గ్రామ,వార్డు సచివాలయల్లోనే రిజిస్ట్రేషన్లు: సీఎం జగన్‌

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై సీఎం జగన్‌ సమీక్ష
జగనన్న సంపూర్ణ గృహ హక్కు లబ్ధిదారులుకు క్లియర్‌ టైటిల్‌తో రిజిస్ట్రేషన్‌ దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిశీలించి జాప్యం లేకుండా అప్రూవల్స్‌ ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 21న ప్రారంభించనున్న జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ నిర్ధేశించుకున్న సమయంలో క్షేత్రస్థాయిలో ఎంక్వెరీలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఈ నెల 20 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని, డిసెంబర్‌ 15 వరకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని సీఎం అధికారులకు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.