* చిన్మయ్ కృష్ణ ప్రభు విషయంలో బంగ్లాదేశ్ తీరుపై ఆగ్రహం
* యావత్ ప్రపంచ స్పందనతో మానవత్వాన్ని చాటాల్సిన అవసరంపై పవన్ పిలుపు
అమరావతి: ఇస్కాన్‌కు చెందిన బంగ్లాదేశ్ స్వామి చిన్మయ్ కృష్ణ ప్రభు విషయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత కొణిదెల పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ దేశానికి వ్యతిరేకంగా హిందువులను రెచ్చగొడుతున్నారన్న కారణంగా చిన్మయ్ కృష్ణ ప్రభును బంగ్లాదేశ్ ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో పెట్టిన సంగతి తెలిసిందే. అయితే, అతనికి ఎలాంటి న్యాయపరమైన సాయం చేయడం లేదు. జైల్లో ఆయనను హింసిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ఆయనకు మద్దతుగా గతంలోనూ మాట్లాడారు. తాజాగా మరోసారి ఆయన చిన్మయ్ కృష్ణ ప్రభు కోసం ప్రపంచం అంతా స్పందించాల్సిన అవసరం ఉందని పిలుపునిస్తూ శుక్రవారం సుదీర్ఘమైన ట్వీట్ పెట్టారు.
కసబ్ ఉదంతాన్ని గుర్తుచేస్తూ…
ముంబై దాడుల్లో పట్టుబడిన అత్యంత క్రూరమైన ఉగ్రవాది కసబ్ విషయంలో మనం (భారతదేశం) అత్యంత ప్రజాస్వామ్యంగా వ్యవహరించామని.. అన్ని రకాల న్యాయ సహాయాలు అందేలా చూశామని పవన్ కల్యాణ్ తన ట్వీట్ లో గుర్తు చేశారు. తన ట్వీట్ లో కేస్ నెంబర్ వన్ గా కసబ్ అంశాన్ని ప్రస్తావించారు. అతను దేశంపై దాడికి వచ్చినప్పటికి అతనికి హక్కుల పరంగా రావాల్సినవి కల్పించారని .. మంచి పటిష్ఠమైన భద్రత కల్పించారని .. భాషాపరంగా వచ్చే సమస్యలను సైతం అధిగమించేందుకు ఏర్పాట్లు చేసి.. అన్ని అధారాలను ప్రపంచం ముందు పెట్టి శిక్షించారని అన్నారు. ఓ ఉగ్రవాది విషయంలో భారత్ ఇంత సహనంగా వ్యవహరించిన విషయాన్ని ప్రపంచం మొత్తం ఆనాడు చూసిందన్నారు. భారత్ లో ఉన్న హ్యూమన్ రైట్స్, సోషల్ టోలరెన్స్, పారదర్శక విచారణను ప్రపంచం మొత్తం గమనించిందని గుర్తుచేశారు.
చిన్మయకృష్ణ విషయంలో మాత్రం….
ఇక్కడ రెండో కేసు విషయానికొస్తే.. బంగ్లాదేశ్ అరెస్టు చేసిన చిన్మయకృష్ణ ప్రభు అంశాన్ని పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. నోబుల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఉన్న దేశంలో హిందువుల కోసం గొంతెత్తిన చిన్మయ్ కృష్ణ ప్రభును అరెస్టు చేశారని .. దేశ ద్రోహం కేసులు పెట్టారని గుర్తు చేశారు. ఆయనకు న్యాయపరంగా ఎలాంటి అవకాశాలు లేకుండా చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం కోర్టులోనూ హాజరు పెట్టడంలేదన్నారు. పారదర్శక విచారణకు అవకాశం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అందరూ స్పందించాలని పవన్ పిలుపు
ఈ అంశంపై ఇప్పుడు ప్రపంచం మొత్తం స్పందించాల్సిన అవసరం ఉందని పవన్ స్పష్టం చేశారు. సూడో సెక్యూలరిస్టులు, మానవహక్కుల ఛాంపియన్లుగా ప్రకటించుకునేవారు, ప్రపంచ లీడర్లుగా కిరీటాలు పెట్టుకున్నవారు ఇప్పుడు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. సందర్భాలను బట్టి న్యాయం వేర్వేరుగా ఉంటోందని ప్రశ్నించారు. చిన్మయ్ కృష్ణ ప్రభుకు కనీస హక్కులు కల్పించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ప్రపంచం మొత్తం ఈ విషయం పై స్పందించాల్సి ఉందని.. మానవత్వం అనేది ఈ ‘స్పందన’ పైనే ఆధారపడి ఉందన్నారు.