Suryaa.co.in

Andhra Pradesh

మంగళగిరికి పరిశ్రమలు రావని ఆర్కే చెప్పడం హాస్యాస్పదం

-పరిశ్రమలు తీసుకువచ్చి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది
-నేను చేసిన మంచిపనులు చూసి నన్ను ఆశీర్వదించండి!
-మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత నారా లోకేష్

తాడేపల్లిః ప్రజలకు సేవచేయాలని మంగళగిరి వచ్చా, గత ఎన్నికల్లో ఓడిపోయినా 4.11 సంవత్సరాలుగా ప్రజల వెన్నంటే ఉండి సేవలందిస్తున్నా, నేనుచేసిన మంచిపనులు చూసి నన్ను గెలిపించాలని యువనేత నారా లోకేష్ విజ్ఞప్తిచేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడేపల్లి శ్రీచక్ర అపార్ట్ మెంట్ వాసులతో యువనేత సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… పదేళ్లపాటు ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గానికి ఒక్క పనిచేయలేని అసమర్థుడు ఎమ్మెల్యే ఆర్కే, ఎన్నికలు రావడంతో నిన్న ఒక ఆపార్ట్ మెంటుకు వెళ్లి మంగళగిరి నియోజకవర్గానికి పరిశ్రమలు, ఐటీ సంస్థలు రావని చెబుతున్నారు, ఇంతకంటే సిగ్గుచేటైన విషయం మరేదైనా ఉందా? కాంటినెంటల్ కాఫీ, కోకోకోలా యూనిట్లు ఎలా వచ్చాయి, గత ప్రభుత్వ హయాంలో మేం ఐటి పరిశ్రమలు ఎలా తెచ్చాం? ఎన్నికల తర్వాత ఈ ప్రాంతానికి పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. శాసనసభ్యుడికి ముందుచూపు ఉండాలి. నేను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు మంగళగిరి ఆటోనగర్ కి పరిశ్రమలు, ఐటీ సంస్థలు తీసుకువచ్చా. ఆదివారం టిడ్కో ఇళ్ల వద్ద ప్రచారానికి వెళ్లినప్పుడు అక్కడ ఐటీ పార్క్ లో ఏర్పాటుచేసిన ఐటీ పరిశ్రమల సముదాయంతో సెల్ఫీ ఛాలెంజ్ కూడా చేశా. ఆర్కే చేతగాని చర్యల కారణంగా మంగళగిరి యువత ఉద్యోగాలు, ఉపాధి కోసం హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు వెళ్లే పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వంలో మంగళగిరిని దక్షిణ భారతదేశంలోనే గోల్డ్ హబ్ గా చేసి 50వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం.

కూల్చివేతలకు పేటెంట్ జగన్, ఆర్కేలదే!
మంగళగిరిలో లోకేష్ గెలిస్తే ఇళ్లు కూల్చేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారు. కూల్చివేతలకు పేటెండ్ జగన్, ఆళ్ల రామకృష్ణారెడ్డిలదే. తాడేపల్లిలోని జగన్ ఇంటి వద్ద, ఆత్మకూరు, ఇప్పటంలో పేదల ఇళ్లు ఎవరు కూల్చారో చెప్పాలి. వైకాపా నాయకుల దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలి. గత 25 ఏళ్లుగా రెండు కుటుంబాలకు అధికారం ఇచ్చారు. నేను చేసిన సేవా కార్యక్రమాల్లో 10 శాతం కూడా గెలిచినవారు చేయలేదు. మంగళగిరిలో 29 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. టాటాతో ఒప్పందం చేసుకుని 25 మగ్గాలతో వీవర్స్ శాళ ఏర్పాటుచేశాం. మంగళగిరిని బ్లాక్ డెవలప్ మెంట్ విధానంలో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తాం. భూగర్భ డ్రైనేజీ, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందిస్తాం. నన్ను, ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ ను గెలిపించాలి. దేశంలోనే మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేస్తాం.

యువనేత ఎదుట అపార్ట్ మెంట్ వాసుల విన్నపాలు
శ్రీచక్ర అపార్ట్ మెంట్ వాసులు సమస్యలను చెబుతూ… తమ ప్రాంతంలో రిక్రియేషన్ పార్కులు ఏర్పాటుచేయాలి. తాడేపల్లి పట్టణంలో పన్నులు హైదరాబాద్ లో కూడాలేవు, పన్నుల భారం తగ్గించాలి. దేశరక్షణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన వారి ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. యువనేత లోకేష్ స్పందిస్తూ అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో గంజాయి ముఠాల ఆటకట్టిస్తాం. గంజాయిపై ఇప్పటికే ప్రధాని, హోంమంత్రికి లేఖరాశా. బ్లాక్ డెవలప్ మెంట్ మోడల్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజి, రోడ్లు, తాగునీటి వసతి,పార్కులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. గత ఎన్నికల్లో ఓడిన చోటే గెలిచి నన్ను విమర్శించే వారికి సమాధానం చెబుతానని లోకేష్ అన్నారు. జనసేన ఇన్ ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ… అమరావతిని నాశనం చేయడం ద్వారా ఒకతరం భవిష్యత్ నాశనం అయింది. నేడు రాజధానిలో సెక్యూరిటీ ఆంక్షల మధ్య తిరగాల్సిన పరిస్థితి. ఉద్యోగ, ఉపాధి కోసం యువత పొరుగు రాష్ట్రాలకు తరలిపోతోంది. పెట్టుబడులు వచ్చే పరిస్థితులు లేవు. సంక్షేమం పేరుతో అభివృద్ధిని విస్మరించారు. గత ఎన్నికల్లో ఓడినా లోకేష్ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని సేవలందిస్తున్నారు. బిడ్డల భవిష్యత్తు కోసం లోకేష్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

LEAVE A RESPONSE