అనగనగా ఒక అమాయక గిరిజన మహిళ. ఆమెకు ఆరేళ్ల కూతురు. కడుపులో మరో బిడ్డ ఉంది. భార్యాభర్త ఇద్దరూ రెక్కల కష్టంతో, ఉన్నంతలో బతుకుబండిని లాగిస్తున్నారు. తెల్లకాగితంలాంటి మనుషులు వాళ్లు. కల్లాకపటం తెలీని అభాగ్యులు. కసాయి పోలీసుల కాసుల కక్కుర్తి ఆమె భర్తను దొంగతనం కేసులో ఇరికించాలని చూస్తుంది. ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది.
భర్తను కళ్లముందే పోలీసులు లాక్కెళుతారు. భర్త బంధువులను పశువు కంటే హీనంగా చిత్రవధ చేస్తారు. ఆ బక్క పలచని శరీరాలపై లాఠీలు విరుచుకుపడతాయి. అత్యంత హృదయవిదారకరం. దారుణం. అది పోలీసు చేసిన పాపం. ఉన్నట్టుండి ఆ మహిళ భర్తతో పాటు మరో ఇద్దరు కూడా కనిపించడం లేదంటూ పోలీసుల హడావుడి. నేరస్తులు తప్పించుకున్నారు… ఇదీ ఆ గిరిజనులకు పోలీసులు ఇచ్చిన టైటిల్.
*
అప్పుడే మొదలవుతుంది అసలు కథ. ఆ అమాయక గిరిజన మహిళ న్యాయం కోసం ఎందరినో కలుస్తుంది. ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. సాయం చేసే చేయి దొరకదు. అన్యాయపు చీకటిలో అలమటిస్తున్న ఆ మహిళకు అప్పుడే లాయర్ చంద్రు రూపంలో న్యాయ వెలుగు కనిపిస్తుంది. ఆ మహిళ భర్త ఏమయ్యాడు? మిగిలిన ఇద్దరూ ఏమయ్యారు? అసలు వీరిపై మోపిన నేరం నిజమేనా..? వీరు పోలీసుల నుంచి తప్పించుకున్నది నిజమేనా? అసలు దొంగలెవరు? లాటీ మాటున దాగున్న కసాయిలెవరు? అమాయక గిరిజనులను పీడించిన రాక్షసులెవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలను లాయర్ చంద్రు అన్వేషిస్తాడు. న్యాయంస్థానం ముందు ఆ వివరాలన్నీ ఉంచుతాడు. చివరికి న్యాయాన్ని గెలిపిస్తాడు.
*
నేను రాసిన పై రెండు పేరాలు జై భీమ్ సినిమా గురించే. మొదటి పేరా ఫస్టాఫ్. రెండో పేరా సెకండాఫ్. 1995లో పోలీసుల అరాచకానికి పరాకాష్టగా నిలిచిన ఒక సంఘటన ఆధారంగా ఈ సినిమా తీశారు. పూర్తిగా కోర్టు డ్రామా ఇది. ఈ జానర్‌లో ఎన్నో సినిమాలు వచ్చాయి. తాజాగా అయితే వకీల్ సాబ్, తిమ్మరుసు, నాంది.. ఇలా వరుసగా ఉన్నాయి. అయితే వీటన్నింటికీ జై భీమ్ సినిమా అతీతం. ఈ సినిమా అద్భుతం. నా వాదనకు చాలా కారణాలు. అవి ఏంటంటే..
1. జై భీమ్ సినిమాలో జీవం ఉంది. అంటే ఈ సినిమా చానాళ్లపాటు బతికే ఉంటుంది. ఈ సినిమాకు ఆ జీవం ఎలా వచ్చింది.? అమాయక గిరిజిన కష్టాలనే కాదు.. సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని చాలా సహజత్వంగా తీశారు. బహుశా ఇదే సినిమాకు జీవాన్ని నింపి ఉంటుంది.
2. సమాజంలో షెడ్యూల్ ట్రైబల్ కులాలు ఎదుర్కొనే వివక్ష, అస్పృశ్యతలను వీలుదొరికిన ప్రతిసారి ఈ సినిమాలో చూపించారు. ఆ సన్నివేశాలు మనల్ని ఇబ్బందిపెట్టవు. ఆ అమాయకులపై జాలిపడేలా చేస్తాయి. ఆలోచింపజేస్తాయి. అన్ని అవమానాలు పడుతూ వారెలా జీవిస్తున్నారా అనిపిస్తుంది..? ఈ సన్నివేశాలన్నీ మన అందరికీ అనుభవపూర్వకాలే.
