Suryaa.co.in

Andhra Pradesh

చేనేతల అభ్యున్నతికి బాధ్యత తీసుకుంటా

– మంగళగిరి టీడీపీ కార్యాలయంలో చేనేతలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో నారా లోకేశ్ భరోసా

చేనేతలను ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా మెరుగైన స్థితిలో నిలపడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తానని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో చేనేత కార్మికులు, చేనేత సామాజికవర్గ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. చేనేతల ఆదాయం పెంచేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటానన్నారు.

అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అందుకోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తాం. ఉద్యోగులు, కార్మికులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి దేశమంతా పరిశీలించి మెరుగైన కార్యాచరణ రూపొందిస్తాం. జగన్ రెడ్డి బటన్ నొక్కి పేదలను ఉద్దరిస్తున్నానని చెప్పుకుంటూ.. మరో బటన్ నొక్కి పేదల జేబులు ఖాళీ చేస్తున్నాడు. కానీ, చంద్రబాబు పేదలను సొంత కాళ్లపై నిలబెట్టడం ద్వారానే శాశ్వత ప్రయోజనాలు సాకారమవుతాయని భావిస్తున్నారు.

జగన్ రెడ్డికి ప్రజల ఆదాయం, రాష్ట్ర ఆదాయం పెంచడంపై కనీస శ్రద్ధ లేదు. అందుకే అప్పులు ఏకంగా రూ.12 లక్షల కోట్లకు చేరాయన్నారు. హ్యాండ్ లూమ్, పవర్ లూంను వేర్వేరుగా అభివృద్ధి చేయడానికి ఉన్న మార్గాలను పరిశీలించి ఆ దిశగా ప్రోత్సాహం అందిస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చేనేత రంగాన్ని ఆధునిక పద్దతులకు, ఆధునిక పరిస్థితులకు అనువుగా డిజైన్లపై శిక్షణ అవసరమన్నారు. డిజిటల్ కాలంలో మనం కూడా కాలానికనుగుణంగా పరుగులు పెట్టాలంటే, అందుకు ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం. ఆ మేరకు ప్రోత్సాహం అందించి ఆంధ్రప్రదేశ్ చేనేత రంగాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు ఉండే అన్ని అవకాశాలను పరిశిస్తానని మాటిచ్చారు.

మాజీ ఎంపీ, నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ.. గతంలో ఎన్టీఆర్ జనతా వస్త్రాలు ప్రకటనతో రాష్ట్రంలోని చేనేతకు స్వర్ణయుగంలా మారింది. అదే పరిస్థితి మరళా సృష్టించినపుడే చేనేతలు అభివృద్ధి మార్గంలో పయనిస్తారు. చేనేతలకు ప్రపంచ స్థాయిలో ఆదరణ పెంచాలి. చేనేత కారులు ఉత్పత్తి చేసే వస్త్రాలను ఆప్కో ద్వారా కొనుగోలు చేయాలి. స్కూల్ యూనిఫాం బాధ్యతల్ని చేనేతలకు అప్పగించాలి.

ప్రస్తుత ప్రభుత్వం, అధికారులు ఉద్దేశ్యపూర్వకంగా వస్త్రం సరఫరా బాధ్యతలు చేనేతలకు దక్కకుండా చివరి నిమిషంలో ఒప్పందాలకు పిలిచి, గడువు సరిపోదనే సాకుతో పవర్ లూం వైపు వెళ్తున్నారు. ఆప్కో రూల్స్ ఉల్లంఘిస్తున్నారు. అదే సమయంలో మూతబడిన చేనేత సహకార సంఘాలను తెరిపించాలి. ఏపీలోని ధర్మవరంలాంటి ప్రాంతాల్లో ఉత్పత్తి చేసే చీరలకు సరైన మార్కెట్ లేకపోవడంతో కంచి లాంటి ప్రాంతాల నుండి వచ్చి కొనుక్కుని అక్కడి బ్రాండ్‌ పేరుతో అమ్ముకుంటున్నారు.

చేనేతల అభివృద్ధి, అభ్యున్నతికి తీసుకోవాల్సిన చర్యలపై చేనేత కార్మికుల అభిప్రాయాలు సేకరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని చేనేత కారులు ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. చేనేతలకు మరళా స్వర్ణయుగం దక్కేలా చేయాలని పలువురు కార్మికులు పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, పొలిట్ బ్యూరో సభ్యులు, బీసీ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు కొల్లు రవీంద్ర, కదిరి ఇంఛార్జి కందికుంట వెంకట ప్రసాద్, చేనేత కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ బొడ్డు వేణుగోపాల్, బీసీ సాధికార సమితి ప్రధాన కార్యదర్శులు వీరింకి వెంకట గురుమూర్తి, వాసంశెట్టి సత్య, మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ సజ్జా హేమలత, బీసీ సెల్ ఉపాధ్యక్షులు కాండ్రు శ్రీనివాస్, బీసీ సెల్ అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి, సీనియర్ నాయకులు జీవీ నాగేశ్వరరావు, దొంతు చిన్న, బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనుంజయ్ సహా పలువురు చేనేత నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE