-జగన్ తనను గుర్తించలేదంటూ మాజీ మంత్రి సారథి ఆవేదన
-అవమానాలు ఎదురైనా జనం ఆదరించారంటూ కృతజ్ఞతలు
-వైసీపీలో అన్ని చోట్లా ఇదే ‘జగన్బాధ’
(మార్తి సుబ్రహ్మణ్యం)
ఏడవకం డేడవకండి
మీరక్తం కలగి కలగి
మీ నాడులు కదలి కదలి
మీ ప్రేవులు కనలి కనలి
ఏడవకం డేడవకండి
ఓ వ్యథానివిష్టులార!
ఓ కథా వశిష్టులార!
పతితులార
భ్రష్టులార
బాధాసర్పదష్టులార
ఏడవకం డేడవకండి
* * *
ఏడవకు ఏడవకు వెర్రి పాపాయి
ఏడిస్తే నీకళ్ల నీలాలు కారు
నీలాలు కారితే నేచూడలేను
పాలైన తాగవే బంగారు తల్లి
* * *
ఇదీ ఇప్పుడు ఆంధ్రాలో ‘జగన్నా’ద రథచక్రాల కింద నలిగిపోతున్న బాధితుల హాహాకారాలు.. మూగవేదన.. మౌనరోదన.. బహిరంగ సింహగర్జన.. బుజ్జగింపులు.. కన్నీటి కథావేశం దాదాపు ఇలా కవితాగ్రహం మాదిరిగానే కనిపిస్తున్నాయి.
ఎన్నికల ముందు వైసీపీలో ఎవరిని కదిలించినా ఇలాంటి రోదనలు, వేదనలే. కొందరు పైకి నవ్వుతూ.. మరికొందరు బహిరంగంగానే బావురుమంటూ.. ఇంకొందరు తలుపేసుకుని తనివితీరా రోదిస్తూ! ఏదైతేనేం? ఎవరైతేనేం? ఎక్కడైతేనేం? ఎప్పుడైతేనేం? అందరిదీ దాదాపు ఒకటే ‘జగన్బాధ’!
టికెట్ రాదని తెలిసి కొందరు.. వచ్చినా మరో జిల్లాకు ఐఏఎస్-ఐపిఎస్ ఆఫీసర్ల మాదిరిగా బదిలీ అయ్యామని ఇంకొందరు.. అసలు సీటు వస్తుందో రాదో తెలియక త్రిశుంకుస్వర్గంలో మరికొందరు. అందరిదీ ఒకటే వేదన. ఒకటే రోదన. దాన్ని వ్యక్తీకరించంలోనే తేడా. మిగిలినదంతా షేమ్ టు షేమ్! పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పార్ధసారథి ఓటర్ల ముందు వెళ్లబోసుకున్న గోడు ఇది. ఇప్పుడు ఆయన రోదన పెనమలూరుదాటి, పెపంచానికి చేరింది.
ఉమ్మడి రాష్ట్రంలో.. జగన్ సర్కారులో మంత్రిగా పనిచేసిన పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్ధసారథి, తన పార్టీ అధినేత జగనన్నపై ఉన్న అసంతృప్తిని, భలే సీరియస్గా వెళ్లగక్కారు. ‘ దురదృష్టవశాత్తూ మన ప్రియతమ నేత జగన్మోహన్రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ, నా నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో
పెట్టుకుని అభిమానిస్తున్నారు. ఎటువంటి అవమానాలు ఎదురైనా నన్ను కాపాడుతూ వస్తున్నారు. వాళ్లకు ఎమ్మెల్యేగా కాదు. సేవకుడిగా ఉంటా’నంటూ.. ఉబికివస్తున్న టన్నులకొద్దీ కన్నీటిని వెనక్కి నెట్టి, తనకు పార్టీలో జరుగుతున్న అవమానాలను, జగనన్న తనను పట్టించుకోని వైనాన్ని.. చెప్పకనే చెప్పినట్లు ఆయన ప్రసంగం స్పష్టం చేసింది. వైసీపీ శిబిరంలో ఇలాంటి బాధాసర్పదష్టులు ఇంకా చాలామందే ఉన్నారు. కాస్త వెనుకో, ముందో అందరిదీ ఇదే దారి!
అభ్యర్ధుల మార్పు తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి బాధాసర్పదష్టుల ‘జగన్బాధ’లు, ఇంకెన్ని వినాల్సివస్తుందోనన్నది వైసీపేయుల ఆందోళన. తాడేపల్లి ప్యాలెస్లో ఎదురయ్యే అవమానాలు, గరళకంఠుల మాదిరిగా దిగమింగుకోకుండా.. కీలకమైన ఎన్నికల ముందు ఇలా కక్కేస్తే, పార్టీ కొంప కొల్లేరవుతుందన్నది జగనన్న అభిమానుల ఆవేదన.
మంత్రి పదవులు, ఎమ్మెల్యే పద వులూ అనుభవించారు. జగనన్న కోసం ఆమాత్రం అవమానాలు భరించలేరా? అన్నది వారి ప్రశ్న. నిజమే. ఈవిధంగా టికెట్లు దొరకని వారంతా రోడ్డెక్కి, జగన్బాధలు వినిపించి.. రేపు పోలింగ్ సమయంలో కార్యకర్తలు కాడికింద పడేస్తే, పార్టీకి దిక్కెవరన్నది వారి అసలు ఆందోళన. ఎవరి లాజిక్కు పాయింట్లు వారివి!