Suryaa.co.in

Andhra Pradesh

జగన్ గారూ! వాళ్ళెందుకు బడికెళ్ళలేదు?

– వైసీపీ పాలనలో 2.3 లక్షల మంది స్కూలు వదిలేశారు..
– టీడీపీ అధికార ప్రతినిధి నీలయపాలెం విజయ్ కుమార్ సూటి ప్రశ్న

మంగళగిరి: కూటమి ప్రభుత్వం వచ్చాక ఆర్థిక రంగాన్ని చక్కదిద్దింది… వైసీపీ ప్రభుత్వం ఆర్థిక రంగాన్ని అస్తవ్యస్తంగా మార్చింది. అలాగే విద్యార్థుల భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దాల్సిన విద్యా రంగాన్ని వైసీపీ ప్రభుత్వం కకావికలం చేసింది. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని అసంబద్ధ నిర్ణయాలతో అయిదేళ్ళపాటు ఆర్థిక రంగాన్ని ఘోరంగా దిగజార్చిందని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) అధికార ప్రతినిధి నీలయపాలెం విజయ్ కుమార్ ఆరోపించారు. పార్టీ ఇక్కడి కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ నాయకులు విద్యార్థుల భవిష్యత్తును అన్ని రకాలుగా నాశనం చేశారు. బొత్స సత్యనారాయణ దీనికి ఆద్యుడుగా మారాడు. విద్యార్థుల భవిష్యత్తును తాకట్టు పెట్టారు. విద్యార్థుల్ని స్కూళ్ల నుంచి పంపేశారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల విద్యార్థులకు వారికి దగ్గరలో ఉన్న స్కూళ్లను మూసివేయించారు. కూటమి ప్రభుత్వం నాలుగు నెలల్లో ఈ విషయాలపై పరిశీలన చేసింది. రెండు లక్షల మంది విద్యార్థులు స్కూల్ డ్రాపవుట్స్ గా మారారు. స్కూళ్లకు వెళ్లడం మానేశారు. వైసీపీ నిర్వాకం వల్ల బడికి వెళ్లాల్సి ఉన్న విద్యార్థులు బడికి వెళ్లలేకపోయారు. 1 నుంచి 15 ఏళ్ళలోపు వారు ఖచ్చితంగా బడికి వెళ్లాలన్న నిబంధనలకు నీళ్లొదిలారు. జగన్ విద్యార్థుల విషయంలో అతి దారుణంగా వ్యవహరించారు. విద్యార్థులను స్కూళ్లకు పంపించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. అయిదు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో నుంచి వెళ్లిపోయిన విషయం అక్షర సత్యం. ఇందుకు సాక్ష్యాధారాలు సైతం ఉన్నాయి.

మేధావులు విద్యశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కు తోడు జగన్ ఆరుగురు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నా ఉపయోగం లేకుండా పోయింది. బహుశ ఏ శాఖలో కూడా ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉండరేమో? విద్యాశాఖ దిగజారడానికి ప్రవీణ్ ప్రకాష్ హస్తం కూడా ఉంది. రెండు లక్షల మంది విద్యార్థులు జగన్ హయాంలో స్కూళ్లు మానేసినట్లు, డ్రాపవుట్స్ గా మిగిలినట్టు కూటమి ప్రభుత్వం తేల్చింది. వైసీపీ హయాంలో విద్యాశాఖ ఏం సాధించిందో ప్రజలకు తెలపాలి. సీబీఎస్ఈ, బైజూస్ లో కమీషన్లకే కక్కుర్తి పడింది. లక్షలాది మంది స్కూళ్ల నుండి వెళ్ళిపోవడం, డ్రాపవుట్స్ గా మిగిలిపోయారంటే వైసీపీ ప్రభుత్వ హయాంలోని నిర్వాకమే కారణం.

