Home » జగనన్న స్వచ్ఛ సంకల్పంతో క్లీన్ ఏపీ దిశగా అడుగులు..

జగనన్న స్వచ్ఛ సంకల్పంతో క్లీన్ ఏపీ దిశగా అడుగులు..

– గాంధీ జయంతి సందర్బంగా 2,600 చెత్త సేకరణ వాహనాలను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
విజయవాడ: : మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణతో కూడిన ఆరోగ్య వంతమైన సమాజాన్ని నిర్మించే దిశగా వినూత్న విధానాలను రూపొందించుకుంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.. ఇందులో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సురక్షితమైన, మరింత మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలు, సేవలు అందించడమే లక్ష్యంగా క్లీన్ ఆంద్రప్రదేశ్ (క్లాప్)- ‘‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’’ పేరిట వినూత్న కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.
మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా విజయవాడ బెంజి సర్కిల్ వద్ద ఏర్పాటు చేసే ప్రత్యేక వేదిక నుండి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి 2,600 చెత్త సేకరణ వాహనాలను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా స్వచ్ఛ గ్రామాలు.. స్వచ్ఛ నగరాలు.. స్వచ్ఛాంధ్రప్రదేశ్.. స్వచ్ఛ భారత్ నినాదంతో రాష్ట్రంలో నివసించే ప్రతి పౌరునికి, స్వచ్ఛమైన, ఆరోగ్యవంతమైన పరిసరాలు కల్పించి తద్వారా జీవన ప్రమాణాలు పెంచాలనే ఆలోచనతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
క్లీన్ ఆంధ్ర ప్రదేశ్ (క్లాప్) – ‘‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’’:
రాష్ట్రాన్ని బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత, చెత్త బుట్ట రహిత, చెత్త రహిత నగరాలుగా తీర్చిదిద్దడమే క్లాప్ – ‘‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’’ లక్ష్యం. దీని కోసం, ప్రజలందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తూ ప్రతి ఇంటికి 3 చెత్త బుట్టలు చొప్పున నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగు చెత్త బుట్టలను పంపిణీ చేసి వంద శాతం వేరు చేసిన చెత్తను సేకరిస్తారు. దీనితో పాటు చెత్తను ఇంటివద్దనే కంపోస్టు చేసుకునేలా కూడా ప్రభుత్వం ప్రజలను ప్రోత్సహిస్తుంది. అలాగే ప్రతి ఇంటి నుండి సేకరించిన తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకర వ్యర్దాలను గార్బేజ్ టిప్పర్ల ద్వారా గార్బేజి ట్రాన్స్ ఫర్ సెంటర్లకు తరలిస్తారు. తిరిగి గార్బేజి ట్రాన్స్ ఫర్ సెంటర్ల నుండి తడి చెత్తను, పొడి చెత్తను వేరు వేరు వాహనాల ద్వారా ట్రీట్ మెంట్ ప్రాజెక్టుల వద్దకు చేర్చుతారు.. అనంతరం తడి చెత్త నుంచి కంపోస్టు ఎరువు లేక బయో గ్యాస్ తయారు చేస్తారు. పొడి చెత్తలో ఉన్న హానికారక వ్యర్దాలను నిర్మూలించడంతో పాటు, వాటిలో తిరిగి ఉపయోగించదగిన వస్తువులను వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. తద్వారా రాష్ట్రంలోని గ్రామాలు, నగరాల నుంచి ఉత్పత్తి అయ్యే వ్యర్ధాలను సంపూర్ణంగా శుద్ధి చేయాలనే సంకల్పంతో క్లాప్ పని చేస్తుంది.
క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) – జగనన్న స్వచ్ఛ సంకల్పం ప్రధాన అంశాలు :
క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా చెత్త సేకరణ, రవాణా, శుద్ధీకరణ, ఆదాయ ఉత్పత్తి, పరిసరాల పరిశుభ్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం నిర్ధిష్టమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకుంటూ ముందుకు సాగుతోంది.
చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలలో ఎక్కువ భాగం సరైన నిర్వహణ లేక నిరుపయోగంగా మారగా జగనన్న ప్రభుత్వం సదరు కేంద్రాల నిర్వహణకు నలుగురు చొప్పున సిబ్బందిని నియమించి వారికి జీతాలు చెల్లించడంతో పాటు కేంద్రాల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుని తిరిగి అవి సజావుగా పనిచేసేలా పునరుద్ధరించడం జరిగింది. వీటితో పాటు, మరో 4,171 చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాల నిర్మాణాన్ని జగనన్న ప్రభుత్వం చేపట్టనుంది.
చెత్త రవాణా కోసం రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 14 వేల త్రిచక్ర వాహనాలు పంపిణీ చేస్తారు. చెత్త సేకరణ-రవాణాను మరింత మెరుగుపరిచే కార్యక్రమంలో భాగంగా 10 వేల పైచిలుకు జనాభా వున్న గ్రామాలు, పట్టణాలకు సమీపంలో ఉన్న గ్రామాలకు 1,000 ఆటోలు పంపిణీ చేయనున్నారు. మాస్కులు, శానిటరీ పాడ్ లు వంటి వ్యర్ధాల ద్వారా వ్యాధులు వ్యాప్తి చెందకుండా, వాటిని అధిక ఉష్ణోగ్రతల వద్ద కాల్చి భస్మం చేసి పర్యావరణ హితంగా మార్చేందుకు 6,417 ఇన్సినరేటర్ పరికరాలను కూడా ప్రభుత్వం పంపిణీ చేయనుంది.
అలాగే కమ్యూనిటీ టాయిలెట్ల పరిశుభ్రత కోసం 10,731 హై ప్రెజర్ టాయిలెట్ క్లీనర్లు కేటాయించారు. వర్షా కాలంలో సాధారణంగా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశమున్న నేపథ్యంలో, దోమల నివారణకు 10,628 థర్మల్ ఫాగింగ్ మిషన్లు పంపిణీ చేస్తారు. 135 మేజర్ పంచాయతీలలో సమగ్ర ద్రవ వ్యర్ధాల నిర్వహణ చేపట్టనున్నారు. మరో వైపు 10,645 గ్రామ పంచాయతీలలో వర్మి కంపోస్ట్ నిర్వహణ, రీసైక్లింగ్ కాని వ్యర్ధాలను దగ్గరలో వున్న సిమెంట్ ఫ్యాక్టరీలకు, వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లకు తరలింపు కార్యక్రమం కూడా జగనన్న ప్రభుత్వం చేపట్టనుంది.
గ్రామీణ ప్రాంతాల మాదిరిగానే, నగరాల్లో కూడా క్లీన్ ఆంధ్రప్రదేశ్ కోసం స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ప్రభుత్వం పనిచేస్తోంది.. ఆరు బయట మల, మూత్ర విసర్జనకు అడ్డుకట్టవేసేందుకు రాష్ట్రంలోని మున్సిపాలిటీల పరిధిలో జన సంచారం అధికంగా ఉన్న ప్రాంతాలలో 1,500 పబ్లిక్ టాయిలెట్లు నిర్మించనున్నారు. తడి చెత్తను, పొడి చెత్తను వేరుచేసి సేకరించేందుకు వీలుగా మున్సిపాలిటీల పరిధిలో ప్రతి ఇంటికి 3 చెత్త బుట్టల చొప్పున కోటి ఇరవై లక్షల నీలం, ఆకుపచ్చ , ఎరుపు రంగు చెత్త బుట్టలను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. చెత్త సేకరణ మరియు రవాణా మరింత మెరుగు పరిచేందుకు 3,097 ఆటో టిప్పర్లు, 1800 ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేయనున్నారు.
124 మునిసిపాలిటీలలో 231 గార్బెజ్ ట్రాన్స్ ఫర్ స్టేషన్ లు ఏర్పాటు చేయడంతో పాటు, PPP విధానంలో 72 మునిసిపాలిటీలలో ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ (ISWM) ప్రాజెక్టుల వ్యవస్థాపనకు ఏజెన్సీల ఖరారుకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. లక్ష పైచిలుకు జనాభా కలిగిన 32 మున్సిపాలిటీలలోని డంప్ సైట్ లలో వ్యర్ధాల నిర్మూలనకు టెండర్లు పిలవాలని మున్సిపాలిటీలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోని 65 నాన్ అమృత్ సిటీలలో సెప్టిక్ టాంక్ ల నుండి సేకరించిన వ్యర్ధాలను శుద్ధి చేసేందుకు ఫీకల్ స్లడ్జ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ల (FSTP) ఏర్పాటు చేయడం జరుగుతోంది.
క్లీన్ ఆంధ్ర ప్రదేశ్ (క్లాప్) – ‘‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’’ కార్యక్రమంలో భాగంగా గ్రామాలు, నగరాలను పరిశుభ్రంగా మార్చడం ద్వారా బిన్ ఫ్రీ, లిటర్ ఫ్రీ, గార్బేజ్ ప్రీగా అభివృద్ధి పరచి జాతీయ స్థాయిలో నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ వంటి పోటీలలో మన రాష్ట్రంలోని, గ్రామాలు, నగరాలను మెరుగైన స్థాయిలో నిలిపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

Leave a Reply