పేదల బియ్యాన్ని విదేశాలకు తరలించి, రూ. 6వేలకోట్లు కొట్టేసిన జగన్ రెడ్డి

• 2022 లో కేంద్రం పేదలకోసం పంపిణీ చేసిన ఉచిత బియ్యాన్ని, విదేశాలకు తరలించి సొమ్ముచేసుకున్న జగన్ రెడ్డి అండ్ కో
• కరోనా దృష్ట్యా కేంద్రం ఉచితంగా అందించిన బియ్యాన్ని, 9నెలల పాటు ఇవ్వకుండా విదేశాలకు తరలించి సొమ్ముచేసుకున్నారు
• జగన్ రెడ్డి బియ్యం మాఫియాపై కేంద్రం కొరడా ఝళిపించికపోతే, పేదలు ఆకలితో చావడం ఖాయం
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు

జగన్ రెడ్డి ఎంతమాయగాడో, అతని ప్రజలకు అమలుచేస్తున్న పథకాలు, సంక్షేమం కూడా అంతకు పదింతలమాయతో సాగుతోందని, కేంద్రప్రభుత్వం పేదలకు పంచమన్న రేషన్ బియ్యాన్ని విదేశాలకు తరలించి, ముఖ్యమంత్రి రూ.6వేలకోట్లు కొట్టేశాడని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు తెలిపారు. జూమ్ ద్వారా శనివారం ఆయన విలేకరులతో మాట్లాడిన వివరాలు…

“జగన్ రెడ్డి పాలన ఆసాంతం మోసకారీసంక్షేమం, కోతలు, రద్దులమయమే. ‘ఇదేంఖర్మ-మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా ప్రజలముందుకెళ్లిన తమకు జగన్ రెడ్డి సాగిస్తున్న రేషన్ బియ్యం దోపిడీ గుట్టుమట్లు తెలిశాయి. ఒకవైపు పేదలబియ్యాన్ని బొక్కేస్తున్న జగన్ రెడ్డి, అర్థంపర్థంలేని నిబంధనలతో అర్హులైన పేదల రేషన్ కార్డుల్ని తొలగిస్తూ రాక్షసానందం పొందుతున్నాడు.

కేంద్రం 9నెలలు పేదలకుబియ్యం ఇవ్వమంటే, జగన్ 4నెలలే ఇచ్చి, 5నెలల బియ్యాన్ని అమ్ముకున్నాడు.కరోనాకాలంలో పేదల కడుపునింపడానికి ఇచ్చే ఉచిత రేషన్ బియాన్ని కూడా జగన్ అండ్ కో సొమ్ముచేసుకుంటున్నారు. 2022 ఏప్రియల్ నుంచి సెప్టెంబర్ వరకు (6నెలలు) ఉచిత బియ్యం పేదలకు ఇవ్వాలని కేంద్రం నిర్ణయిస్తే, ఏపీ ప్రభుత్వం కేవలం 2నెలలు మాత్రమే బియ్యం సరఫరా చేసి చేతులెత్తేసింది. తరువాత అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మరలా కేంద్రం బియ్యంపంపిణీచేస్తే, జగన్ సర్కారు 2నెలలుఇచ్చి ఒకనెల ఎగ్గొట్టింది. కేంద్రప్రభుత్వం పేదలకు 9నెలలు ఉచితంగా బియ్యం ఇవ్వాలనిచెప్పి, వారిలెక్కప్రకారం రాష్ట్రంలోని 89 లక్ష ల కార్డులకు బియ్యం సరఫరాచేసేసింది. కానీ జగన్ రెడ్డి కేవలం 4నెలలు మాత్రమే పేదలకు బియ్యం సరఫరాచేసి, మిగిలిన 5 నెలల రేషన్ బియ్యాన్ని విదేశాలకు తరలించాడు.

