– ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం.. వైఎస్ఆర్సీపీ కైవసం
– 30 మంది ఎంపీలం సమిష్టిగా రాష్ట్రం కోసం పోరాడతాం
– రాష్ట్ర, పార్టీ ప్రయోజనాలే ముఖ్యం
– జగన్ నమ్మకాన్ని వమ్ము చేయం.. ఈ అవకాశం ఇచ్చిన జగన్ కి కృతజ్ఞతలు
– బీసీలంటే… బ్యాక్ బోన్ ఆఫ్ సొసైటీ అని చాటిన ఏకైక సీఎం జగన్
– బీసీ వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న జగన్ దేశానికే ఆదర్శం
– వి. విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, ఆర్ కృష్ణయ్య, నిరంజన్‌రెడ్డి
ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రాజ్యసభ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. నామినేషన్ల గడువు ముగియడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు అభ్యర్థులు వి. విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, ఆర్ కృష్ణయ్య, నిరంజన్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారులు డిక్లరేషన్ అందించారు. ఈ సందర్భంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు మీడియాతో మాట్లాడారు.
రాజ్యసభ సభ్యులు వి. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆశయాలు, పార్టీ విధి, విధానాల మేరకు, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగించేలా ప్రతి కార్యక్రమం ఉంటుంది. మా మీద నమ్మకం ఉంచి, రాజ్య సభ సభ్యులుగా ఎంపిక చేసినందుకు జగన్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యమంత్రి సూచనలు, సలహాల మేరకు, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం నిరంతరం శ్రమిస్తాం.
రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు 9 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 50 శాతానికి పైగా బీసీలు అంటే, 5గురు సభ్యులు ఉన్నారు. అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. లోక్ సభలో 21 మంది సభ్యులతో కలిపి, మొత్తం 30 మంది పార్లమెంటు సభ్యులు రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన ఎజెండాగా పోరాడతాం. మేమంతా సమిష్టిగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతాం. కలిసి పనిచేస్తాం.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎజెండాను పార్లమెంటులో వినిపిస్తాం. రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు తీసుకువెళ్ళేందుకు కృషి చేస్తాం. రాష్ట్ర ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలే ముఖ్యం.
వైఎస్ రాజారెడ్డి దగ్గర నుంచి మహానేత వైఎస్ఆర్ , ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ మోహన్ రెడ్డి వరకు, గత మూడు తరాలుగా ఆ కుటుంబానికి సేవలు అందిస్తున్న తనకు, రాష్ట్రానికి, ప్రజలకు సేవలందించే భాగ్యం కల్పించిన ఆ కుటుంబానికి సదా కృతజ్ఞుడునై ఉంటాను.
రాజ్యసభ సభ్యలు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ..
వెనుకబడిన కులాలకు అన్నింటా వెన్నెముకగా నిలుస్తూ, సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగాలు, రాజకీయ పదవుల్లో జనాభా దామాషా ప్రకారం వాటా కల్పించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న బీసీలంతా జగన్కి కృతజ్ఞతగా ఉంటారు.
ఇంతకాలం బీసీలకు అవి చేస్తాం.. ఇవి చేస్తాం.. అని మాటలు చెప్పి, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే రాజకీయ నాయకులనే చూశాం. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక, బీసీల సంక్షేమం, ఆ వర్గాలకు రాజ్యాధికారం అన్నది మాటల్లో కాకుండా.. చేతల్లో అమలు చేసి చూపిస్తున్నారు. శాశ్వత ప్రాతిపదికన బీసీ వర్గాల అభివృద్ధికి పాటుపడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర పేద వర్గాల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న సంక్షేమ పథకాలుగానీ, ఇక్కడ అమలు అవుతున్న రాజకీయ రిజర్వేషన్లుగానీ దేశానికే మార్గదర్శకంగా నిలిచాయి. ఈ వర్గాల అభ్యున్నతికి జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న కృషి దేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో పేద కులాలంతా ఈరోజు ఉచితంగా చదువుతున్నారు. అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన… లాంటి పథకాలు ఎన్నో అమలు చేస్తూ, పేదలకు కార్పొరేట్ కు దీటుగా, ఉచితంగా విద్య అందించడం ద్వారా, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు పెట్టుబడిగా మారుతుందని నమ్మిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి. 1వ తరగతి నుంచి డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ చదువుల వరకు పేదలకు ఉచితంగా చదువు అందించడం ద్వారా.. ఆ వర్గాలు శాశ్వతంగా అభివృద్ధి సాధించడంతోపాటు, ఆ కులాల గౌరవం కూడా పెరుగుతుంది. ఆ కులాలు అభివృద్ధి చెందడం ద్వారా, ఆ వర్గాల మానవ వికాసానికి , సమాజ ప్రగతికి ఎంతగానో దోహదపడుతుంది.
బీసీలంటే… బ్యాక్ బోన్ ఆఫ్ సొసైటీ అని గొప్పగా భావించి, ఆ విధంగా ఆ వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి. బీసీలను గౌరవిస్తున్న ముఖ్యమంత్రి జగన్ . ఇందులో భాగంగానే, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పార్లమెంటులో విజయసాయిరెడ్డి ప్రత్యేకంగా బీసీ బిల్లు పెట్టారు. అణగారిన వర్గాల అభివృద్ధికి జగన్ మోహన్ రెడ్డి విజన్ ను దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించాలి.
ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాల ద్వారా వెనుకబడిన కులాలకు గౌరవం, అధికారం కల్పించిన నాయకుడు జగన్ . బీసీ కులాల అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకుడిగా జగన్ మోహన్ రెడ్డి శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోతారు.
వెనుకబడిన, పేద కులాల పక్షాన పార్లమెంటులో గొంతెత్తి పోరాడటానికి, ఆ కులాల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకు రావడానికి జగన్ తనకు అవకాశం కల్పించినందుకు సదా కృతజ్ఞతతో ఉంటాం.
రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు మాట్లాడుతూ..
భారతదేశంలో అత్యున్నతమైన ఎగువ సభ రాజ్యసభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నలుగురు సభ్యులు ఎంపికైతే, వారిలో ఇద్దరు బీసీలను ఎంపిక చేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వెనుకబడిన వర్గాలకు సామాజిక, ఆర్థిక అంశాలతోపాటు రాజకీయంగా ఉన్నతమైన అవకాశాలు కల్పించడం ద్వారా, ఆ వర్గాలు అభివృద్ధి చెందుతాయని నమ్మి మాకు అవకాశం కల్పించిన జగన్ మోహన్ రెడ్డి బీసీల హృదయాల్లో శాశ్వతంగా చెరగని ముద్ర వేసుకుంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజల తరఫున జగన్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి బేషరతుగా వచ్చాను. రాజ్యసభ సభ్యత్వం వస్తుందని నేను ఆశించలేదు. నా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము కానివ్వకుండా, రాష్ట్ర, పార్టీ ప్రయోజనాలను కాపాడుతూ, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తాను. నా చిన్ననాటి మిత్రుడు, పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా ఉన్న విజయసాయిరెడ్డి సహకారం మరువను.
రాష్ట్రంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా రూ. 1.46 లక్షల కోట్లను సంక్షేమ పథకాలకు మళ్ళించడం ముఖ్యమంత్రి జగన్కే సాధ్యమైంది. సంక్షేమ పథకాలకు లక్షన్నర కోట్లు ఖర్చు పెడితే.. ఇదేదో నేరం అన్నట్టుగా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, పేదవాడికి ఈ ప్రభుత్వంలో మంచి జరుగుతుంటే గర్వంగా చెప్పుకోవాలే గానీ, నిందలు వేయడం సరికాదు.