-రాష్ట్రాన్ని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేశారు
-మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత నారా లోకేష్
మంగళగిరి: స్వార్థ రాజకీయాల కోసం సమాజాన్ని కుల,మతాల పేరుతో చీల్చి రాష్ట్రాన్ని విధ్వంసం చేయడమే జగన్మోహన్ రెడ్డి అజెండా అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి శ్రీచక్ర అపార్ట్ మెంట్ వాసులతో యువనేత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… జగన్ పరిపాలన ప్రజావేదిక కూల్చివేతతో మొదలైంది. కులముద్ర వేసి అమరావతి రాజధానిని నాశనం చేశారు.
కోవిడ్ సమయంలో కోవ్యాక్సిన్ తయారుచేసి ప్రపంచానికి తెలుగోడి సత్తాచాటిన భారత్ బయోటెక్ పై కూడా కులముద్ర వేశారు. దీంతో ఎపిలో 1200 కోట్లతో యూనిట్ పెట్టాలనుకున్న ఆ సంస్థ ఒరిస్సాకు తరలివెళ్లింది. జగన్ వినాశాకర చర్యల కారణంగా రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాకపోగా, ఇక్కడి పరిశ్రమలు కూడా పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి. మన బిడ్డలు ఉద్యోగాల కోసం తమిళనాడు, బెంగుళూరు, కర్నాటక వెళ్లాల్సిన దుస్థితి కల్పించారు. అభివృద్ధి చేయడం చేతగాని జగన్ ఎపిని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చి యువత భవిష్యత్తును నాశనం చేశారు.
3రాజధానుల పేరుతో మూడుముక్కలాట ఆడిన జగన్ ఎక్కడా ఒక్క ఇటుక కూడా పెట్టలేదు. విశాఖలో రుషికొండను బోడిగుండుచేసి 500 కోట్లతో ప్యాలెస్ మాత్రం కట్టుకున్నాడు. అమరావతి రాజధానిని కొనసాగించి ఉంటే 5లక్షలమందికి ఉపాధి అవకాశాలు లభించేవి. జగన్ విధానాల కారణంగా రాష్ట్రం 30ఏళ్లు వెనక్కివెళ్లింది. అభివృద్ధి అంటే కూల్చివేతలు కాదు.
2014లో రాష్ట్ర విభజన ఆంధ్రులు కోరుకున్నది కాదు. కట్టుబట్టలతో ఆనాడు బయటకు గెంటివేయబడిన పరిస్థితుల్లో అందరినీ ఒప్పించి చంద్రబాబు అమరావతి రాజధానికి శ్రీకారం చుట్టారు. దీనికి జగన్ కూడా సంపూర్ణ మద్దతు తెలిపారు. 99శాతం మంది రైతులు స్వచ్చందంగా భూములిచ్చారు. రాజధాని డిజైన్,మాస్టర్ ప్లాన్ కోసం చంద్రబాబు రేయింబవళ్లు కష్టపడ్డారు. పనులు వేగంగా ముందుకు సాగుతున్న సమయంలో ఒక్కచాన్స్ పేరుతో అధికారం చేపట్టిన జగన్ 5కోట్లమంది ప్రజల భవిష్యత్తును దెబ్బతీశారు. ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం. ఎన్నికల తర్వాత అమరావతి రాజధానిని పూర్తిచేసి తీరుతాం.
చంద్రబాబునాయుడు సైబర్ టవర్స్ కడితే కంప్యూటర్ అన్నం పెడుతుందా అని ఎగతాళి చేశారు, నేడు హైదరాబాద్ ఐటి పరిశ్రమ 10లక్షలమంది యువత ఉపాధి పొందుతున్నారు. విజనరీ నాయకుడికి, విధ్వంస పాలకుడికి తేడాను యావత్ రాష్ట్రప్రజలు గమనించాల్సి ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా సిలబస్ లో మార్పులు చేయాల్సి ఉంది. తొలిఏడాదిలోనే కెజి టు పిజి సిలబస్ ను ప్రక్షాళన చేస్తాం. నైపుణ్యంతో కూడిన విద్యను అందించి యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం. అభివృద్ధి, సంక్షేమాలను బ్యాలెన్స్ చేస్తూ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్తాం. గతంలో జగన్మోహన్ రెడ్డి అబద్దాలు చెప్పి నమ్మించినంతగా మేం వాస్తవాలను ప్రజలకు చెప్పలేకపోయాం, ఇది ఖచ్చితంగా మా బలహీనతేనని యువనేత లోకేష్ చెప్పారు.