పేదలకు దక్కాల్సిన 5నెలల బియ్యం ఎటుపోయాయో జగన్ సమాధానం చెప్పాలి
రేషన్ కార్డులో ఎందరు కుటుంబసభ్యులుంటే, సభ్యుడికి 5కిలోల చొప్పున ప్రతికుటుంబానికి క్రమంతప్పకుండా బియ్యం ఇవ్వాలి. ఒక్కో కుటుంబంలో ముగ్గురుచొప్పున లెక్కేసినా 15కిలోల బియ్యం ఇవ్వాలి. కానీ జగన్ రెడ్డి ఏకంగా 5నెలలపాటు రాష్ట్రంలో బియ్యమే ఇవ్వలేదు. పేదలు ప్రశ్నిస్తే కేంద్రంనుంచి బియ్యం రాలేదని అబద్ధాలు చెప్పాడు. పేదలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని దారిమళ్లించాడు. ఒక్కోకుటుంబానికి చెందాల్సిన 15కిలోల బియ్యాన్ని కేజీ రూ.35చొప్పున (బహిరంగమార్కెట్ ధర) రూ. 525కు అమ్ముకున్నాడు. ఒక్కో కుటుంబానికి నెలకు రూ.525చొప్పున, 5నెలలకు రూ.2,625ల సొమ్ముని (దాదాపు రూ.3వేలు) జగన్ బొక్కేశాడు. జగన్ నిర్వాకంతో, కేంద్రప్రభుత్వ లెక్కలప్రకారం రాష్ట్రంలోని 89లక్షల తెల్లరేషన్ కార్డుదారులు కోవిడ్ సమయంలో రూ.3వేలవరకు నష్టపోయారు. పేదలకు బియ్యం ఇవ్వకుండా వారి కడుపుమాడ్చిన జగన్ రెడ్డి దీనిపై ఏం సమాధానం చెబుతాడు? పేదలకు ఇవ్వాల్సిన 5నెలల బియ్యాన్ని జగన్ ఎటు పంపించాడు?

పేదల బియ్యాన్ని అమ్ముకొని జగన్ రెడ్డి రూ.6వేల కోట్లు కొట్టేశాడు
కరోనా పరిస్థితుల దృష్ట్యా కేంద్రం ప్రతినెలా లక్షా30వేల టన్నుల బియ్యాన్ని రాష్ట్రానికి పంపించింది. నెలకు లక్షా35వేలటన్నుల చొప్పున 5నెలలకు పేదలకు ఇవ్వకుండా జగన్ సర్కారు బొక్కేసిన మొత్తంబియ్యం అక్షరాలా6లక్షల75వేలటన్నులు. 6లక్షల75వేల టన్ను ల బియ్యం విలువలెక్కిస్తే, మార్కెట్ రేటు ప్రకారం కేజీ రూ.35 వేసుకున్నా… రూ.6వేల కోట్లు. కేంద్రమిచ్చిన ఉచిత బియ్యాన్ని 5నెలలు పేదలకు ఇవ్వకుండా, జగన్ రెడ్డి అండ్ కో 6వేలకోట్లు దోచేశారు. ఈ మాట తాము అనడంకాదు.. కేంద్రమే చెప్పింది. తాము రాష్ట్రానికి పంపించే బియ్యం పంపిణీకి జగన్ ప్రభుత్వం లెక్కలుచెప్పడంలేదని కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. పేదవాడి నోటికాడి కూడుని కూడా తినేసే దుస్థితికి జగన్ రెడ్డి వచ్చాడు. బియ్యం అక్రమరవాణాతో రూ.6వేలకోట్లు కొట్టేశాడు.

ద్వారంపూడి ద్వారా జగన్ రెడ్డి రాజప్రాసాదానికి బియ్యం అమ్మకాల సొమ్ము…
జగన్ రెడ్డికి అత్యంత హితుడు, సన్నిహితుడు, ఆయన బినామీ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కనుస్నల్లోనే రాష్ట్రంలో బియ్యం మాఫియా సాగుతోంది. చంద్రశేఖర్ రెడ్డి తండ్రికి సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఛైర్మన్ గా పనిచేసిన అనుభవం ఉంది.చంద్రశేఖర్ రెడ్డి చేతుల్లోనే రైస్ మిల్లర్స్ అసోసియేషన్, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్, పోర్టులు, బియ్యం ఎగుమతులు, దిగుమతులు ఉన్నాయి. అన్నీ తనకిందే ఉన్నప్పుడు పేదలకు దక్కాల్సిన 6లక్షల75వేల టన్నులబియ్యాన్ని జగన్ రెడ్డి రాజప్రాసాదరం పరంచేయడం చంద్రశేఖర్ రెడ్డికి పెద్ద కష్టమేం కాదు.

