-టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు కళావెంకట్రావు
తిరుమలలో కొలువై యున్న శ్రీ వెంకటేశ్వరస్వామి భక్తుల సౌకర్యం కోసం నిర్మించిన వసతి గృహాల రేట్లను భారీగా పెంచి భక్తులపై మరింత అధిక భారం మోపడం దురుద్దేశపూరితం. మొన్న లడ్డూ రేట్లు పెంచారు, నిన్న బస్ చార్జీలు పెంచారు. నేడు వసతి రేట్లుపెంచి తిరుమల వెంకన్నను భక్తులకు దూరంచేసే ప్రయత్నం చేస్తున్నారు.
రూ.50 నుంచి రూ.200 ఉండే అద్దెగదుల రేట్లను రూ.750 నుంచి రూ.2,300కు పైగా పెంచటం దుర్మార్గం. భగవంతుడ్ని భక్తులను దూరంచేయడానికి గత మూడేళ్లుగా కొనసాగుతున్న చర్యల్లో భాగమే అద్దెగదుల రేట్ల పెంపు.
ఇలాంటి చర్యల వల్ల బాలాజీని దర్శించుకునే కోట్లాది భక్తుల మనసుల్లో అపోహలు, అనుమానాలు కలిగే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం తితిదేకు వేలాదికోట్ల ఆదాయం, ఆస్తులను కలిగిస్తున్న భక్తులకు సరైన వసతి సౌకర్యాలు కల్పించాల్సిన తితిదే దానికి విరుద్ధంగా వసతి గృహాలను భక్తులకు అందుబాటులో లేని విధంగా చేయటం దుర్మార్గం.
గత మూడున్నరేళ్లుగా బాదుడేబాదుడు అంటూ పన్నులు పెంచి ప్రజలపై మోయలేని భారాలను మోపిన జగన్ రెడ్డి ప్రభుత్వం…ఇప్పుడు తిరుమలను కూడా వ్యాపారసంస్థగా మార్చి భగవంతుడ్ని భక్తులకు దూరం చేయడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. పెంచిన అద్దెగదుల రేట్లను తిరుపతి తిరుమల దేవస్థానం వెంటనే విరమించుకోవాలని తెలుగుదేశం డిమాండ్ చేస్తోంది.