3. నిజాన్ని మాత్రమే నమ్మే ఒక వకీలు, ఆ నిజాన్ని బతికించడం కోసం పడే తపన ఎలా ఉంటుందో హీరో సూర్య లాయర్ చంద్రు పాత్రలో భలే చూపించారు.
4. అమాయక గిరిజనులు చాలా అందంగా కనిపిస్తారు. వారు చూపే అమాయకత్వం, వారి రెక్కల కష్టం, ఏ ఆశయాలు, లక్ష్యాలు లేకుండా సాగించే వారి జీవనం వల్లనే వారికి ఆ అందం అంటుకుని మనకు కనిపిస్తూ ఉంటుంది.
5. డబ్బుతో నిజాన్ని కొనాలనుకున్న ప్రతిసారి అక్రమార్కులకు ఆశాభంగం కలుగుతూనే ఉంటుంది. ఆ క్రమంలో వారికి బుద్ధి చెప్పేలా రాసుకున్న సంభాషణలు, ఆ పాత్రలు ఆ మాటలను పలికిన తీరు ఎన్నిసార్లయినా చూడాలనిపిస్తుంది. వినాలనిపిస్తుంది.
6. అడ్వొకేట్ జనరల్‌కు సహజంగా ఉండే హంగు, ఆర్భాటం, ఆడంబరాలను అచ్చు అలానే చూపించగలగడం, పోలీసు- న్యాయ శాఖల మధ్య సహజంగా ఉండే అహమనే జగడాన్ని ఎక్కువ లేకుండా, తక్కువ కాకుండా ప్రెజెంట్ చేయడం దర్శకుడి తెలివితేటలకు నిదర్శనం.
7. గిరిజనులపై ఖాకీల అరాచకం, ఓ గిరిజన కుటుంబానికి జరిగిన అన్యాయంపై ఓ న్యాయవాది పోరాటం, అతడికి ఎదురయ్యే సవాళ్లు, వాటిని అధిగమించడం… ఇవన్నీ ఉన్నదిఉన్నట్లుగా, మిల్లీమీటరు కూడా దారి తప్పకుండా, తూకం సమానంగా తూగినట్లుగా, చక్కగా రీలు వేసి చూపించారు ఈ సినిమాలో.
8. మంచి రోజులొచ్చాయి.. లాంటి తుగ్లక్ కామెడీలు, పెద్దన్న లాంటి నేల విడిచి సాము చేయడాలు ఈ సినిమాలో మచ్చుకైనా కనిపించవు.
9. హీరో సూర్య కదా.. అని లేనిపోని ఎలివేషన్ల కు పోలేదు. హీరో అలా కనిపిస్తాడు. ఇలా కథ నడిపిస్తాడు అంతే.
10. ఈ సినిమాలో హీరో సూర్య అదిరిపోయే డ్రస్సులు వేసుకోడు. ఫైట్లు చేయడు. డ్యాన్సులు చేయడు. తుపాకీలు పేల్చడు. పంచ్ డైలాగులు ఉండవు. కానీ మనకు నచ్చుతాడు. మనకు అందంగా కనిపిస్తాడు. ఒక గిరిజన మహిళకు తోడుగా నిలవడమే దీనికి కారణం. అభాగ్యుల కష్టాలను నిజాయితీగా తీరుస్తూ.. ఒక నిజాన్ని బతికించడం కోసం, ఒక కుటుంబాన్ని నిలబెట్టడం కోసం తపనపడుతూ ఒక యువ లాయరు మనకు స్క్రీన్‌పై కనిపిస్తుంటే ఇక డ్యాన్సులు, ఫైట్లు, అరబందరపు డైలాగులు అవసరమా?
11. సాగదీసే సన్నివేశాలు ఉన్నా.. ప్రేక్షకులు ఇబ్బందులకు గురయ్యేలా చిత్రహింసలు చూపుతున్నా మనం అలా చూస్తూనే ఉంటాం అందుకు కారణం ఆయా సన్నివేశాల సమయంలో మనల్ని వెంటాడే నేపథ్యం సంగీతం. ఈ సినిమాలో మనకు వినిపించే సంగీతం ఏ అవార్డుకైనా అర్హత సాధించేదే.
12. కోర్టు సన్నివేశాలను అత్యంత సహజంగా చూపించారు. న్యాయవాదుల వాదనలు, అందుకు న్యాయమూర్తుల స్పందన అన్నీ అత్యంత సహేతుకంగా ఉన్నాయి. విచారణాధికారిగా ఒక దళిత పోలీసునే నియమించాలని లాయర్ చంద్రు కోరగానే గౌరవ న్యాయస్థానం స్పందించిన తీరు చాలా సహజంగా ఉంది.