నాడు నేడు పథకం ద్వారా స్కూళ్లకు రంగులు వేసి 50 కోట్ల రూపాయలు స్వాహా చేశారు. ఇంగ్లీష్ మీడియం, మధ్యాహ్న భోజన పథకంలో కూడా అవినీతికి పాల్పడ్డారు. ట్యాబ్ లు కొనడంలో కూడా అవినీతికి పాల్పడ్డారు. వైసీపీ హయాంలో బైజూస్ ఫౌండర్ దేశంలో అప్పుల ధాటికి తాళలేక దుబాయ్ వెళ్లిపోయాడు. ప్రతి గ్రామంలో, వీధికొక పాఠశాల ఉండనవసరం లేదని జీవో నెంబర్ 117 తెచ్చి విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు గ్రామాల్లో పాఠశాలలు అవసరం లేదని కొత్త నిబంధనలు తెచ్చారు. 3వ తరగతి నుంచి అందరూ మండల కేంద్రానికి వెళ్లి చదువుకోవాలనే నిబంధన పెట్టారు.

ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక ఆర్థిక రంగాన్ని తీర్చిదిద్దడానికి అనేక కష్టాలు పడాల్సి వచ్చింది. విద్యారంగాన్ని సరిదిద్దడం అంతకంటే కష్టం అవుతోంది. జగన్ జమానాలో 2.3 లక్షల విద్యార్థులు పాఠశాలను వదిలేశారంటే.. అసలు మన భవిష్యత్ తరాలు ఏమవుతాయి? వైసీపీ హయంలో ప్రజలకు జరిగిన దారుణాలలో ఇదొకటి. ముఖ్యంగా పిల్లల విషయంలో జగన్ జమానాలో ఏపీ పాఠశాలలో విద్యార్థులు తగ్గిపోయారు. వందో, రెండు వందలో కాదు 2023 కి …4.5 లక్షల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో తగ్గిపోయారు. అసలు అప్పట్లో జగన్ కి, ఆయన విద్యా శాఖకి తెలియవు కాబోలు.

జగన్ విద్యా శాఖ సెక్రటరీ, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఏమి చేసారో తెలియదు. ఐబీ విద్యా విధానం మంచిదా, బైజ్యుస్ కంటెంట్ మంచిదా, దేంట్లో కమీషన్లు ఎక్కువ అంటూ రీసెర్చ్ చేయడంలో బిజీ అయిపోయ్యారని విజయ్ కుమార్ విమర్శించారు.
గత అయిదేళ్లుగా జగన్ రాష్ట్ర విద్యార్థుల పై చేసిన ప్రయోగాలు ఘోరం. ప్రభుత్వ బడుల నుంచి విద్యార్థులు లక్షల సంఖ్యలో వెళ్ళిపోయారు.

ఎన్ని వన్నెలు చిన్నెలు చేశారో విద్యా రంగంలో స్కూళ్ళ కు రంగులన్నారు, నాడు – నేడు అన్నారు, ఇంగ్లిష్ మీడియం, మధ్యాహ్న భోజన పథకానికి పేర్లు మార్చారు… తర్వాత సీబీఎస్‌ఈకి మారి పోదాం అన్నారు, బైజూస్‌, కంటెంట్ ఫ్రీ అన్నారు.. ఆ పేరుతో పది లక్షల టాబ్‌లులు కొన్న బైజ్యుస్ ఓనర్ ఇప్పుడు అప్పులు పాలయ్యి పారిపోయి దుబాయి లో దాక్కున్నాడు. చివర్లో కొత్తగా ఐబీ- ఇంటర్నేషనల్‌ బాకలారియేట్ అనే ప్రైవేటు సంస్థకు స్కూళ్ళను అప్పగించాలని పన్నాగం పన్నారు. పాఠశాల లో విద్యార్ధుల తగ్గుదల ఒక్క రోజులో జరగలేదు.

