జగన్మోహన్ రెడ్డికి మహిళా సాధికారత గురించి మాట్లాడే హక్కు లేదు

– టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ
తోడబుట్టిన చెల్లెళ్లను దగా చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మహిళా సాధికారత గురించి మాట్లాడే హక్కు లేదు. మహిళా సంక్షేమం , మహిళా ఉద్దరణ గురించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్పినవన్నీ అబద్ధాలే. అబద్ధాలు చెప్పడంలో తుగ్లక్ రెడ్డి ఆరితేరిపోయారు. జగన్ చేసిన మోసానికి ఒక చెల్లి పొరుగు రాష్ట్రంలో, ఇంకో చెల్లి ఢిల్లీ వీధుల్లో న్యాయం కావాలని తిరుగుతున్నారు.
ముఖ్యమంత్రి ముందుగా సొంత చెల్లెళ్లకు న్యాయం చెసి అప్పుడు మహిళా సాధికారత గురించి మాట్లాడితే బాగుంటుంది. మహిళా సాధికారత ఎలా ఉంటుందో టీడీపీ కార్యాచరణలో చేసి చూపించింది. అసలు మహిళా సాధికారత సాధ్యమైనదే టీడీపీతో. ఆడవాళ్లు ఎందులోనూ మగవారికి తీసిపోకూడదని నాడు అన్న ఎన్టీఆర్ ఆస్తి హక్కు కల్పించారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించి రాజకీయాల్లో నాయకత్వ బాటలు వేయడం జరిగింది. మహిళలు తమ కాళ్లపై నిలబడాలనే ఉద్దేశంతో వారి ఆర్థిక స్వావలంబనకు చంద్రబాబు డ్వాక్రా సంఘాలకు శ్రీకారం చుట్టారు.
ఆయన వేల కోట్ల రూపాయిల రుణాలు అందించి మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దితే తుగ్లక్ చర్యలతో వారిని కూలీలుగా మార్చేస్తున్నారు. డ్వాక్రా సంఘాలకు చెందిన రూ.8,706 కోట్లపై కన్నేసిన జగన్ వాటి కోసం ముప్పతిప్పలు పెడుతున్నాడు. తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లలో ఉన్నతి పథకం ద్వారా రూ.800 కోట్లు, స్త్రీ నిధి పథకం ద్వారా రూ.4,455 కోట్లు, బ్యాంకు లింకేజీ ద్వారా రూ.68,830 కోట్లు, పసుపు కుంకుమ ద్వారా రూ.18,600 కోట్లు, వడ్డీ రాయితీ ద్వారా రూ.2,514 కోట్లు, రుణమాఫీ పథకం మొదటి విడతలో రూ.3,800 కోట్లు, 2వ విడతలో రూ.2,500కోట్లు చొప్పున మొత్తంగా రూ.1,01,449 కోట్లు డ్వాక్రా మహిళల సాధికారతకు ఉపయోగపడింది నిజం కాదా.?
2021-22 ఆర్ధిక సంవత్సరానికి పొదుపు సంఘాలకు ఎంతమేర రుణాలు అందించేలా లక్ష్యం నిర్దేశించుకున్నారో, 2020-21 ఆర్ధిక సంవత్సరంలో ఎంత రుణాలు మంజూరు చేశారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. ఆసరా , చేయూత పేరుతో జగన్మోహన్ రెడ్డి మహిళలను దగా చేశారు. సున్నీ వడ్డీ పేరుతో డ్రామాలాడుతున్నారు.
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రెండున్నరేళ్లలో మహిళలపై 530కి పైగా జరిగిన అఘాయిత్యాలు, దాడులు శాంతిభద్రతల నిర్వహణలో ప్రభుత్వ డొల్లతనాన్ని బయటపెడుతున్నాయి. ముఖ్యమంత్రి ఇంటి వెనుక మహిళ గ్యాంగ్ రేప్ కు గురయ్యి నెలలు గడుస్తున్నా నిందితుడు వెంకట్ రెడ్డి పట్టుకోలేని ముఖ్యమంత్రి మహిళా సాధికారత గురించి మాట్లాడటం సిగ్గుచేటు.
రాజకీయ లబ్ధి కోసం చట్టమే కాని దిశా పేరుతో ప్రచారార్భాటం చేశారు. నిర్భయ నిధి కింద కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు రూ. 112 కోట్లు కేటాయిస్తే వాటిలో రూ. 38 కోట్లే ఎందుకు వినియోగించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మద్య నిషేదమని నమ్మించి మద్యం ఆదాయం 15 ఏళ్లపాటు బ్యాంకులకు తాకట్టు బెట్టారు. జగన్ రెడ్డికి చెందిన మద్యం కంపెనీల్లో తయారయ్యే నాశిరకం మద్యం పోస్తూ మహిళల మాంగల్యాలను మంటగలుపుతున్నారు. మహిళా రక్షణ గాలికొదిలేసి అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు చెబుతారా? మాయమాటలతో మహిళలను దగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పరాభవం తప్పదు.