Suryaa.co.in

Andhra Pradesh

మద్య నిషేధం హామీ అమలు ఏమైంది జగన్…?!

దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తానని చెప్పి అదే … మద్యం ఆదాయంపైన వేల కోట్ల రూపాయల అప్పులా?
రేపు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన జగన్ చేసిన అప్పులన్నీ తిరిగి చెల్లించాల్సిందే
లక్ష రూపాయల మద్యం విక్రయించి 700 రూపాయల మద్యం విక్రయించినట్లుగా రశీదులా ?
బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి తనిఖీ లో బయటపడ్డ వాస్తవాలు
మద్యం కుంభకోణంపై సిబిఐ విచారణ జరిగేలా పురందరేశ్వరి చర్యలు తీసుకోవాలి
రానున్న ఎన్నికల్లో ఓటుకు పదివేలు కాకపోతే 20000 ఇచ్చి జగన్మోహన్ రెడ్డి కొనుగోలు చేస్తారు
డబ్బులు తీసుకొని ఓటు వేయడం నేరం… అవి మీరు దాచుకున్న డబ్బులే తీసుకోండి కానీ ఓటు మాత్రం జగన్ కు వేయకండి
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

గత ఎన్నికలకు ముందు దశలవారీగా మద్య నిషేధం చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు అదే మద్యంపై భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని తాకట్టుపెట్టి 40,000 కోట్ల రూపాయల అప్పులు చేశారని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు అన్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత , మద్య నిషేధం అమలు చేయాలన్న, జగన్మోహన్ రెడ్డి చేసిన 40 వేల కోట్ల రూపాయల అప్పులను తిరిగి చెల్లించాల్సిందేనని ఆయన తెలిపారు.

శుక్రవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాలు ముగియడంతో ఇక నా ప్రస్తుత పార్టీని కేంద్రంలోని అధికార బిజెపి నాయకత్వం పట్టించుకోవలసిన పని లేదన్నారు. దానికి టీజర్ అన్నట్లుగానే నరసాపురంలోని ఒక మద్యం దుకాణానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి వెళ్లి ఆకస్మికంగా తనిఖీ చేయడమే కాకుండా, కొంత సరుకును కొనుగోలు చేసి బద్దలు కొట్టారు.

ఎంత మద్యాన్ని విక్రయించారని షాపులో మద్యాన్ని విక్రయిస్తున్న వారిని ఆమె ప్రశ్నించగా లక్ష రూపాయల సరుకు అమ్మినట్లు తెలిపిన వారు రశీదు ఎంతకు ఇచ్చారన్న ప్రశ్నకు మాత్రం కేవలం 700 రూపాయలకేనని చెప్పడం ద్వారా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతటి అవినీతికి పాల్పడుతుందో ఇట్టే అర్థమవుతుంది. మద్యం విక్రయాలకు డిజిటల్ పేమెంట్స్ ను అంగీకరించని రాష్ట్ర ప్రభుత్వం, నగదులోని మద్యాన్ని విక్రయిస్తూ వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతోంది . ఈ విషయాన్ని నేను ప్రజలకు మొదటి నుంచి చెబుతూనే ఉన్నానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

మాట ఇచ్చాడంటే తప్పడని అంటే ఇదేనా?
జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చాడంటే వెనుకడుగు వేయరని ఎన్నికల ముందు పార్టీ తరఫున విడుదల చేసిన ప్రచార వీడియోలలో చెప్పుకున్నారు. మద్య నిషేధం అమలు చేస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి, ఈ నాలుగున్నర ఏళ్లలో చేసింది ఏమిటి?. జగన్ మావయ్య వస్తాడు మద్య నిషేధం చేస్తాడని ఎన్నికల ముందు చిన్నారి చేత అడ్వర్టైజ్మెంట్ లో చెప్పి ప్రచారం చేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత , అదేమద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డిదే . మహిళల పసుపు, కుంకాలు నిలబడాలంటే మద్య నిషేధం ఒక్కటే మార్గమని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు అదే మద్యంపై వేల కోట్ల రూపాయలను గడ్డిమేసినట్లుగా మేస్తున్నారు.

రాష్ట్రంలోని మద్యం దుకాణాలలో విక్రయిస్తున్న జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లలో హానీకారక పదార్థాలు అధిక మోతాదులో ఉన్నాయి. గతంలో రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యం పై ల్యాబ్ లో పరీక్షలు నిర్వహించగా, ఈ విషయం బట్టబయలు అయింది. రాష్ట్రంలో ఎవరైనా ఎక్కడైనా మద్యం సేవించాల నుకుంటే, మద్యం షాపు వారు ఇచ్చింది తాగాలి తప్పితే… మరొక బ్రాండ్ అందుబాటులో ఉండదు. గతంలో క్వాలిటీ మద్యం క్వార్టర్ 50 రూపాయలకు లభిస్తే, ఇప్పుడు అదే క్వార్టర్ నాసిరకమైన మద్యం 150 నుంచి 160 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఆడాన్ శరత్ చంద్రారెడ్డి తయారు చేస్తున్న మద్యం, విజయ్ సాయి రెడ్డి, మిథున్ రెడ్డి బినామీ కంపెనీలు తయారు చేసే మద్యాన్ని సేవించిన వారు త్వరగానే పైకి వెళ్లాల్సిన దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది.