ఏపీ పాఠశాల విద్యా శాఖ ప్రకారమే 2021-22 నాటితో పోలిస్తే 2023 జులై నాటికి సుమారు 4.5 లక్షల మంది పైబడి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిపోయారు. 2021-22 విద్యా సంవత్సరంలో సుమారు 43 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళలోచదువుతుంటే, 2023 జులై లో 37, 80, 000 మాత్రమె చదువుతున్నారు. అంటే, రెండేళ్లలో ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళు మాకొద్దు అని ప్రైవేటుస్కూళ్ళకు వెళ్ళారు. కొంత మంది పాఠశాల విద్యకు దూరమయ్యారు. మరి జగన్, ఆయన విద్య మంత్రి, అంత పాఠశాల కార్యదర్శులు ఏమి చేశారు? జగన్ ప్రభుత్వమే నియమించిన బాలకృష్ణ కమిషన్ చెప్పిన లెక్కల ప్రకారమే మూడేళ్లలో 27 వేల మంది ఉపాధ్యాయులు తగ్గిపోయారు. సింగిల్ టీచర్ స్కూళ్లు తొమ్మిది వేలకు పైబడి ఉన్నాయి మొత్తం ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు దాదాపు 34 లక్షలుండగా, 2022 తో పోలిస్తే 5 లక్షల మంది ప్రైవేటు స్కూళ్ళలో పెరిగినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

ప్రభుత్వ పాఠశాలలు మరీ ఇంత తీసిపోయాయా? వైసీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు వెలవెల బోయాయి…. జగన్ జమానాలో నాడు- నేడు అన్నారు… కాంట్రాక్టు ఇచ్చేశాం అన్నారు… మొదటి ఫేజ్‌లో 15,000 స్కూళ్ళు కార్పొరేట్‌ స్కూళ్ళ కంటే అందంగా మార్చేసాం అన్నారు. రూ. 50,000 వేల కోట్లు ఖర్చు పెట్టేసాం… స్కూళ్ళని సమూలంగా మార్చేసాం అన్నారు… మరి విద్యార్థులు కూడా ఇలా మాయం అయిపోవడం విచిత్రం. కనీసం ఒక్క టీచర్ ను కూడా నియామకం చేపట్టలేదేంటి జగన్ మోహన్ రెడ్డి గారూ! కారణాలు ఏంటి? స్థూలంగా జగన్ ప్రవేశ పెట్టిన లోపభూయిష్ట విధానాలే కారణం విజయ్‌ కుమార్‌ ఆరోపించారు.

మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్లతో బోధన పేరుతో చేసిన హేతుబద్ధీకరణ చాలా పాఠశాలలను చరిత్ర పుటల్లోకి చేర్చింది. 3, 4, 5 తరగతులను ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతో 1, 2 తరగతుల్లో విద్యార్థులు తగ్గి మూతపడ్డాయి. గతేడాది 10 మంది లోపు విద్యార్థులున్న బడుల్లో ఈ ఏడాది ఒక్కరూ చేరలేదు. ఉన్నవారు వేరే పాఠశాలలకు వెళ్లిపోయారు. విద్యార్థులు లేరంటూ రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వందల పాటశాలల్ని మూసేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,234 పాఠశాలల్లో ప్రాథమిక పాఠశాలల విద్యార్థులను ఉన్నత పాఠశాలల్లో ప్రభుత్వం విలీనం చేసింది. తరగతులను తరలించడంతో మిగిలిన 1, 2 తరగతుల పిల్లల సంఖ్య తగ్గిపోయింది. కేవలం రెండు తరగతులే అక్కడ ఉండటం, పిల్లల సంఖ్య తక్కువగా ఉండటం, ఉపాధ్యాయుడు ఒక్కడే బోధించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలను ఆశ్రయించారు.

పిల్లలు లేరని కారణం చూపుతూ మరికొన్ని స్కూళ్ళను మళ్ళీ మోసేశారు. జీవో 117తో ఉపాధ్యాయులను తగ్గించి పిల్లలను బడికి దూరం చేసింది. ఎయిడెడ్ విద్యారంగాన్ని కోల్పోయాం. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ లేదు. ఉపాధ్యాయులను ఎందుకు రిక్రూట్ చేసుకోలేదు ? తెలుగుదేశం హయాంలో మేంఅయిదేళ్ళలో 18,000 టీచర్ లను నియమించాం. మీరు ఒక్క టీచర్ ను రిక్రూట్ చేయలేదు. తెలుగుదేశం హయాంలో 2019-20 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో మొత్తం 63,463 పాఠశాలలు ఉన్నాయి. జగన్ జమానాలో 2023-24 విద్యా సంవత్సరానికి 58,754 పాఠశాలలు మాత్రమే ఉన్నాయి. తెలుగు దేశం హయాంలో 2019-20లో 2,234 ఎయిడెడ్ పాఠశాలలు ప్రభుత్వంలో ఉన్నాయి. జగన్ జమానాలో ఆ సంఖ్య 787కు పడిపోయిందని ఆయన వివరించారు.

