– ఖండించిన జానపద కళాకారుల సంఘం అధ్యక్షులు జగన్మోహన్ రావు
జానపద కళాకారులను స్వామి వారికి దూరం చేయవద్దని… గతంలో మాదిరే యధావిధిగా భజనలు చేసుకునేందుకు అనుమతించాలని కోరుతూ భజన సమ్మేళనానికి టిటిడి పరిపాలనా భవనం వద్దకు విచ్చేసిన జానపద కళాకారుల పట్ల, వారికి సంఘీభావం ప్రకటించిన వివిధ సంఘాల నాయకుల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించిన తీరును జానపద కళాకారుల సంఘం అధ్యక్షులు ఎ. జగన్ మోహన్ రావు తీవ్రంగా ఖండించారు.
టీటీడీ యాజమాన్యం, పాలక పక్షాలకు లొంగిపోయి కళాకారుల ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్న పులిమామిడి యాదగిరిని విడిచిపెట్టి కళాకారుల సమస్యలపై పోరాడుతున్న తనను పోలీసులు గృహ
నిర్భంధం గావించడం ఏమిటని జగన్మోహన్ రావు ప్రశ్నించారు. ఇప్పటికైనా టిటిడి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం కళాకారుల ప్రయోజనాల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని, కళాకారుల హక్కులకి భంగం కలిగించకుండా గతంలో మాదిరి జానపద కళాకారులకు తిరుమల కొండపై భజన చేసుకునేందుకు అనుమతించాలని, రానుపోను ఛార్జీలు, స్వామివారి దర్శనం, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని జగన్మోహన్ రావు ఆ ప్రకటనలో డిమాండ్ చేశారు.
నిరుపేద కళాకారులు ఎంతో భక్తిభావంతో చేస్తున్న భజన సాంప్రదాయ యజ్ఞానికి విఘ్నం కల్పించ వద్దని, పేద భక్తుల మనోభావాలను గౌరవించాలని జగన్మోహన్ రావు పాలకమండలి ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డికి, టీటీడీ ఈవో జవహర్ రెడ్డిలకు విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భజన బృందాలు ఈ యజ్ఞంలో భాగస్వాములుగా ఉన్నాయని వారి భక్తిని పరిగణలోకి తీసుకోకుండా టిటిడి యాజమాన్యం వ్యవహరించడం సమంజసం కాదని అన్నారు.దర్శనాలను కొనుక్కునే స్థోమత జానపద కళాకారులకు లేదని, ఏడాదికోమారు తమకు కేటాయింపుల్లో భాగంగా వచ్చే భజన సాంప్రదాయాన్ని రద్దు చేయటం అధర్మమని వ్యాఖ్యానించారు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం, పాలకమండలి జానపద కళాకారుల పట్ల సానుభూతితో వ్యవహరించి గతంలో నిర్ణయించిన పద్ధతులను యధాతథంగా అమలు చేయాలని కోరారు…