టీడీపీ ప్రభుత్వం పండుగ సరుకులతో పాటు, రేషన్ దుకాణాల్లో నాణ్యమైన సరుకుల్ని తక్కు వ ధరకే ఇస్తే, జగన్ రెడ్డి వచ్చాక ఉత్తబియ్యంతో సరిపెట్టాడు
టీడీపీ ప్రభుత్వంలో రేషన్ దుకాణాల్లో బియ్యంతో పాటు, ఉప్పు, కందిపప్పు, గోధుమపిండి, అయోడైజ్డ్ సాల్ట్, పంచదార, శానిటరీ న్యాప్ కిన్స్, కేజీ రూపాయికి జొన్నలు, రాగుల వంటివి కూడా పంపిణీ చేశాము. నాణ్యమైన సరుకులతో పాటు, పండుగలసమయంలో అన్నివర్గాల ప్రజలకు బెల్లం, నెయ్యి, నూనె, సేమ్యాలు, గోధుమపిండిని ఉచితంగా అందిం చిన ఘనత చంద్రబాబుది. జగన్ అధికారంలోకివచ్చాక అవన్నీ మాయమయ్యాయి. పంచ దార, కందిపప్పు ధరలుపెంచాడు. వైసీపీప్రభుత్వం రేషన్ దుకాణాల్లో సరఫరాచేసే కందిపప్పు( మొదటిరకం) కేజీ రూ.118అని టెండర్లలో కోట్ చేసింది. కానీ వాస్తవానికి కే.జీ రూ.80లు విలువైన మూడోరకం పప్పుని, (ఆఫ్రికాకందులు) ఎక్కువ ధరకు పేదలకు అంటగడుతున్నారు. కొన్ని రేషన్ దుకాణాల్లో కందిపప్పుకి బదులు శనగలు ఇస్తున్నారు.

రేషన్ పంపిణీలో సొమ్మొకరిది.. సోకొకరిది అన్నట్టుగా వ్యవహరిస్తున్న జగన్…
రేషన్ పంపిణీలో జగన్ రెడ్డి బొమ్మలే తప్ప, పేదలకు ఎక్కడా రేషన్ దొరకడంలేదు. అరకొరగా పేదలకు ఇచ్చే రేషన్ కోసం జగన్ రెడ్డి ఎంతో ఆర్భాటంగా తనబొమ్మలతో కూడిన వాహనాలు ప్రారంభించాడు. వాటికోసం కొన్నివందలకోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశాడు. రేషన్ వాహనాలుఎప్పుడు వస్తాయో తెలియక, ప్రజలు పనులు మానుకొని బియ్యం కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి దాపురించింది. కేంద్రమిచ్చే మోదీ బియ్యం తప్ప, రాష్ట్రంలో పేదలకుఎక్కడా జగన్ బియ్యం సరఫరా కావడంలేదు. అలాంటప్పుడు జగన్ బొమ్మతో కూడిన వాహనాలు, రేషన్ కార్డులపై ఆయన ఫొటోలు అవసరమా? కేంద్రం వేలకోట్ల సబ్సిడీ తో పేదలకు ఉచితంగా బియ్యం ఇస్తుంటే, జగన్ రెడ్డి మాత్రం అంతా తానే ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నాడు. రేషన్ పంపిణీలో సొమ్మొకడది.. సోకొకడిది అన్నట్లుగా జగన్ రెడ్డి తీరుంది. ఇప్పటికైనా జగన్ రెడ్డి అన్నిరకాల నిత్యావసరాలు, తక్కువ ధరకే పేదలకు అందించేలా రేషన్ దుకాణాలను పరిపుష్టంచేయాలి” అని నిమ్మల డిమాండ్ చేశారు.

Leave a Reply