జగన్ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని కుదేలు చేసింది

– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జివి రెడ్డి

జగన్ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని కుదేలు చేసిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జివి రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాటలు మీ కోసం…!

‘విద్యుత్ రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాటలకు, చేస్తున్న పనులకు పొంతన లేదు. ఎన్నికలకు ముందు విద్యుత్ చార్జీలు పెంచను, విద్యుత్ రంగాన్ని మెరుగుపరుస్తానని చెప్పి రొంబా మోసం చేశారు. చంద్రబాబునాయుడు ముందుచూపుతో యూనిట్ ధర 5 రూపాయలు చొప్పున కొనుగోలుకై అగ్రిమెంట్ చేసుకున్నారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఇందులో ఏదో పెద్ద స్కామ్ జరిగినట్లు విమర్శిస్తూ హంగామా చేశారు. ప్రస్తుతం యూనిట్ ను 20 రూపాయలు చొప్పున కొనే పరిస్థితులను తీసుకొచ్చారు. యూనిట్ 5రూపాయలు ఉన్నదాన్ని జగన్ 20 రూపాయలకు కొనేలా చేశారంటే ఆయన పాలనలోని అసమర్థతకు అద్దం పడుతోంది. సులభతరంగా వున్న విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేసి కష్టతరం చేశారు. దీన్ని జెన్ కో, విద్యుత్ శాఖ అధికారులు కూడా విమర్శిస్తున్నారు. విద్యుత్ పంపిణీ సంస్థలైన జెన్కో, డిస్కమ్స్ లకు ప్రభుత్వం అధిక ధరలు వెచ్చించాల్సి వస్తోంది. తద్వారా విద్యుత్ వినియోగదారులు, విద్యుత్ ఉద్యోగులు మోసపోతున్నారు.

చేతకానితనంతో విద్యుత్ రంగాన్ని దారుణంగా నాశనం చేశారు. ఉద్యోగులను, వినియోగదారులను మోసం చేయడంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట. కృష్ణపట్నం విద్యుత్ పోర్టు నిర్మాణం పూర్తయింది. ఇందులో విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటే 3 రూపాయల 80 పైసలు పడుతుంది. ఇందుకు డిస్కమ్ లు కొంత పెట్టుబడి పెడితే సరిపోతుంది. ప్రభుత్వం అలా చేయకుండా ఈ పోర్టును ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతోంది. కృష్ణపట్నం విద్యుత్ పోర్టు సూపర్ క్రిటికల్ విద్యుత్ కేంద్రం. ఇది భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడే అవకాశాలున్నాయి. విద్యుత్ యూనిట్ కు 20 రూపాయలు పెట్టినా దొరకని పరిస్థితులు నేడు నెలకొన్నాయి. కృష్ణపట్నం విద్యుత్ పోర్టు సూపర్ క్రిటికల్ విద్యుత్ కేంద్రాన్ని 20 సంవత్సరాలకు ప్రైవేటు వాళ్లకు ఇవ్వాలని చూస్తున్నారు. పరోక్షంగా ప్రైవేటువారికి అమ్మేయాలని చూస్తున్నారు. గతంలో గంగవరం పోర్టును కూడా అలాగే అమ్మేశారు. ఇప్పుడు కృష్ణపట్నం సూపర్ క్రిటికల్ విద్యుత్ కేంద్రంను కూడా అమ్మేయాలని చేస్తున్నారు. బొగ్గు కొని విద్యుత్ తయారు చేసుకునే సదుపాయం ఉన్నప్పుడు వారికి ఇవ్వాల్సిన అవసరమేమొచ్చింది? జగన్ రెడ్డి చేష్టలతో విద్యుత్ రంగాన్ని అతలాకుతలం చేశారు. పీపీఏలను రద్దు చేసి నాశనానికి పునాది వేశాడు.

జెన్-కోను, డిస్కంలను, వినియోగదారులను, ఉద్యోగులను ఎవరిని వదలిపెట్టడం లేదు. మోటార్లకు మీటర్లు పెట్టి వాటిని ప్రైవేటు వారికి అప్పజెప్పాలని జగన్ రెడ్డి కుట్ర పన్నాడు. ఇది అత్యంత దుర్మార్గం, ఇది రైతుల మెడకు ఉరితాళ్లు వేయడమే. రాజశేఖర్ రెడ్డి హయాంలో కంటే కూడా టీడీపీ హయాంలోనే ఉచిత విద్యుత్ ను బ్రహ్మాండంగా ఇచ్చాం. కేంద్రం పెట్టిన షరతులకు తలొగ్గి వారు ఇచ్చే అప్పు కోసం కేంద్ర సంస్కరణల్లో భాగంగా రైతుల మోటార్లకు మీటర్లు బిగించి రైతుల మెడకు ఉరితాళ్లు బిగిస్తున్నారు. ఇంత కుండ మార్పిడి దేనికో చెప్పాలి. వందశాతం మీటర్లు పెడితే రైతులపై నిండా భారం పడుతుంది. గతంలో ఉచితంగా బోర్లు వేయిస్తామని చెప్పి రైతులను మోసం చేశారు. రైతులను నట్టేట మంచుతున్నారు. టీడీపీ హయాంలో గృహ వినియోగదారులకు ఐదు సంవత్సరాల్లో ఒక్క సారి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదు.

