Suryaa.co.in

Andhra Pradesh

అవివేకంతోనే జగన్ అర్థంపర్థం లేని ఆరోపణలు

– రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్

అమరావతి: ఐదేళ్ల పాలనలో ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలి అరాచక పాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి విపత్తు సమయంలో కూడా అవివేకంతో అర్థం పర్ధం లేని ఆరోపణలను చేస్తుండటం తనలోని సైకోతత్వాన్ని ఇంకా ప్రదర్శిస్తున్నారని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మండిపడ్డారు. ముంపునకు గురై తీవ్ర నష్టాన్ని చవిచూసిన బాధితులందరిని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.

శుక్రవారం అజిత్ సింగ్ నగర్ లో వరద బీభత్సంతో ఐదో రోజు కూడా ఇంకా నీట మునిగిన ప్రాంతాల్లో మంత్రి ఫరూక్ మోకాటి లోతు నీళ్లలో పర్యటించారు. ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఫారూక్ షుబ్లీ, ఇతర ముఖ్య నాయకులతో కలిసి మంత్రి పర్యటించారు. అజిత్ సింగ్ నగర్, దాబ కొట్ల రోడ్డు, ముస్తఫా మస్జిద్ వీధి, తదితర ప్రాంతాల్లోని బాధితుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో వరద నీరు ఎక్కువగా ఉండడంతో ట్రాక్టర్ పై ప్రయాణించి మంత్రి ఫరూక్ పరిశీలించారు.

వరద ముంపు ప్రాంతాల్లో మంచినీళ్ల బాటిళ్లు, బిస్కెట్ ప్యాకెట్లు తదితర నిత్యావసరాలను మంత్రి పంపిణీ చేశారు. ముంపునకు గురికావడంతో ముస్తఫా మస్జీదులో పంపింగ్ మోటర్ కాలిపోయిందని, మైక్ ఆడియో ఎక్విప్మెంట్ పూర్తిగా దెబ్బతినిందని, ప్రేయర్ మ్యాట్లు దెబ్బతిన్నాయని మస్జిద్ నిర్వాహకులు మంత్రి ఫరూక్ కు తెలుపుతూ ఆదుకోవాలని కోరారు.

ఈ విషయంపై మంత్రి ఫరూక్ ముంపు ప్రాంతాలలో ఉన్న మస్జిద్ లలో డ్యామేజీలు, వివిధ వివిధ రకాల నష్టాలపై మస్జిదుల వారీగా నష్టాన్ని అంచనా వేసి నివేదిక ఇవ్వాలని వక్ఫ్ బోర్డు సీఈఓ ను ఆదేశిoచారు. నివేదికను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి తదుపరి చర్యలను మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా తీసుకుంటామని మంత్రి ఫరూక్ వెల్లడించారు. తనను కలిసిన మీడియాతో మంత్రి ఫరూక్ మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో నిద్రాహారాలు మాని మంత్రివర్గంతో పాటు అధికార యంత్రాంగం వరద బాధితులను ఆదుకునేందుకు తక్షణ చర్యల్లో భాగంగా యుద్ధ ప్రాతిపదికన క్షేత్రస్థాయిలో పనులు నిర్వహిస్తుంటే వైసీపీ నాయకులు బురదజల్లేందుకు ప్రయత్నిస్తుండడం చూసి రాష్ట్ర ప్రజలంతా సైకో వైసీపీ నాయకుల తీరును చూసి అసహ్యించుకుంటున్నారని విమర్శించారు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ముంపు ప్రాంతాల్లో పర్యటించడం లేదని విమర్శిస్తున్న వైసీపీ నాయకులకు పవన్ కల్యాణ్‌ సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. ఏ కారణంతో పర్యటించలేదు.. తాను పర్యటిస్తే వచ్చే ఇబ్బందులపై బాధ్యత కలిగిన నాయకుడిగా వరద సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఆదేశాలు జారీ చేస్తున్న విషయాన్ని వైసీపీ నాయకులు చూస్తుండకపోవడం, పదేపదే పవన్ పై ఆరోపణలు చేస్తుండడం అర్ధరహితమని ఫరూక్ అన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ ప్రాంతం వరద బీభత్స తాకిడికి అతలాకుతలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క వరద బాధితులని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టినట్టు తెలిపారు.

వరద బీభత్స నష్టాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తో పాటు, కేంద్ర ప్రత్యేక బృందం పరిశీలించిందని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని ప్రభుత్వ శాఖల వారిగా పూర్తి వరద నష్టాన్ని అంచనా వేసి సీఎం చంద్రబాబు నేతృత్వంలో కేంద్రం దృష్టికి తీసుకువెళుతుందని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పురపాలక శాఖ మంత్రి నారాయణలతో మంత్రి ఫరూక్ సమావేశమయ్యారు. బుడమేరు వరద ముంపు ప్రాంతాల్లో పరిస్థితి, క్షేత్రస్థాయిలో వరద సహాయక చర్యలు తదితర అంశాలపై ఫరూక్ చర్చించారు.

LEAVE A RESPONSE