Suryaa.co.in

Editorial

జగన్‌తో ఉద్యోగ సంఘాల జంగ్

-మొహమాటం ముసుగు తొలగించిన ఉద్యోగ సంఘాలు
-ఉద్యోగుల జీతాలకు 70 వేల కోట్లు సరే.. సలహాదారులు, వాలంటీర్ల ఖర్చు సంగతేంటి సారూ?
-ఏపీలో సలహాదారులకు వాలంటీర్లకు 20వేల కోట్లు
-ఏడాదికి ఒక్కో వాలంటీర్ కు రూ.60వేల రూపాయలు
-రాష్ట్రవ్యాప్తంగా 2.67 లక్షల మంది వాలంటీర్లు
-సలహాదారులకు నెలకు రూ.2 లక్షల రూపాయల నుంచి రూ.3 లక్ష లు
-ఒక్కో సలహాదారుపైనే ఏడాదికి కనీసం రూ.36 లక్షలు ఖర్చు
-ఉద్యోగులు ఖజానాకు భారమన్న సంకేతాలెందుకు?
-రెక్కలు ముక్కలు చేసుకుని నెలజీతం తీసుకునే మాపై ఏడుపెందుకు?
-వైసీపీకి సేవ చేసే వాలంటీర్లకు ఇచ్చే జీతాలు ఖజానాకు భారం కాదా?
(మార్తి సుబ్రహ్మణ్యం)

ఉద్యోగుల జీతాలకే బోలెడవుతోంది. ఖజానా అంతా వారి జీతాలకే సరిపోతోందన్నది వైసీపీ సర్కారు చేస్తున్న దుష్ప్రచారం. ఉద్యోగులకు జీతాలివ్వడమనేది జగనన్న సీఎం అయిన తర్వాతే వచ్చింది కాదు. కానీ జగనన్న సర్కారు మాత్రం ప్రజల ముందు ఉద్యోగులను దోషిగా చూపించే ప్రయత్నం దుర్మార్గం. రెక్కలు ముక్కలు చేసుకుని నెలజీతం తీసుకునే మాపై ఏడుపెందుకు? ఉత్తి పుణ్యానికి నెలకు లక్షలు తీసుకునే సలహాదారులతో ఖజనాకు భారం కాదా? 50 కుటుంబాలకు సేవ చేసే వాలంటీర్లకు ఇచ్చే జీతాలు ఖజానాకు భారం కాదా? అన్నది ఉద్యోగులు సంధిస్తున్న ప్రశ్న.

అసలు వారి అర్హతలేంటి? మేం అర్హత పరీక్ష లు రాసి ప్రభుత్వోద్యోగం సంపాదిస్తే, పదో తరగతి కూడా చదువుకోని వారికి, వందల కోట్లు ఖర్చు పెడుతున్నారన్నది ఉద్యోగుల ప్రశ్న. నిజమే కదా? వారి ప్రశ్నలో లాజిక్కు ఉంది. మరి సమాధానం ఇచ్చే మొనగాడెవరన్నదే ప్రశ్న.

తమపై వైసీపీ సర్కారు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ, ఎవరెవరికి ఎంతెంత జీతాలు ఇస్తున్నారో ప్రజలకు వివరించేందుకు జేఏసీ నేతలు, ఆందోళన కార్యక్రమాలను వేదికగా మార్చుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల కంటే.. సలహాదారులు, వాలంటీర్ల జీతాలే ఖజానాకు భారమన్న ప్రచారాన్ని, విస్తృతం చేయాలని అమరావతి జేఏసీ నిర్ణయించింది.

ఆ మేరకు ఒకటవ తేదీనే జీతాలు చెల్లించాలని, పీఆర్సీ, పెండింగ్ బకాయిలను చెల్లించాలంటూ చేస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో.. ఈ జీతాల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వం సంకటంలో పడింది. .

ఏపీలో ఉద్యోగులకు ఇచ్చిన హామీల్ని వైసీపీ సర్కార్ నెరవేర్చలేదని ఆరోపిస్తూ వారు రోడ్డెక్కుతున్నారు. దీంతో వీరిని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఉద్యోగులపై పెడుతున్న ఖర్చుకు సంబంధించి లెక్కల్ని లీక్ చేస్తోంది.

దీనిపై స్పందించిన ఉద్యోగులు మీ వాలంటీర్లు, సలహాదారులకు ఇస్తున్న లెక్కలు మాత్రం చెప్పరా అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలకు మాత్రం వాస్తవాలు తెలుస్తున్నాయి.
ఏపీలో ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆందోళనలు చేస్తున్న ఏపీ జేఏసీ అమరావతి .. ఈ క్రమంలో ప్రభుత్వం తమపై చేస్తున్న ప్రచారాన్ని తప్పుపడుతోంది.. ఉద్యోగులకు సకాలంలో జీతాలివ్వని ప్రభుత్వం, తమపై రూ.70 వేల కోట్లు ఖర్చుపెడుతున్నట్లు ప్రచారం చేయడాన్ని జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు తప్పుబట్టారు. కేవలం ఉద్యోగులకే రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు ఉద్యోగులపై రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం చేస్తున్న ప్రచారంపై మండిపడిన ఉద్యోగ నేత బొప్పరాజు.. మరి మీ వాలంటీర్లు, సలహాదారులపై రూ.20 వేల కోట్లు ఖర్చు పెడుతున్న విషయం చెప్పరా అంటూ ప్రశ్నించారు. దీంతో ప్రభుత్వం ఇంత భారీ ఎత్తున వాలంటీర్లు, సలహాదారులపై ఖర్చు పెడుతోందా అన్న చర్చ మొదలైంది. దీంతో పాటే మరికొన్ని లెక్కలు కూడా త్వరలోకి బయటికి వచ్చేలా కనిపిస్తున్నాయి.

వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 2.67 లక్షల మంది వాలంటీర్లతో పాటు లెక్కలేనంతగా సలహాదారుల్ని నియమించింది. వీరిలో వాలంటీర్లకు నెలకు రూ.5వేల చొప్పున గౌరవ వేతనంగా అందిస్తున్నారు. అంటే ఏడాదికి ఒక్కో వాలంటీర్ కు రూ.60వేల రూపాయలు ఇస్తున్నారు. అలాగే సలహాదారులకు నెలకు రూ.2 లక్షల రూపాయల నుంచి రూ.3 లక్షల వరకూ ఇస్తున్నారు. ఈ లెక్కన కేవలం ఒక్కో సలహాదారుపైనే ఏడాదికి కనీసం రూ.36 లక్షలు ఖర్చవుతోంది.

LEAVE A RESPONSE