వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలూ సమాన అభివృద్ధి

-వికేంద్రీకరణకు మద్దత్తుగా రాయలసీమ వాసులు ర్యాలీలు, దీక్షలు
-ఎంపీ విజయసాయి రెడ్డి

విశాఖపట్నం, నవంబర్ 17: వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలకు సమాన అభివృద్ధి సాధ్యపడుతుందని ఈ దిశగా చర్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యజ్ఞంలా చేపడుతున్నారని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా గురువారం పలు అంశాలు వెల్లడించారు. వికేంద్రీకరణే రాయలసీమ అభివృద్ధికి దిక్సూచి అని సీమ ప్రజానీకం ర్యాలీలు, దీక్షలు, సమావేశాలు ద్వారా చాటిచెప్పారని అన్నారు. శ్రీబాగ్ ఒడంబడికకు 85 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సీమ వ్యాప్తంగా ర్యాలీలు, మానవహారాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, చర్చా కార్యక్రమాలు, సత్యాగ్రహ దీక్షలు నిర్వహించారు. భవిష్యత్తులో వేర్పాటువాదం రాకుండా పాలనా వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలన్న సీఎం జగన్ సంకల్పానికి పెద్ద ఎత్తున మద్దతు పలికారని అన్నారు.

జీ 20 దేశాల సదస్సులో ప్రధాని మోదీ అంతర్జాతీయ స్థాయిలో  భారతదేశం సత్తాను, సాధించిన విజయాలను ప్రపంచదేశాలకు తెలియజేశారని విజయసాయి రెడ్డి అన్నారు. ప్రపంచంలో 5వ అతిపెద్ద ధనిక దేశంగా గుర్తింపు పొందిన భారతదేశపు ప్రధాని నరేంద్ర మోదీ 140 కోట్ల ప్రజలకు ప్రతినిధిగా సదస్సులో ఏమి చెబుతారో అని ప్రపంచ దేశాలు ఉత్సుకతతో ఎదురుచూశాయని అన్నారు.

చంద్రబాబుకు ఇదే చివరి ఎన్నిక
తేదేపా అధినేత చంద్రబాబు నాయుడుకి రానున్న 2024 ఎన్నికలే చివరి ఎన్నికలని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. 2019లో  ” బైబై బాబు” అని చెప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 2024 ఎన్నికల్లో బాబుకు “గుడ్ బై” చెబుతారని అన్నారు.