3న పవన్‌ కళ్యాణ్‌ తెనాలి పర్యటన

-రోడ్‌ షో, బహిరంగ సభలను జయప్రదం చేయాలి
-జనసేన పీఏసీ చైర్మన్‌, తెనాలి అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ నెల 3 తేదీ తెనాలి పర్యటనను విజయవంతం చేయాలని జనసేన పీఏసీ చైర్మన్‌, తెనాలి ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ కోరారు. తెనాలి పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాయంత్రం నాలుగు గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా తెనాలి చేరుకుంటారని, వారాహి వాహనంపై రోడ్‌ షో ద్వారా మార్కెట్‌ సెంటర్‌లో పుర వేదిక వద్దకు చేరుకుంటారని వివరించారు. సాయంత్రం 6 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారని వెల్లడిరచారు. బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్‌కళ్యాణ్‌ తొలిసారిగా తెనాలిలో పర్యటిస్తున్నారని తెలిపారు. ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలపై బహిరంగ సభ ద్వారా వివరిస్తారని చెప్పారు.

పెన్షన్లపై వైసీపీ దుష్ప్రచారం తగదు
పెన్షన్ల పంపిణీపై వైసీపీ ప్రభుత్వం జగన్‌ నాయకత్వంలో ప్రజల్లో అనుమానాలు రేకెత్తించేలా దుష్ప్రచారం మనోహర్‌ విమర్శించారు. ఆ నెపాన్ని అధికారులను కించపరిచే విధంగా ప్రతిపక్షాల మీద నెట్టడం సరికాదన్నారు. ఎలక్షన్‌ కమిషన్‌ వాలంటీర్ల దగ్గర ఉన్న ప్రభుత్వానికి సంబంధిం చిన ఫోన్లు, ట్యాబ్‌లు మాత్రమే స్వాధీనం చేసుకోవాలని, వారితో పెన్షన్లు పంపిణీ చేయరా దని, ఎన్నికలకు సంబంధించిన ఎటువంటి విధుల్లో కూడా పాల్గొనకూడదని మాత్రమే ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఇందులో ప్రతిపక్షాల పాత్ర ఏముంటుందని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్లు పంచిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో వాలంటీర్లు మాత్రమే ఉన్నారా? మిగతా ఉద్యోగులు ఏమయ్యారు? వారితో పంచే కార్యక్రమం ఎందుకు చేపట్టలేదు? దుష్ప్రచారం ఆపి ప్రభుత్వ అధికారులు బాధ్యత తీసుకుని 3వ తేదీ లోపు పెన్షన్‌ ఇచ్చేలా ప్రక్రియ మొదలుపెట్టాలని కోరారు. పెన్షన్‌ ఇవ్వని పక్షంలో అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Leave a Reply