందరయ్య నగర్ లో ఆయ‌న ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడారు. ఆకాశంలో ఉన్న జగన్ గారు భూమ్మీదకి దిగివ‌చ్చిన‌ప్పుడే ప్ర‌జ‌ల‌కు క‌ష్టాలు తెలుస్తాయ‌న్నారు. రెండున్నరేళ్లలో తాడేపల్లి కొంప నుండి బయటకు అడుగు పెట్టలేద‌ని ఎందుకని ప్ర‌శ్నించారు. సొంత జిల్లా ప్రజలు కష్టాల్లో ఉంటే పట్టించుకోని ముఖ్యమంత్రిని మొట్ట‌మొద‌టిసారి చూస్తున్నామ‌న్నారు. వరదలతో రాయలసీమ, నెల్లూరు జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే జగన్ రెడ్డి గాల్లో ఒక రౌండ్ కొట్టొచ్చి ఇంట్లో పడుకున్నార‌ని ఎద్దేవ చేశారు.
హుద్ హుద్ , తిత్లీ వచ్చినప్పుడు సీఎంగా చంద్రబాబు ప్ర‌భావిత‌ప్రాంతాల‌కు వెళ్లి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకూ అక్కడే ఉండి వచ్చార‌ని గుర్తు చేశారు. తిత్లీ వచ్చినప్పుడు 21 రోజుల్లో వెయ్యి కోట్ల నష్ట పరిహారాన్ని రైతులకు అందజేసిన ఘ‌న‌త తెలుగుదేశం ప్ర‌భుత్వానిద‌న్నారు. ఇప్పుడు కనీసం నష్ట పరిహారం అంచనా వేసే నాధుడు కూడా ముంపుప్రాంతాల‌కు రాలేదంటే, ప్ర‌జ‌లప‌ట్ల ఎంత నిర్ల‌క్ష్యంగా వుంటున్నారో అర్థ‌మ‌వుతోంద‌న్నారు. పంట‌లు న‌ష్ట‌పోయిన రైతాంగానికి తక్షణమే పరిహారం అందించాల‌ని డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి అధికారంలోకొచ్చిన నుంచీ ఇసుక దగ్గర నుండి నిరుద్యోగం వరకూ ప్ర‌జ‌లు ఎదుర్కోని స‌మ‌స్య‌లేద‌న్నారు. రాష్ట్రానికి ఒక్క కొత్త‌ పరిశ్రమా రాలేద‌ని, తమిళనాడు లో ఇండస్ట్రియల్ సమ్మిట్ పెడితే 25 వేల కోట్ల పెట్టుబడులు ఆ రాష్ట్రానికి వెళ్లాయంటే పాల‌న ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చ‌న్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు , విద్యుత్ ఛార్జీలు, ఇంటి పన్ను, చెత్త పన్ను ,ఆర్టీసీ చార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు చాల‌వ‌న్న‌ట్టు ఇప్పుడు మళ్లీ వాహన రిజిస్ట్రేషన్ మీద పన్నుపెంచి ప్రజలపై రోజురోజుకీ భారాల‌ని పెంచుకుంటూ పోతున్నార‌ని ఆరోపించారు.
ఎన్నిక‌ల‌కి ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని జ‌గ‌న్‌రెడ్డి సక్రమంగా అమలు చెయ్యలేద‌న్నారు. జగన్ రెడ్డికి ఏ సబ్జెక్ట్ మీదా అవగాహన లేద‌ని, మూడురాజ‌ధానులు-సీఆర్డీఏ ర‌ద్దు-శాస‌న‌మండ‌లిని ర‌ద్దు చేసి తిరిగి అవే చ‌ట్టాల‌ను మ‌ళ్లీ ర‌ద్దు చేయ‌డం తుగ్ల‌క్ చ‌ర్య‌లు కాక‌పోతే ఇంకేంట‌ని ప్ర‌శ్నించారు. ద‌క్షిణాఫ్రికా లెక్క అన్నార‌ని, మూడు రాజ‌ధానుల‌తో అభివృద్ధి అన్నారని, తీరా చ‌ట్టాల‌నే వెన‌క్కి తీసుకోవ‌డం జ‌గ‌న్ ఇచ్చిన మాట త‌ప్ప‌డం, మ‌డ‌మ తిప్ప‌డానికి బ్రాండ్ అంబాసిడ‌ర్ అని స్ప‌ష్ట‌మైంద‌న్నారు.
ముఖ్యమంత్రి నివాసం ఉండే నియోజకవర్గమైనా మంగ‌ళ‌గిరి అభివృద్ధికి దూరం కావ‌డం విచార‌క‌ర‌మ‌న్నారు. సీఎం ఇచ్చే ప్ర‌క‌ట‌న‌ల అభివృద్ధి అంతా పేపర్లకే పరిమిత‌మైంద‌న్నారు.
అభివృద్ధికి దూర‌మైన మంగ‌ళ‌గిరి
మూడురోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా బుధ‌వారం మహానాడు, సుందరయ్య నగర్, ప్రాతూరు ప్రాంతాల్లో నారా లోకేష్ సంద‌ర్శించారు. ఇటీవల మరణించిన కార్యకర్తలు, నాయకుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వేర్వేరు ప్రాంతాల‌లో త‌న‌ను క‌లిసిన ప్రజల స‌మ‌స్య‌లు విని, ప‌రిష్కారానికి కృషి చేస్తామ‌ని హామీ ఇచ్చారు. విద్యుత్ బిల్లు ఎక్కువొచ్చిందని, రకరకాల కారణాలు చూపి పెన్షన్, రేషన్ కార్డు, సంక్షేమ కార్యక్రమాలు కట్ చేస్తున్నారంటూ మహానాడు ప్రాంత ప్రజలు లోకేష్‌కి ఎదుట వాపోయారు.
ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తాడేపల్లి ప్రాంతానికి తాగునీరు అందించేందుకు టీడీపీ ప్రభుత్వం 110 కోట్లు కేటాయిస్తే, క‌మీష‌న్ల కోసం వైసీపీ స‌ర్కారు ఆ ప్రాజెక్ట్‌నే నిలిపేసింద‌ని ఆరోపించారు. లోకేష్ వస్తే ఇళ్లు కొట్టేస్తాడు అని ప్రచారం చేసిన మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ద‌గ్గరుండి ఇళ్లు కూల‌గొట్టిస్తుండ‌డం దారుణ‌మ‌న్నారు. మంగ‌ళ‌గిరి నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం కోసం టిడిపి పోరాడుతుంద‌ని భ‌రోసా ఇచ్చారు. త్రాగునీరు కూడా సరిగ్గా ఇవ్వడంలేద‌ని, రోడ్లు వెయ్యడం లేద‌ని, రెండున్నర ఏళ్లుగా ఒక్క అభివృద్ధి కార్యక్రమం జ‌ర‌గ‌లేద‌ని ఆరోపించారు. పేద‌ల‌కు ఇళ్ల పట్టాలు ఇస్తామని మోసం చేసి, వారు క‌ట్టుకున్న‌ ఇళ్ల‌నే అన్యాయంగా తొలగిస్తున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.