– కోవర్టులని తెలిసీ పార్టీలో చేర్చుకుని ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఎలా ఇచ్చారు?
– దమ్ముంటే పార్టీలో చేర్చుకున్న వారినందరిని బయటకు పంపాలి
మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) సవాల్
మచిలీపట్నం: రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ లిక్కర్ తయారు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్న నిందితులంతా టీడీపీ నాయకులేనని, కానీ వారిని లోతుగా విచారించకుండా తూతూ మంత్రంగా చార్జిషీట్లు వేస్తున్నారన్న పేర్ని నాని, దీనిపై వైయస్సార్సీపీ మాట్లాడితే నిందితులంతా మా పార్టీ కోవర్టులని అడ్డగోలుగా వాదించడం సిగ్గుచేటని మండిపడ్డారు.
ములకలచెరువు కల్తీ లిక్కర్ కేసులో నిందితుడైన ఈ జయచంద్రా రెడ్డిని జయహో బీసీ సదస్సులో చంద్రబాబు టీడీపీలో చేర్చుకున్నారు. పార్టీలో చేర్చుకున్న మూడు నెలలకే ఆయనకు తంబళ్లపల్లె టీడీపీ టికెట్ ఇచ్చారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత కూడా ఆయన నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి గానే కొనసాగుతున్నాడు.
ఒకసారి జయచంద్రా రెడ్డి 2024 ఎన్నికల అఫిడవిట్ చూస్తే సెంట్రల్ ఆఫ్రికా, వెస్ట్ ఆప్రికాలలో తనకి రెండేసి ఫ్యాక్టరీలున్నట్టు ఆయనే స్వయంగా ప్రకటించుకున్నాడు. ఇలాంటి వ్యక్తిని చంద్రబాబు పిలిచి పార్టీలో చేర్చుకుని మూడు నెలల్లోనే తంబళ్లపల్లె టీడీపీ టికెట్ ఇచ్చాడు. ఇబ్రహీంపట్నం లిక్కర్ దందాలో పట్టుబడిన జనార్దన్ రావు సైతం టీడీపీ నాయకుడే. చంద్రబాబు నుంచి జయచంద్రా రెడ్డి పార్టీ బీఫారం తీసుకుంటున్న సందర్భంలో జనార్దన్ రావు కూడా పార్టీ కండువా కప్పుకుని పక్కనే ఉన్నాడు. మరో నిందితుడు కట్టా సురేంద్ర నాయుడు సైతం టీడీపీ కండువా కప్పుకుని మంత్రి రాంప్రసాద్‌తోనే తిరుగుతున్నాడు.
ఆఫ్రికాలో తనకు లిక్కర్ వ్యాపారాలున్నాయని అఫిడవిట్లో ప్రకటించిన జయచంద్రా రెడ్డికి పార్టీ కోసం కష్టపడుతున్న శంకర్ యాదవ్‌ను కూడా కాదని టికెట్ ఎలా ఇచ్చారు? మా కోవర్ట్ అయితే టికెట్ ఎలా ఇచ్చారు? జయచంద్రా రెడ్డిని పార్టీలోకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించింది ఈ సురేంద్ర నాయుడు కాదా? గతంలో వైయస్సార్సీపీలో పనిచేసినంత మాత్రాన వారంతా మా పార్టీ కోవర్టులవుతారా? మా కోవర్టులను చేర్చుకుని ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఎందుకిచ్చారు? మంత్రి పదవులు ఎందుకిచ్చారు? వాళ్లను కూడా సస్పెండ్ చేయకుండా టీడీపీలో ఎందుకు ఉంచుకున్నారు?