13. విచారణాధికారి పాత్రలో ప్రకాష్ రాజ్ ఒదిగిపోయారు. న్యాయాన్ని గెలిపించే క్రమంలో ఉన్నతాధికారుల ఒత్తిడి పనిచేస్తున్నా.. కోర్టు అనుగ్రహం ఉండటంతో తన విచారణలో వివక్ష లేకుండా ముందుకువెళ్లగలిగాడు. ఒత్తిళ్లు, కర్తవ్యం రెంటినీ సమన్వయపరుచుకుంటూ ఐజీ స్థాయి అధికారి ఎలా పనిచేశాడో చాలా చక్కగా సినిమాలో చూపించారు.
14.ముఖ్యంగా జ్ఞానవేల్ దర్శకత్వ ప్రతిభ కు ప్రతి సన్నివేశం నిదర్శనంగా నిలుస్తుంది. సమాజమనే శతకోటి పేజీల ఉద్గ్రంధాన్ని లక్ష సార్లు చదివి ఔపాసాన పెట్టిన వాడిలా గొప్ప కళాఖండాన్ని మనకు అందించాడు.
*
ఇంత మంచి సినిమా చేయడానికి ధైర్యం కావాలి. కేవలం న్యాయాన్ని గెలిపించడం కోసం ఒక వకీలు చేసిన పోరాటం ఈ సినిమాకు విజయాన్ని సాధించిపెడుతుందని నమ్మారు. వారి నమ్మకం నిజమైంది. ఈ సినిమాకు జేబులో డబ్బులు ఖర్చు పెట్టి సాహసం చేసిన హీరో సూర్య, ఆయన సతీమణి జ్యోతికకు అభినందనలు చెప్పాల్సిందే. అకాశమే నీ హద్దురా.. సినిమాతో మానసిక వికాసాన్ని, జై భీమ్‌తో మానసిక సంతృప్తిని సూర్య యువతకు పంచినట్లే. ఈ రెండు సినిమాలు నిజంగా ఆణిముత్యాలే.
*
మనసున్న మా రాజులందరినీ ఈ సినిమా ఏడిపిస్తుంది.
ముఖ్యంగా ఆ గిరిజన మహిళను మాత్రం సినిమా చూస్తున్నంత సేపు జాగ్రత్తగా గమనించండి. ఆమె అమాయకత్వం, ఆమె ఆవేదన, సమాజాన్ని ఆమె ప్రశ్నించే తీరు మనల్ని కంట తడి పెట్టిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా పతాక సన్నివేశంలో న్యాయమూర్తి గిరిజన రాజన్న కుటుంబానికి అన్యాయం జరిగిందని చెప్పగానే ఆమె కోర్టులో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత న్యాయమూర్తి ఆ కుటుంబానికి ఎంత ఆర్థిక సాయం చేయాలో చెబుతున్నది కూడా వినదు. ఆమెకు కావాల్సింది న్యాయం అంతే. డబ్బు కాదు. కోర్టు నుంచి బయటకు వచ్చి, ఆరేళ్ల తన కూతురిని పక్కనే కూర్చోబెట్టుకుని వర్షంలో తడుస్తూ ఆ గిరిజన మహిళ మనకు కనిపిస్తుంది. ఆప్పుడే ఆమె రెండు చేతులూ జోడించి లాయర్ చంద్రుకు నమస్కరిస్తుంది. ఈ సన్నివేశం చూసే ప్రతి ఒక్కరికి తెలీకుండానే కన్నీళ్లు జలజలా రాలతాయి. రండి చూద్దాం.. జై భీమ్ సినిమా చూసి మనలోని చెడుని గెలుద్దాం.
*
నేను ఈ సమీక్షను గిరిజన యువతి నుంచి మొదలుపెట్టి రాశాను. సినిమా కూడా అంతే ఆమెతోనే ప్రారంభమవుతుంది. ఆమెతోనే ముగుస్తుంది. ఈ పాత్ర పోషించిన లిజో మోల్ జోసే కు జాతీయ అవార్డు రావాలని నేను ఆశిస్తున్నాను. ఈ సినిమాకు నేపథ్య సంగీతం అందించిన షాన్ రొనాల్డ్ కూడా జాతీయ అవార్డు దక్కడానికి పూర్తిగా అర్హుడు. ఈ సినిమాకు సంబంధించి ఈ ఇద్దరూ నాకు ప్రత్యేకం.
దొడ్డా రామకృష్ణ, గుంటూరు