– స్కూల్ పిల్లల భోజనం, ఆసుపత్రిలో మందులు.. అంతా కల్తీ మయం
– కూటమి పాలనపై వైయస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫైర్
విశాఖపట్నం: పిల్లలకిచ్చే తాగునీరు మొదలు భోజనం, ఆసుపత్రిలో మందులు, మద్యం సహా అంతా కూటమి పాలనలో కల్తీమయమైందని వైయస్సారీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండిపడ్డారు.
పదే పదే సంపద సృష్టిస్తామని చంద్రబాబు చెబుతుంటే అర్ధం కాని రాష్ట్ర ప్రజలకు కల్తీమద్యం అమ్మకాల ద్వారా కల్తీ సంపద సృష్టిస్తారని ఇప్పుడు అర్ధం అయింది. కల్తీ మద్యం స్కామ్ లో కీలకనిందితుడు జయచంద్రారెడ్డి.. 2025 ఎన్నికల్లో తంబళ్లపల్లి టీడీపీ ఇన్ ఛార్జ్, 2024 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన వ్యక్తి, అతని పీఏ, బావమరిది గిరిధర్ రెడ్డి, మరో టీడీపీ నేత జనార్ధన రావులు కలిసి మొలకల చెరువులో ఏకంగా కుటీర పరిశ్రమ తరహాలో కల్తీ మద్యం తయారుచేసే ఫ్యాక్టరీయే ఏర్పాటు చేశారు.
కల్తీ మద్యం తాగి ఏలూరులో, పల్నాడు, సత్యసాయి జిల్లాల్లో 4 గురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఎక్సైజ్ శాఖ ,ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నట్టు ? ఈ విషయాలన్నీ తెలియాలంటే సీబీఐ విచారణ చేయించాలని మా పార్టీ ఎంపీ మిధున్ రెడ్డి కేంద్ర మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీ నేతలే కల్తీ మద్యం తయారీలో ఉన్నారు.. వీరితో పాటు ఇంకా మరింత మంది టీడీపీ నేతల బాగోతాలు బయటపడతాయనే సీబీఐ విచారణకు భయపడుతున్నారు.
ఏపీ మద్యం తాగి ఆరోగ్యం పాడైన బాధితులు పెద్ద సంఖ్యలో వస్తున్నట్లు హైదారాబాద్ కు చెందిన కొంతమంది వైద్యులు చెప్పారన్న పవన్ కళ్యాణ్… ఇవాళ ఏపీలో కల్తీ మద్యాన్ని కూటమి నేతలే కుటీర పరిశ్రమలా తయారు చేసి విక్రయిస్తుంటే మీ కళ్లకు కనిపించడం లేదా? ఇప్పుడు ఏపీలో కల్తీ మద్యం బాధితులకు మీ దగ్గరకు వచ్చారా అని మీరు హైదారాబాద్ లో డాక్టర్లను అడగడం లేదా? ఈ కల్తీ మద్యానికి మీరు బాధ్యత వహించరా?