వీటిల్లో కేంద్ర ప్రభుత్వ పాఠశాలలు 61, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు 4,287, స్థానిక సంస్థలు జెడ్‌పీ, మండల పరిషత్‌, మున్సిపల్ ఆధ్వర్యంలో నడిచేవి 40,708, ఎయిడెడ్ విద్యాసంస్థలు 2,234, ప్రైవేట్ పాఠశాలలు 16,173 ఉన్నాయి. జగన్ జమానాలో 2023-24 విద్యా సంవత్సరానికి 58,754 పాఠశాలలు మాత్రమే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పాఠశాలలు సంఖ్య 58కు, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 3,902కు, స్థానిక సంస్థలవి 40,495, ఎయిడెడ్ 787, ప్రైవేట్ 13,509కు పడిపోయాయి. మొత్తంగా నాలుగేళ్లలో 4,709 పాఠశాలలు కనుమరుగయ్యాయి. తెలుగు దేశం హయాంలో 2019-20లో 2,234 ఎయిడెడ్ పాఠశాలలు ప్రభుత్వంలో ఉన్నాయి.

ఇప్పుడు ఆ సంఖ్య 787కు పడిపోయింది. 2019-20 విద్యా సంవత్సరంలో 1,96,750 మంది విద్యార్థులు వీటిల్లో చదవగా, జగన్ జమానాలో సంఖ్య 95 వేలకు పడిపోయింది. అందుకే ప్రైవేటు పాఠశాలల్లో 5 లక్షల మంది ఈ సంవత్సరంలో మాత్రమే చేరారు. ప్రైవేటులో మొత్తం విద్యార్థుల సంఖ్య 29 లక్షల నుండి, 34 లక్షలకు చేరింది. జగన్ ప్రభుత్వం అయిదేళ్ళ విద్యా విధానం భ్రష్టుపట్టింది. ఎన్నికల ముందే డిఎస్పీ గుర్తొచ్చింది. 6100 పోస్టులకి డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల. ఎస్టీటీలు – 2280, – స్కూలు అసిస్టెంట్స్ – 2299 – టీజీటీలు- 1264,- పీజీటీలు- 215 – ప్రిన్సిపల్ఫ్- 42 పోస్టులు అంటే ఈ పోస్టుల ఖాళీలన్నీ ఇంతకు ముందు నుంచి ఉన్నవే…. కానీ భర్తీ చేయలేదు. భర్తీని వాయిదా వేస్తూ వచ్చారు. హేతుబద్దీకరణ అంటూ టీచర్లను తగ్గించే ప్రయత్నం చేశారు.

స్కూళ్ళను విలీనం చేశారు.. మూసేశారని విజయ్‌ కుమార్‌ అన్నారు.
ఈ నాలుగు నెల్లల్లో కూటమి ప్రభుత్వం ముందుగా జీవో నెంబర్ 117 ను రద్దు చేసింది. అంటే పాఠశాల విలీనాలు ఉండవు. మూసేసిన కొత్త పాఠశాలలను తెరుస్తోంది. టీఈటీ ఫలితాలను విడుదల చేస్తోంది. కొత్తగా 16 వేల మంది టీచర్ల కోసం డీఎస్సీ పెడుతోంది. ఆ బైజూస్‌, ఐబీ లు అంటూ కమిషన్ ల కోసం చేసే పందేరాలను రద్దు చేసింది. విద్యాశాఖలో సమూల మార్పులు తెచ్చి, కమీషన్ల వ్యవస్థలను రద్దు చేసింది. వచ్చే సంవత్సరం మొదట్లో ఇవ్వాల్సిన స్కూల్ యూనిఫారం, పుస్తకాలు, షూలు, బెల్ట్ లకు ఇప్పటి నుంచే వివరాల సేకరణ మొదలు పెట్టింది. పూర్తి పారదర్శకతతో, కౌన్సిలింగ్ ద్వారా టీచర్ల బదిలీలు చేసిందని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ వివరించారు.

LEAVE A RESPONSE