మూడు నుంచి నాలుగు విడతలలో మద్య నిషేధం చేస్తానని హామీ ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి, 25 ఏళ్ల పాటు మద్య నిషేధం చేయబోమని చెప్పి అండర్ టేకింగ్ ఇచ్చి దాదాపు 40 వేల కోట్ల రూపాయల అప్పులు చేశారు . ఎన్నికల ముందు చెప్పింది చేయకపోతే చొక్కా పట్టుకుని నిలదీయాలన్న జగన్మోహన్ రెడ్డి… ఇప్పుడు ఆయన చొక్కా ముట్టుకోవడం కాదు కదా… శాంతియుతంగా కొవ్వొత్తి పట్టుకొని నిరసన తెలియజేస్తున్న వారిపై కూడా పోలీసు కేసులు నమోదు చేస్తున్నారన్నారు. శాంతియుతంగా నిరసన తెలియజేయడమనేది రాజ్యాంగం ప్రజలకు కల్పించిన ప్రాథమిక హక్కు అన్న విషయాన్ని పోలీసులు విస్మరించడం సిగ్గుచేటు.

లక్ష రూపాయల మద్యాన్ని విక్రయించి కేవలం 700 రూపాయల మద్యం విక్రయించినట్లుగానే రశీదులు చూపెడుతున్నారంటే, ఇలా ఎన్ని వేల కోట్ల రూపాయలను జగన్మోహన్ రెడ్డి ఆయన బినామీలు జేబుల్లో వేసుకుంటున్నారో అర్థమవుతూనే ఉందని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఇలా అక్రమంగా కూడబెట్టిన ఆదాయంతో రానున్న ఎన్నికల్లో ఓటుకు పదివేల రూపాయల కాకపోతే 20వేల రూపాయలైనా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి కొనుగోలు చేస్తారు.

ఇదంతా మహిళలు దాచుకోవాల్సిన డబ్బు. వారి భర్తల మద్య వ్యసనాన్ని అడ్డుపెట్టుకుని మద్యాన్ని నగదు ద్వారా విక్రయిస్తూ, జగన్మోహన్ రెడ్డి దోచుకున్న డబ్బు. ఎన్నికల్లో డబ్బులు పంచే వారి వద్ద తీసుకునే హక్కు మహిళలకు ఉంది. డబ్బులు తీసుకొని ఓటు వేయడం నేరం. డబ్బులు ఇచ్చిన వారికి కాకుండా వేరే వారికి ఓటు వేసి , తీసుకున్న డబ్బుకు న్యాయం చేయాలని కోరారు. మా పనికిమాలిన వారు ఇచ్చే డబ్బులను తీసుకొని, ప్రజా సేవ చేసే వారికి ఓటు వేయాలి. ఎందుకంటే ప్రజాసేవ చేసే వారి వద్ద ఎన్నికల్లో పంచడానికి డబ్బులు ఉండవని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. మహిళల తాళిబొట్టు తాకట్టు పెట్టి సొమ్ములు లాగేసిన దుష్ట దరిద్ర దామోదరులకు ఓటు వేయవద్దని ఆయన కోరారు.

మద్యం కుంభకోణంపై సిబిఐ విచారణ కోరిన పురందరేశ్వరి
రాష్ట్రంలోని మద్యం కుంభకోణంపై సిబిఐ విచారణ జరిపించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురేందరేశ్వరి కోరిన విషయం తెలిసిందేనని రఘు రామకృష్ణంరాజు అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సిబిఐ విచారణను కోరుతూ
పార్లమెంట్ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా మద్యం కుంభకోణంపై సిబిఐ విచారణను కోరుతూ పురందరేశ్వరి కూడా హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేయాలన్నారు. తాను సేకరించిన ఆధారాలను కోర్టు ముందు సమర్పించాలని సూచించారు. మద్యం కుంభకోణంపై గతంలో టిడిపి, నేను గట్టిగానే మాట్లాడాం. కానీ బిజెపి మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు గట్టిగా మాట్లాడిన దాఖలాలు లేవు. ప్రస్తుత బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి గట్టిగా మాట్లాడుతున్నందుకు ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.

స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ స్కామ్ లో సిబిఐ విచారణ కోరుతూ, పిటిషన్ దాఖలు చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ ను చాలామంది అపార్థం చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కై పిటిషన్ దాఖలు చేశారని అంటున్నారు. ఒకవేళ కోర్టు సీబీఐ విచారణకు ఆదేశిస్తే, అవినీతి నిరోధక చట్టంలోని 17 A నిబంధనను కచ్చితంగా పాటించాల్సిందే. గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిందే. అయినా సిఐడి మాదిరిగా జగన్ ఉస్కో అంటే డిస్కో ఆడడానికి సీబీఐ రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు ఏజెన్సీ కాదు. అయినా ఒక వ్యక్తిపై ఏకకాలంలో రెండు ఏజెన్సీల ద్వారా దర్యాప్తు జరిపే అవకాశమే లేదు.

ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ లో పస ఉన్నప్పటికీ, కోర్టు ముందు నిలబడే అవకాశం లేదు. ఉండవల్లి అరుణ్ కుమార్ మంచి ఉద్దేశంతోనే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని నేను భావిస్తున్నాను. ఆయనకు చెడు ఉద్దేశం ఉంటే ఉండవచ్చు. సీబీఐ విచారణకు ఆదేశించడం అన్నది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. నన్ను సిఐడి పోలీసులు చిత్రహింసలకు గురి చేసిన కేసులో అన్ని ఆధారాలతో కోర్టును ఆశ్రయించినప్పటికీ, రెండేళ్లుగా కేసు ఒక కొలిక్కి రావడం లేదు . కేసు ఒక కొలిక్కి రాకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుపడుతూనే ఉన్నారని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

సుప్రీంకోర్టులో తప్పకుండా న్యాయం జరుగుతుంది
స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ స్కామ్ కేసు రిమాండ్ రిపోర్ట్ పై చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేసిన తర్వాత రఘురామకృష్ణం రాజు స్పందిస్తూ సుప్రీం కోర్టులో తప్పక న్యాయం జరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కేసులో కోర్టు తీర్పుపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిలో 90 శాతం మంది చంద్రబాబు నాయుడు కి న్యాయం జరగాలని కోరుకున్నారు. కేవలం 10 శాతం మంది మాత్రమే జగన్మోహన్ రెడ్డి అన్యాయానికి న్యాయం జరగాలని ఆశించారు.

ఏసీబీ న్యాయస్థానం సిఐడి పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ విచారణ సందర్భంగా జైలులో ఏమైనా ఇబ్బంది ఉందా? అని చంద్రబాబు నాయుడుని న్యాయమూర్తి ప్రశ్నించినట్లు తెలిసింది. రాజమండ్రి జైలులో దారుణంగా దోమలు కుట్టేస్తుండడం వల్ల వీర వెంకట సత్యనారాయణ అనేక ఖైదీ డెంగ్యూ వ్యాధితో మరణించారు. వియత్నాం యుద్ధంలో బాంబుల వల్ల చనిపోయిన అమెరికన్ల కంటే ఎక్కువ దోమలు కుట్టి చనిపోయిన వారే ఉన్నారు. జైలులో దోమలు కాకపోతే జ్యోతిలక్ష్మి, జయమాలిని ఉంటారా? అని మూడు అడుగుల ఆజానుబావుడైన మా పార్టీ నాయకుడు ప్రశ్నించడం సిగ్గుచేటు.

స్కిల్ డెవలప్మెంట్ స్కీం అగ్రిమెంట్లో తేదీలు వేయలేదని కన్నబాబు చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి. ఫైలే మిస్సయిందని అన్నారు కదా… మీరు ఎప్పుడు ఫైల్ చూశారని కన్నబాబును రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. కోర్టులో కేసు పెండింగ్ లో ఉండగానే అసెంబ్లీ పెట్టుకొని మాట్లాడడానికి మీరు అన్నం తింటున్నారా?… పిండం తింటున్నారా?? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒక ప్రజా ప్రతినిధిగా, తోటి చట్టసభ సభ్యుడిగా నాకు బాధనిపించింది. కోర్టు తీర్పు పెండింగ్లో ఉండగానే మూడువేల కోట్ల రూపాయల కొట్టేశాడని అనడానికి బుద్ధి ఉండాలి. అసెంబ్లీలో మరొక మంత్రి జోగి రమేష్ సంస్కారహీనంగా మాట్లాడడం సిగ్గుచేటు.

అసెంబ్లీ తొలిరోజే నీకు టిడిపి సభ్యులను స్పెషల్ పూర్తిగా సస్పెండ్ చేయడం, రెండవ రోజు ఇద్దరిని సస్పెండ్ చేయడం చూస్తే మూడవరోజు మిగిలిన వారిని సస్పెండ్ చేసేలా ఉన్నారు. తెదేపా సభ్యులు తామే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తే మంచిది. అసెంబ్లీ సమావేశాల గురించి కూడా ప్రజలు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఏసీబీ న్యాయస్థానంలో కస్టడీ పిటిషన్ పై న్యాయమూర్తి తీర్పు ఉత్కంఠతను కలిగిస్తోంది.

కస్టడీ పిటిషన్ పై హైకోర్టు తీర్పు వెలువడే వరకు న్యాయమూర్తి వాయిదా వేయడం అభినందనీయం. కస్టడీ పిటిషన్ పై న్యాయమూర్తి ఊహించిన దానికి భిన్నంగా ఇచ్చి షాక్ ఇస్తారా?, లేకపోతే రెండు రోజులపాటు రిమాండ్ పొడిగిస్తారా? అన్నది చూడాలి. హైకోర్టు తీర్పు ఆశించిన దానికి భిన్నంగా వెలువడడంతో షాక్ తిన్నామని రఘురామకృష్ణం రాజు అన్నారు.

LEAVE A RESPONSE