పారిశ్రామికరంగానికి కూడా సక్రమంగా విద్యుత్ ను అందించి ఆదుకున్నాం. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు జెన్ కో, డిస్కమ్ ఉద్యోగస్థులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు చేయలేదు. మూడున్నర సంవత్సరాలు దాటినా దాని ఊసే లేదు. రెగ్యులరైజ్ చేయకపోగా రెగ్యులరైజ్ గా ఉన్న వారినే తొలగిస్తున్నారు. తెలుగుదేశం హయాంలో డిస్కమ్, జెన్కో లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేశాం. నేడు ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ఉద్యోగస్థులు రోడ్డున పడే స్థితిని తీసుకొచ్చారు. వారికి టీఏలు, డీఏలు రావడంలేదు. పీఆర్సీ ఇవ్వడంలేదు, కనీసం జీతాలైనా సరైన సమయంలో చెల్లిస్తారా అంటే అదీ లేదు. క్యాజ్ వెల్ లేబర్లకు 15, 16వ తేదీలల్లో జీతాలిస్తున్నారు. ఉద్యోగస్థులు ప్రభుత్వాన్ని నమ్మడంలేదు. జెన్కోను, విద్యత్ పంపిణీ సంస్థలను, ఉద్యోగస్థులను, వినియోగదారులను ముంచారు. విద్యుత్ లో ఏం సంస్కరణలు చేశారో ప్రభుత్వం చెప్పాలి. విద్యుత్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగస్థులు జాగ్రత్తపడాలి. రూపాయికో, అర్ధరూపాయికో విద్యుత్ సంస్థలను తెగనమ్మి ఉద్యోగస్థులను రోడ్డున పడేస్తారు. ప్రైవేటు వ్యక్తుల నుంచి ముడుపులు తీసుకుని రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్లను ప్రైవేటు వారికి అప్పచెబుతున్నాడు. నేడు రాష్ట్రంలో ఎక్కడా నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగటం లేదు.

కమీషన్ల కోసం విద్యుత్ పరికరాలు రెండింతలు, మూడింతల రేట్లు పెట్టి కొంటున్నారు. ఎస్సీ, ఎస్టీలకు, రైతులకు సబ్సిడీలు అరకొరగా మాత్రమే ఇస్తున్నారు. మూడున్నరేళ్లలో ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి విద్యుత్ వినియోగదారులపై భరించలేని భారాన్ని మోపారు. టిడిపి హయాంలో ఆక్వా రైతులకు ప్రీగా ఇచ్చిన ట్రాన్స్ ఫార్మర్లకు నేడు రూ. 2 లక్షల వసూలు చేయడం అన్యాయం. చంద్రబాబునాయుడు ఆక్వా రంగానికి విద్యుత్ యూనిట్ 2 రూపాయలకే ఇచ్చేవారు. ఎస్సీ, ఎస్టీలకు సబ్జిడీ తొలగించారు. ఆక్వా రంగ రైతులను దెబ్బతీయాలనేదే వైసీపీ ప్రభుత్వ ఉద్దేశం. ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేయాల్సిందిపోయి అణగదొక్కుతున్నారు. ఆర్థికంగా ఎవరూ బలపడకూడదన్నదే వైసీపీ నాయకుల ఉద్దేశం. రియల్ ఎస్టేట్, సినిమా పరిశ్రమ కూడా కుదేలైంది. ఇసుక దొరక్క, పనులు లేక భవన నిర్మాణ కార్మికులు, కాంట్రాక్టర్లు అనేకమంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి రంగంలో ప్రతి వ్యక్తిని ఆర్థికంగా ఎదగనివ్వకుండా దెబ్బకొడుతున్నారు. వంద రూపాయలు కట్టాల్సిన విద్యుత్ బిల్లు 4వందలు కట్టాల్సి వస్తోంది. సంక్షేమ పథకాల పేరుతో ఇస్తున్న డబ్బులను ఈ విధంగా జనాల నుండి లాగేస్తున్నారు.

గతంలో చంద్రబాబునాయుడును ఏమీ చేయలేనప్పుడు రాజీనామా చేసి వెళ్లాలన్నారు. ఇలా అయితే జగన్ ఎన్నిసార్లు రాజీనామా చేయాల్సివస్తుందో తెలియదు. జగన్ చాలా అంశాల్లో విఫలమయ్యారు. విద్యుత్ సంస్కరణలో విషయంలో ఘోరంగా విఫలమయ్యారు. 7 సార్లు విద్యుత్ చార్జీలు పెంచాల్సిరావడంవలన విద్యుత్ శాఖామంత్రి రాజీనామా చేయాలి. విద్యుత్ ధరలు పదిరెట్లు పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. జగన్ రెడ్డిని పదవి నుంచి దించకపోతే రాష్ట్రం అంధకారలో మునిగిపోతుంద’ని జాతీయ అధికార ప్రతినిధి జి.వి రెడ్డి తెలిపారు.

Leave a Reply